పులిచింతల నీటిపై కొత్త టెన్షన్
పులిచింతల స్టూడియో భారత్ పత్రినిధి
పులిచింతల నీటిపై కొత్త టెన్షన్!
తెలంగాణ లిఫ్ట్ స్కీముల వరుసతో జగ్గయ్యపేట రైతుల్లో ఆందోళన
నీటి కేటాయింపులు ఎంత? కొరత వస్తే ప్రాధాన్యత ఎవరికీ?
తెలంగాణ పులిచింతల ప్రాజెక్టు వద్ద బయటపడుతున్న భారీ పంపింగ్ సామర్థ్యాలు.. జగ్గయ్యపేట దిగువ ప్రాంతాల నీటి భద్రతపై స్పష్టత ఎక్కడ?
జగ్గయ్యపేట
పులిచింతల జలాశయం.. కృష్ణా దిగువ ప్రాంతాల సాగునీటి భద్రతకు కీలకమైన జలవనరు. అలాంటి జలాశయం బ్యాక్ వాటర్ ను ఆధారంగా చేసుకుని తెలంగాణ వైపు వరుసగా లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ప్రతిపాదితమవుతున్న నేపథ్యంలో జగ్గయ్యపేట ప్రాంత రైతుల నీటి భద్రతపై కొత్త ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
పులిచింతల ప్రాజెక్టు పై తెలంగాణ రాష్ట్రంలో ఆయకట్టుకి నీరు అందించే మేజర్ పలు లిఫ్ట్ పథకాలను ప్రారంభించడం జరిగిందని తెలుస్తోంది.
తెలంగాణ లో రాజీవ్ గాంధీ ఎల్‌ఐఎస్–బుగ్గమాదారం కు 14,100 ఎకరాల ఆయకట్టు, 236 క్యూసెక్కుల డిశ్చార్జి, 1,800 మి.మీ. వ్యాసం కలిగిన ఎంఎస్ పైపులైన్ 21.8 కి.మీ. మేర ఉన్నట్లు,అలాగే జనపహాడ్ బ్రాంచ్ కెనాల్ కు ఎల్‌ఐఎస్, బెట్టెతండా ఎల్‌ఐఎస్, నక్కగూడెం ఎల్‌ఐఎస్, ముక్త్యాల ఎల్‌ఐఎస్ ,వెల్లటూరు వంటి పథకాల పేరుతో నిర్మాణాలు పూర్తి కాబోతున్నట్లు సమాచారం.
తెలంగాణ లో పులిచింతల ఎగువ ప్రాంతంలో స్కీం ల వల్ల కృష్ణ వాటర్ ని 0.653 టీఎంసీ, 0.242 టీఎంసీ, 0.100 టీఎంసీ, 5 టీఎంసీ లుగా ఉంది. అంటే మొత్తం సుమారు 5.995 టీఎంసీలుగాను,గేటుకి దిగువన తెలంగాణ రాష్ట్రం బుగ్గమాదారం నుండి మరో సుమారు 5 టియంసిలు వాటర్ ని పులిచింతల ప్రాజెక్టు నుండి వాడుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది.
అందుకే “మొత్తం తెలంగాణ లిఫ్ట్ స్కీములకు వాస్తవ నీటి అవసరం ఎంత?” అన్న ప్రశ్నకు ప్రభుత్వం స్పష్టమైన అధికారిక లెక్క తేలాల్సిన అవసరం ఉంది.
నీరు ఉన్నప్పుడు కాదు.. కొరత వచ్చినప్పుడే అసలు పరీక్ష
అసలు ఆందోళన ఇదే.
కృష్ణాలో సమృద్ధిగా నీరు వచ్చినప్పుడు ఎన్ని పథకాలు నీటిని ఎత్తిపోసుకున్నా పెద్దగా సమస్య కనిపించకపోవచ్చు. కానీ వర్షాలు తగ్గి.. ఎగువన ప్రవాహాలు తగ్గి..పులిచింతలలో నిల్వలు పడిపోయిన సమయంలో పరిస్థితి ఎలా ఉంటుంది?
పులిచింతలలో కనీస ఆపరేటింగ్ స్థాయి ఎంత?
ఏ స్థాయిలో లిఫ్ట్ పంపింగ్ నిలిపివేయాలి?
నీటి కొరత సమయంలో ఏ పథకానికి ఎంత నీరు?
దిగువ ఆంధ్రప్రదేశ్ సాగుకు అవసరమైన నీటిని ముందుగా ఎలా రక్షిస్తారు?
తెలంగాణ లిఫ్ట్ పథకాలకు ప్రాజెక్టు వారీగా అధికారిక కేటాయింపులు ఉన్నాయా?
