ఉచిత ఇసుకకు తెలంగాణ బాటేనా

జగ్గయ్యపేట స్టూడియో భారత్ పత్రినిధి

Aug 20, 2026 - 16:38
 0  59
ఉచిత ఇసుకకు తెలంగాణ బాటేనా

ఉచిత ఇసుకకు తెలంగాణ బాటేనా!

జగ్గయ్యపేట సరిహద్దులో ఇసుక రవాణాపై అనుమానాలు

అధికారుల పర్యవేక్షణ లోపమే ఆసరా? ఇసుక రీచ్ అనుమతులపై స్పష్టత ఎక్కడ?

జగ్గయ్యపేట: 

పేదలు, సామాన్య ప్రజల నిర్మాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుక విధానం అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.యన్.టి.ఆర్. జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో ఇక్కడి నుంచి ఇసుకను తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.అధికారుల తనిఖీలు, పర్యవేక్షణ ఉన్నప్పటికీ అక్రమ రవాణాకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

జగ్గయ్యపేట నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో ఇసుకను భారీగా నిల్వ చేసి, రాత్రి వేళల్లో లారీల ద్వారా తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో సరిహద్దుకు సమీపంగా ట్రాక్టర్లలో ఇసుకను లోడ్ చేసి తెలంగాణ వైపు తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

పాలేరు వాగు పరిసరాల్లో కొత్త విధానం...

పాలేరు వాగు పరిసర ప్రాంతాల్లో ఇసుకను తీసుకొచ్చి రాతిబండలపై లారీల నుంచి అన్‌లోడ్ చేసి, అక్కడి నుంచి తెలంగాణకు చెందిన ట్రాక్టర్లలో మళ్లీ లోడ్ చేసి తరలిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ తరహా అన్‌లోడింగ్‌–రీలోడింగ్‌ జరిగితే అసలు ఇసుక ఎక్కడి నుంచి వచ్చింది.దానికి అనుమతి ఉందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అదేవిధంగా గూడ్స్‌ క్యాబిన్‌ కలిగిన భారీ వాహనాలను ఉపయోగించి కూడా ఇసుకను సరిహద్దు దాటిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా పూర్తి స్థాయి విచారణ జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

నియోజకవర్గంలో అనుమతులున్న రీచ్‌ లు ఎన్ని ఉన్నాయి.

జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం ఎన్ని ఇసుక రీచ్‌లకు అధికారిక అనుమతులు ఉన్నాయి.ఏ రీచ్‌ నుంచి రోజుకు ఎంత పరిమాణంలో ఇసుక తరలించేందుకు అనుమతి ఉంది.వాస్తవంగా ఎంత ఇసుక రవాణా అవుతోంది.అనే వివరాలను అధికారులు ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఉంది.

అనుమతి పొందిన పరిమాణానికి మించి ఇసుక తరలిస్తే దానిపై నిఘా ఎలా ఉంది.సరిహద్దు మార్గాల్లో రాకపోకలు సాగించే ఇసుక వాహనాలపై సంబంధిత శాఖలు ఎలాంటి తనిఖీలు నిర్వహిస్తున్నాయి.అనే అంశాలపైనా స్పష్టత రావాల్సి ఉంది.

వాల్టా నిబంధనల అమలు పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అనుమతులు లేని ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు జరిగితే నదులు, వాగులు, నీటి ప్రవాహ ప్రాంతాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాల్టా నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇసుక తవ్వకాలు జరిగితే భవిష్యత్తులో భూగర్భ జలాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి.

పూర్తి స్థాయి లో కొరవడిన అధికారుల నిఘా

ప్రభుత్వం పేదల నిర్మాణ అవసరాల కోసం అందిస్తున్న ఉచిత ఇసుక ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిపోతే, ఉచిత ఇసుక విధానం అసలు లక్ష్యమే దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుందని ప్రజలు అంటున్నారు.

ఇతర రాష్ట్రాలకు ఉచిత ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్న నేపథ్యంలో, జగ్గయ్యపేట సరిహద్దు ప్రాంతంలో వినిపిస్తున్న ఆరోపణలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. అనుమతులున్న రీచ్‌లు,రవాణా పరిమితులు, వాహనాల తనిఖీలు, సరిహద్దు దాటుతున్న ఇసుక రవాణాపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇసుక రవాణాపై వస్తున్న ఆరోపణలు నిజమా? లేక నిబంధనలకు లోబడే రవాణా జరుగుతోందా? అన్నది అధికారుల తనిఖీలతోనే తేలాల్సి ఉంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin top avernace of telugu news