మున్సిపల్ పీఠంపై ‘కూటమి’లో కుర్చీ ఏ వర్గానికి దక్కేనో!

జగ్గయ్యపేట

Oct 12, 2026 - 15:23
 0  144
మున్సిపల్ పీఠంపై ‘కూటమి’లో కుర్చీ ఏ వర్గానికి దక్కేనో!

జగ్గయ్యపేట మున్సిపల్ పీఠంపై ‘కూటమి’లో కుర్చీ ఏ వర్గానికి దక్కేనో!

జనరల్ మహిళకు చైర్‌పర్సన్‌ పీఠం.. టీడీపీలోనే పలువురు ఆశావహులు!

ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌ వర్గం నుంచి శ్రీరాం ధనుంజయ భార్య పేరు తెరపైకి.. నెట్టెం రఘురాం వర్గంలోనూ పోటీదారులు!

కన్నెబోయిన రామలక్ష్మి, యలమంచిలి రాఘ భార్య, ఆచంట సునీత, ప్రస్తుత చైర్మన్‌ రంగాపురం రాఘవేంద్ర కుటుంబంలోను ఆశలు.. 

జనసేన వైఖరిపైనా ఆసక్తి!

జగ్గయ్యపేట - అక్టోబర్‌ 12: 

జగ్గయ్యపేట మున్సిపాలిటీ చైర్‌ పర్సన్‌ పదవి జనరల్‌ మహిళకు కేటాయించడంతో పట్టణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి.రిజర్వేషన్‌ ప్రకటనతో మహిళా నాయకుల ఆశలు చిగురించగా, అధికార కూటమిలోని తెలుగుదేశం పార్టీ నేతల మధ్య అభ్యర్థిత్వంపై ఆసక్తికరమైన పోటీకి తెరలేచినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌, కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌ నెట్టెం రఘురాం వర్గాల నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందన్నది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

పదవి మహిళలకు.. అసలు పోటీ నాయకుల మధ్యేనా?

మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పదవి మహిళకు కేటాయించడంతో అభ్యర్థి ఎంపికలో మహిళా నాయకుల రాజకీయ అనుభవం, కుటుంబ నేపథ్యం, పార్టీ పట్ల విధేయత, స్థానికంగా ఉన్న ప్రజాబలం కీలకం కానున్నాయి.అయితే ఆశావహుల ఎంపిక వెనుక ఆయా నాయకుల వర్గ సమీకరణాలు కూడా ప్రభావం చూపే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జగ్గయ్యపేట మున్సిపల్‌ పీఠం కూటమిలో రాజకీయ ఆధిపత్యానికి పరీక్షగా మారనుందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఎమ్మెల్యే వర్గం నుంచి శ్రీరాం ధనుంజయ భార్య పేరు!

ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌ వర్గం నుంచి శ్రీరాం ధనుంజయ భార్య పేరు చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా తెరపైకి వస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.దీనితో పాటు మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ శ్రీరాం సుబ్బారావు కుమార్తె పేరు కూడా చర్చకు మరింత ప్రాధాన్యతను తీసుకొస్తోంది. గతంలో మున్సిపల్‌ పాలనతో అనుబంధం ఉన్న కుటుంబం నుంచి అభ్యర్థిని రంగంలోకి దింపితే రాజకీయంగా అనుకూలత ఉంటుందన్న అంచనాలు ఆ వర్గంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అధికారిక అభ్యర్థిత్వంపై స్పష్టత రావాల్సి ఉంది.

నెట్టెం రఘురాం వర్గంలోనూ పలువురు ఆశావహులు!

మరోవైపు కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌ నెట్టెం రఘురాం వర్గంలోనూ చైర్‌ పర్సన్‌ పదవిని ఆశిస్తున్న వారి పేర్లు చర్చకు వస్తున్నాయి.ప్రస్తుతం కౌన్సిలర్‌ గా ఉన్న కన్నెబోయిన రామలక్ష్మి పేరు ప్రధానంగా వినిపిస్తోంది.తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంలో చైర్‌ పర్సన్‌ అవకాశం వచ్చినప్పటికీ పెద్దల నిర్ణయానికి అనుగుణంగా ఆమె ఆ అవకాశాన్ని వదులుకున్నారన్న ప్రచారం ఉంది. ఈసారి ఆమెకు అవకాశం కల్పిస్తారా? లేక మరో అభ్యర్థిని ఎంపిక చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.ఇదే వర్గానికి సంబంధించి గతంలో తెలుగుదేశం పార్టీ గెలిచినప్పటికీ చైర్మన్‌ అవకాశం దక్కించుకోలేకపోయిన యలమంచిలి రాఘ కుటుంబంలోని భార్యకి అవకాశం కల్పించేనా అనే అంశాలు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకురాలు ఆచంట సునీత కి ఆమెకేమైన ఆ పదవి వరించేనా. ఈ పేర్లలో ఎవరికి పార్టీ నాయకత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నది తేలాల్సి ఉంది.

ప్రస్తుత చైర్మన్‌ కుటుంబం కూడా బరిలోకి దిగుతుందా?

