బ్యాంకుల సమ్మె ఐదు రోజుల పనివారమే ప్రధాన డిమాండ్
సెప్టెంబర్ 28 నుంచి బ్యాంకుల సమ్మె
ఐదు రోజుల పనివారమే ప్రధాన డిమాండ్
న్యూఢిల్లీ - సెప్టెంబర్ 27
వారానికి ఐదు రోజులే బ్యాంకింగ్ సేవలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు, అధికారులు సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల సమ్మెకు సిద్ధమయ్యారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపడుతున్నారు.ప్రస్తుతం బ్యాంకులకు నెలలో రెండో, నాలుగో శనివారాలు మాత్రమే సెలవు. మొదటి, మూడో శనివారాల్లో శాఖలు పనిచేస్తున్నాయి. అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించి.. సోమవారం నుంచి శుక్రవారం వరకు బ్యాంకింగ్ నిర్వహించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.
2024లోనే ప్రతిపాదన.. అమలుపై జాప్యం
12వ ద్వైపాక్షిక వేతన ఒప్పంద చర్చల్లో ఐదు రోజుల బ్యాంకింగ్ వారంపై ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఉద్యోగ సంఘాల ప్రకారం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ స్థాయిలో దీనిపై సూత్రప్రాయ అంగీకారం జరిగినప్పటికీ.. తుది ప్రభుత్వ అనుమతి, అధికారిక అమలు ఇంకా జరగలేదు.
PLIపై ప్రభుత్వం చర్య
ఐదు రోజుల పనివారంతో పాటు పనితీరు ఆధారిత ప్రోత్సాహకం (PLI)పై కూడా ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం PLI అంశాన్ని ప్రస్తుతం నిలిపివేసిన స్థితిలో ఉంచారు. దీంతో ప్రస్తుత ప్రధాన వివాదం ఐదు రోజుల బ్యాంకింగ్ వారంపైనే కొనసాగుతోంది.
దయచేసి దీనిని కూడా చదవండి ... https://studiobharat.com/Income-not-increase-expenses-heavy-Pressure-middle-class-families
ఖాతాదారులపై ప్రభావం
సమ్మెతో బ్యాంకు శాఖల్లో నగదు లావాదేవీలు, చెక్కుల ప్రాసెసింగ్, డీడీలు, కొన్ని రుణ–ఖాతా సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అయితే ATMలు, UPI, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు సాధారణంగా కొనసాగవచ్చు.
ప్రభుత్వం–ఉద్యోగ సంఘాల మధ్య పీటముడి
ఉద్యోగ సంఘాలు ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని పట్టుబడుతుండగా.. ప్రజలకు నిరంతర బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండాల్సిన అవసరాన్ని ప్రభుత్వం ప్రస్తావిస్తోంది. ముఖ్యంగా సెప్టెంబర్ 30 అర్ధవార్షిక ముగింపు తేదీ కావడంతో సమ్మె సమయం ప్రాధాన్యం సంతరించుకుంది.డిమాండ్లు పరిష్కారం కాకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లే ప్రతిపాదన కూడా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0