గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలి

నంద్యాల స్టూడియో భారత్ పత్రినిధి

Jan 14, 2026 - 08:42
 0  18
గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలి

గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలి

కేసీ కెనాల్, ఎల్‌ఎల్‌సీ, ఆర్‌డీఎస్ ప్రాజెక్టుల ఆయకట్టులకు బరోసా కల్పించాలి. 

గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణాన్ని తక్షణమే చేపట్టి కేసీ కెనాల్, తుంగభద్ర దిగువ కాలువ (ఎల్‌ఎల్‌సీ), ఆర్‌డీఎస్ (తెలంగాణ) ఆయకట్లను పరిరక్షించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామి రెడ్డి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరారు.గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణ ఆవశ్యకతను వివరిస్తూ వ్రాసిన ఉత్తరాన్ని ముఖ్యమంత్రి గారికి పంపించినట్టుగా బొజ్జా ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. 

ఈ సందర్భంగా మంగళవారం నంద్యాల సమితి కార్యాలయంలో దశరథరామిరెడ్డి మాట్లాడుతూ..దేశంలోనే అతి పురాతన సాగునీటి వ్యవస్థగా, ప్రపంచ వారసత్వ సాగునీటి నిర్మాణంగా గుర్తింపు పొందిన కర్నూలు – కడప కెనాల్ (కేసీ కెనాల్) ద్వారా 2.75 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిచాల్సి ఉందని తెలిపారు.‌ అలాగే ఎల్‌ఎల్‌సీ, ఆర్‌డీఎస్ ప్రాజెక్టులు రాయలసీమ పశ్చిమ కర్నూలు ప్రాంతం మరియు తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరు, త్రాగునీటికి ప్రధాన ఆధారాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న కర్నూలు నగరం, పశ్చిమ ప్రాంత లక్షలాది ప్రజలకు ఈ గుండ్రేవుల నిర్మాణం ద్వారా శాశ్వతంగా త్రాగునీటి సమస్యను నిర్మూలించవచ్చని లేఖలో పేర్కొన్నారు.

తుంగభద్ర రిజర్వాయర్‌లో తీవ్రమైన పూడిక కారణంగా నిల్వ సామర్థ్యం తగ్గిపోవడం, వాతావరణ మార్పుల ప్రభావంతో వర్షాల స్వరూపం మారడం, తగిన స్థాయిలో నీరు నిలువ చేసుకునే రిజర్వాయర్ వసతులు లేని కారణంగా రైతులకు సాగునీటి భరోసా లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. సాగునీటి సలహా మండలి సమావేశాల్లో నీటి విడుదల ప్రారంభ తేదీ మాత్రమే చెబుతూ, ఎంతకాలం నీరు అందుతుందో స్పష్టత ఇవ్వలేని పరిస్థితి రైతులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోందని తెలిపారు.

రాయలసీమ సాగునీటి సాధన సమితి చేసిన కృషితో శాశ్వత పరిష్కారంగా 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే డిపిఆర్ కు అనుమతులు సాధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా రాష్ట్ర విభజన అనంతరం గుండ్రేవుల రిజర్వాయర్ సాధన కోసం సమితి అనేక కార్యక్రమాలు నిర్వహించిందని, ఈ కార్యక్రమాల పరంపరలో భాగంగా వేలాదిమంది ప్రజలతో 2018లో కర్నూలు నుంచి గుండ్రేవుల వరకు రెండు రోజుల పాదయాత్ర నిర్వహించిన తదనంతరం, ఇక్కడి ప్రజల ఆకాంక్షలను గుర్తించి తమరు ఈ ప్రాజెక్టుకు పాలనపరమైన అనుమతిని ఇచ్చి శంకుస్థాపన కార్యక్రమం 2019 లో చేపట్టిన విషయాన్ని కూడా ఆయన లేఖలో చంద్రబాబునాయుడి గారికి గుర్తు చేశారు.2024 ఎన్నికల సందర్భంగా గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి ప్రజల సాగు, త్రాగునీటి సమస్యలను తీరుస్తామని హామీ ఇచ్చారనీ కానీ ఇప్పటివరకు ఈ రిజర్వాయర్ నిర్మాణంలో పురోగతి లేకపోవడం బాధాకరమన్నారు.

తుంగభద్ర, కృష్ణా జలాలను రెండు రాష్ట్రాల ప్రయోజనార్థం సమర్థంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్,తెలంగాణ ముఖ్యమంత్రులు ప్రస్తావిస్తున్న ప్రస్తుత సందర్భాన్ని స్వాగతిస్తూ,గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణాన్ని అత్యున్నత ప్రాధాన్యతతో చేపట్టి,అంతర్రాష్ట్ర సమన్వయంతో, తక్షణ అమలు దిశగా అవసరమైన నిధుల విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ ప్రాజెక్టు అమలుతో రాయలసీమ, తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలకు చెందిన లక్షలాది ప్రజలకు దీర్ఘకాలిక జల భద్రత, సాగు స్థిరత్వం, సమతుల్య అభివృద్ధి సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు ఏరువ రామచంద్రారెడ్డి, సౌదాగర్ ఖాసీం మియా,పట్నం రాముడు,కొమ్మా శ్రీహరి పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin top avernace of telugu news