ప్రస్తుతం మున్సిపల్‌ చైర్మన్‌ గా ఉన్న రంగాపురం రాఘవేంద్ర కూడా అధిష్టానాని ఒప్పించి తన భార్యను చైర్‌ పర్సన్‌ బరిలోకి దించే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదే నిజమైతే ఇప్పటికే చర్చలో ఉన్న అభ్యర్థుల మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుత చైర్మన్‌ కుటుంబం నిర్ణయం తీసుకుంటుందా? పార్టీ నాయకత్వం ఎలాంటి సంకేతాలు ఇస్తుంది? అన్న అంశాలపై స్థానిక రాజకీయ వర్గాలు దృష్టి సారిస్తున్నాయి.

జనసేనకు అవకాశం ఉంటుందా? సామినేని ఉదయభాను వర్గం ఏం చేయనుంది?

కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ వైఖరిపైనా రాజకీయ పరిశీలకుల దృష్టి పడుతోంది. జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను వర్గం నుంచి కూడా చైర్‌ పర్సన్‌ అభ్యర్థిత్వంపై ఆసక్తి వ్యక్తమవుతుందా? లేక తెలుగుదేశం పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థికి మద్దతు ఇస్తుందా? అన్నది వేచి చూడాల్సి ఉంది. కూటమి భాగస్వాముల మధ్య ముందస్తు సమన్వయం లేకపోతే అభ్యర్థి ఎంపిక సమయంలో రాజకీయ చర్చలు, అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చే అవకాశం ఉందని స్థానిక వర్గాలు భావిస్తున్నాయి.

వర్గాల లెక్కలకే ప్రాధాన్యమా? ప్రజాభిప్రాయానికీ చోటుంటుందా?

మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పదవి కేవలం ఒక రాజకీయ హోదా మాత్రమే కాదు. పట్టణంలోని తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ, రహదారులు, వీధి దీపాలు, పన్నుల నిర్వహణ, అభివృద్ధి పనుల పర్యవేక్షణ వంటి అంశాల్లో కీలకమైన బాధ్యత. అందువల్ల అభ్యర్థి ఎంపికలో రాజకీయ వర్గ సమీకరణాలతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండే స్వభావం, పరిపాలనా అవగాహన, సమస్యల పరిష్కారంలో చొరవ, పారదర్శకత వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది.మహిళకు రిజర్వేషన్‌ కల్పించడం మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచే అవకాశమే అయినప్పటికీ, ఎన్నికైన చైర్‌పర్సన్‌కు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, పరిపాలనలో క్రియాశీల పాత్ర, ప్రజల సమస్యలపై స్పందించే అవకాశం ఎంతవరకు లభిస్తాయన్నది కూడా ముఖ్యమే.కుటుంబ రాజకీయ నేపథ్యం కంటే వ్యక్తిగత సామర్థ్యం, ప్రజాసేవ పట్ల నిబద్ధతకు ప్రాధాన్యత ఇవ్వాలన్న అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

కూటమి ఏకాభిప్రాయం సాధిస్తుందా? లేక పోటీ అనివార్యమవుతుందా?

ఒకే కూటమిలోని నాయకుల మధ్య చైర్‌పర్సన్‌ అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం కుదరడం పార్టీ ఐక్యతకు కీలకంగా మారనుంది. ఆశావహుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పార్టీ పెద్దలు ఎవరికి అవకాశం కల్పిస్తారు? ఎమ్మెల్యే వర్గం ప్రతిపాదనకు ప్రాధాన్యత దక్కుతుందా? నెట్టెం రఘురాం వర్గానికి అవకాశం లభిస్తుందా? జనసేన నాయకత్వం ఎలాంటి పాత్ర పోషిస్తుంది? అన్న ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.

దయచేసి దీని ని కూడా చదవండి ... https://studiobharat.com/political-importance-womens-votes-Jaggayyapet

అభ్యర్థి ఎంపికలో అసంతృప్తులకు తావులేకుండా, అందరినీ సమన్వయం చేసుకుంటూ నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కూటమి నాయకత్వంపై ఉంది. అంతర్గత పోటీని రాజకీయ విభేదాలుగా మారనీయకుండా, పట్టణ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగడం అవసరం.

చైర్‌ పర్సన్‌ కుర్చీ ఎవరికి దక్కుతుంది?

ప్రస్తుతం తెరపైకి వస్తున్న పేర్లు, వర్గాల మధ్య సాగుతున్న రాజకీయ చర్చలు జగ్గయ్యపేట మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ఎన్నికపై ఉత్కంఠను పెంచుతున్నాయి. అయితే ప్రచారంలో ఉన్న పేర్లలో ఎవరు అధికారిక అభ్యర్థిగా ఖరారవుతారు, కూటమి ఏకాభిప్రాయానికి వస్తుందా,చివరకు మున్సిపల్‌ పీఠాన్ని ఎవరు అధిష్ఠిస్తారు అన్నది అధికారిక నిర్ణయం వెలువడిన తర్వాతే స్పష్టమవుతుంది.జగ్గయ్యపేట రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే — మహిళా చైర్‌ పర్సన్‌ అభ్యర్థి ఎంపికలో పార్టీ పెద్దలు ఎవరికి పచ్చజెండా ఊపుతారు?

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 1
Funny Funny 0
Angry Angry 1
Sad Sad 1
Wow Wow 0
By Studiobharat Reporter స్టూడియో భారత్ న్యూస్ – తెలుగు తాజా వార్తలు