రెండు రాష్ట్రాలు కలిసి అమలు చేసే ఆపరేషన్ ప్రోటోకాల్ ఉందా?
ఇవన్నీ ఇప్పటికీ ప్రజలకు స్పష్టంగా తెలియాల్సిన ప్రశ్నలే.
పులిచింతలలో నీటి నిల్వల ప్రాధాన్యతను గతంలోనే అధికారులు, నీటిపారుదల వ్యవస్థలు స్పష్టం చేశాయి. ఉదాహరణకు 2024లో నీటి నిల్వ 0.8 టీఎంసీకి పడిపోయినప్పుడు కృష్ణా డెల్టా సాగు అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి 10 టీఎంసీలను పులిచింతలకు విడుదల చేయాలని కృష్ణా జిల్లా ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు తీర్మానించినట్లు The Pioneer నివేదించింది.
అంటే నీటి కొరత అనేది ఊహాజనిత సమస్య కాదు; గతంలోనే పులిచింతల నిల్వలపై ఒత్తిడి వచ్చిన సందర్భాలు ఉన్నాయి.
జగ్గయ్యపేటకు కావాల్సింది రాజకీయ హామీ కాదు.. నీటి లెక్క తేలాల్సిన అవసరం వచ్చింది...
అలాంటి సమయంలో అదే కృష్ణా జలవనరుపై ఎగువ వైపు లిఫ్ట్ పథకాల విస్తరణ జరిగితే.. రెండు వైపుల నీటి అవసరాలను ఎలా సమన్వయం చేస్తారు? అన్నదే జగ్గయ్యపేట రైతుల అసలు ప్రశ్న.
ప్రజాప్రతినిధులకు 7 ప్రశ్నలు
1. పులిచింతల బ్యాక్‌వాటర్‌పై ఆధారపడే ప్రతి తెలంగాణ లిఫ్ట్ స్కీమ్‌కు అధికారిక నీటి కేటాయింపు ఎంత?
2. అన్ని పథకాల కలిపి వార్షిక నీటి అవసరం ఎంత టీఎంసీలు?
3. నీటి ఎద్దడి సమయంలో పంపింగ్‌కు క్రమం, పరిమితులు నిర్ణయించారా?
4. పులిచింతలలో కనీస నీటిమట్టం/రిజర్వ్ స్టోరేజ్ ఎంతగా పరిగణిస్తున్నారు?
5. జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు ప్రాంతాల సాగునీటి అవసరాలకు ఏదైనా స్పష్టమైన భద్రతా ప్రణాళిక ఉందా?
6. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ మధ్య ఈ పథకాల నిర్వహణకు సంబంధించి లిఖితపూర్వక ఆపరేషన్ ప్రోటోకాల్ ఉందా?
7. ప్రస్తుతం ప్రతిపాదన, నిర్మాణం, పూర్తి దశల్లో ఉన్న ప్రతి లిఫ్ట్ పథకం స్థితి ఏమిటి?
ఇప్పుడు కావాల్సింది ‘ఎవరి నీరు?’ అనే రాజకీయ వాదన కాదు
కృష్ణా జలాల విషయంలో తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల హక్కులు, కొరత సమయంలో నిర్వహణ వంటి అంశాలు అంతర్రాష్ట్ర జల వివాద వ్యవస్థలో భాగంగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక సమాచారం ప్రకారం కూడా కృష్ణా నీటి భాగస్వామ్యం, ప్రాజెక్టుల వారీ కేటాయింపులు, ఆపరేషన్ అంశాలు అంతర్రాష్ట్ర చర్చల్లో ఉన్నాయి.
అందువల్ల జగ్గయ్యపేట ప్రజలకు కావాల్సింది భయపెట్టే ప్రచారం కాదు.. దాచిపెట్టని నీటి లెక్క.
పులిచింతలలో ఎంత నీరు ఉంది?
ఎవరు ఎంత తీసుకుంటారు?
కొరత వస్తే ఎవరి అవసరానికి ఎంత నీరు మిగులుతుంది?
జగ్గయ్యపేట రైతులకు ఎంత నీరు హామీగా ఉంటుంది?
ఈ నాలుగు ప్రశ్నలకు అధికారికంగా, గణాంకాలతో సమాధానం వస్తేనే పులిచింతల నీటిపై నెలకొన్న అనుమానాలకు తెరపడుతుంది.**పులిచింతల నీరు ప్రజల జీవనాధారం..నీటి లెక్కలు ప్రజల ముందుంచడం ప్రభుత్వాల బాధ్యత!**
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0