ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలకు తరలిరండి
హైదరాబాద్
ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలకు తరలిరండి
అక్టోబర్ 10న హైదరాబాద్‌లో గిరిజనుల భారీ సాంస్కృతిక సమ్మేళనం
ట్యాంక్ బండ్ పై ఠానూ నాయక్ విగ్రహం ఏర్పాటు చేయాలి
గోర్ బోలి భాషకు గుర్తింపు కల్పించాలి: గిరిజన సంఘాల డిమాండ్
హైదరాబాద్ - సెప్టెంబర్ 27
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు ఠానూ నాయక్ పోరాట స్ఫూర్తిని చాటుతూ అక్టోబర్ 10న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను విజయవంతం చేయాలని గిరిజన సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, భాష, హక్కుల పరిరక్షణ లక్ష్యంగా నిర్వహించే ఈ ఉత్సవాలకు గిరిజనులు, కళాకారులు, యువత, వివిధ గిరిజన సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎం. ధర్మ నాయక్ అధ్యక్షతన నిర్వహించిన గిరిజన ఆత్మీయ సమ్మేళనంలో ఈ మేరకు పిలుపునిచ్చారు. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీరాం నాయక్ ప్రతిపాదించిన తీర్మానంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
గిరిజన సంస్కృతికి నంగారా ఉత్సవాలు వేదిక
గిరిజనుల సాంస్కృతిక వారసత్వం క్రమంగా కనుమరుగవుతున్న పరిస్థితుల్లో నంగారా ఉత్సవాలు గిరిజనుల సంప్రదాయాలు, కళలు, జీవన విధానం, ఐక్యతను ప్రతిబింబించే వేదికగా నిలుస్తాయని నాయకులు పేర్కొన్నారు. ఠానూ నాయక్ వంటి పోరాట యోధుల స్ఫూర్తిని నేటి తరానికి పరిచయం చేయడంతో పాటు, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు.
ట్యాంక్ బండ్ పై ఠానూ నాయక్ విగ్రహం ఏర్పాటు చేయాలి
తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాడి వీరమరణం పొందిన ఠానూ నాయక్ విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.మహనీయులు,పోరాట వీరుల విగ్రహాలను ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఠానూ నాయక్‌కు కూడా సముచిత స్థానం కల్పించాలని కోరారు.
గోర్ బోలి భాషకు రాజ్యాంగ గుర్తింపు
బంజారా గిరిజనులు మాట్లాడే గోర్ బోలి భాషకు లిపిని గుర్తించి, రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని సమావేశం డిమాండ్ చేసింది. భాషను కాపాడుకోవడం ద్వారా గిరిజనుల సాంస్కృతిక అస్తిత్వాన్ని పరిరక్షించవచ్చని నాయకులు పేర్కొన్నారు.
రెండు రోజుల మహాసభల్లో కీలక తీర్మానాలు
తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర నాలుగో మహాసభలు అక్టోబర్ 10, 11 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై రెండు రోజుల పాటు చర్చించనున్నట్లు నాయకులు తెలిపారు. అనంతరం పలు తీర్మానాలు చేసి, భవిష్యత్తులో ఐక్య ఉద్యమాలకు కార్యాచరణ రూపొందించనున్నట్లు వెల్లడించారు.
దయచేసి దీనిని కూడా చదవండి ... https://studiobharat.com/Vijayawada-tension-among-secretariat-employees
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని సమావేశంలో నాయకులు ఆరోపించారు. చేవెళ్ల డిక్లరేషన్‌లో గిరిజనులకు ఇచ్చిన 12 హామీలను ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ, వాటిలో ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని వారు విమర్శించారు.
అక్టోబర్ 10న భారీగా తరలిరావాలి
ఎల్బీనగర్‌లోని సహారా రోడ్ ప్రాంతంలో ఎం.ఈ. రెడ్డి ఫంక్షన్ హాల్ వేదికగా ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గిరిజన కళాకారులు తమ సంప్రదాయ కళలను ప్రదర్శించడంతో పాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొననున్నారని పేర్కొన్నారు.“ఠానూ నాయక్ పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేందుకు, గిరిజనుల సాంస్కృతిక అస్తిత్వాన్ని కాపాడేందుకు నంగారా ఉత్సవాలను విజయవంతం చేయాలి” అని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీరాం నాయక్ పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సేవాలాల్ సేన జాతీయ అధ్యక్షులు సంజీవ్ నాయక్, రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్, కళ్యాణ్ నాయక్, తిరుపతి నాయక్, సేవాలాల్ బంజారా సంఘం జాతీయ అధ్యక్షులు కొర్ర మోతిలాల్ నాయక్, గణేష్ నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ నాయకులు వడ్త్యా దాస్ రాం నాయక్, గోవింద్ నాయక్, ఏఐబీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మోహన్ సింగ్, కార్యదర్శి బస్కి నాయక్, గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు కొర్రా శరత్ నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్ రాములు, పద్మ, ప్రొఫెసర్ శంకర్ నాయక్, ప్రొఫెసర్ ఆర్. చంద్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0