జగ్గయ్యపేట మున్సిపాలిటీ చరిత్రలో మరో మహిళా అధ్యాయం!

జగ్గయ్యపేట

Nov 24, 2026 - 10:45
Nov 24, 2026 - 11:32
 0  140
జగ్గయ్యపేట మున్సిపాలిటీ చరిత్రలో మరో మహిళా అధ్యాయం!

జగ్గయ్యపేట మున్సిపాలిటీ చరిత్రలో మరో మహిళా అధ్యాయం!

రెండో మహిళా చైర్‌పర్సన్‌గా నరేంద్రుల వినీత..

అభివృద్ధిపై ప్రజల ఆశలు ఎన్నో.. జలవనరుల పునరుద్ధరణ నుంచి చేతివృత్తిదారుల సంక్షేమం వరకు కొత్త పాలన నుండి ప్రజలు ఆశిస్తున్నారు!

జగ్గయ్యపేట:

జగ్గయ్యపేట మున్సిపాలిటీ చరిత్రలో మహిళా నాయకత్వానికి మరోసారి అవకాశం దక్కింది.1995లో హనుమంతు రత్నకుమారి కాంగ్రెస్ పార్టీ తరపున తొలి మహిళా మున్సిపల్ చైర్‌ పర్సన్‌ గా బాధ్యతలు నిర్వహించగా, 2026లో నరేంద్రుల వినీత తెలుగుదేశం పార్టీ తరపున రెండో మహిళా చైర్‌పర్సన్‌గా ఎన్నికై చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

నరేంద్రుల వినీతకు రాజకీయ నేపథ్యం, కుటుంబ అనుభవం కలిసివచ్చిన అంశాలుగా చెప్పుకోవచ్చు. మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరాం సుబ్బారావు కుమార్తెగా, ప్రస్తుత జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) సోదరిగా ఆమెకు రాజకీయ కుటుంబంతో అనుబంధం ఉంది. మున్సిపల్ పాలన, పట్టణ రాజకీయాలు, స్థానిక సమస్యలపై కుటుంబం నుంచి లభించిన అనుభవం ఆమెకు ఎంతవరకు ఉపయోగపడుతుందో ఇప్పుడు చూడాల్సి ఉంది.

మున్సిపాలిటీ ఆదాయమే అభివృద్ధికి అసలైన బలం!

రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రత్యేక గ్రాంట్లు, ఇతర నిధుల కోసం ఎదురుచూడటమే కాకుండా మున్సిపాలిటీకి సొంతంగా వచ్చే ఆదాయాన్ని పెంచడంపై చైర్‌పర్సన్ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లేఅవుట్ అనుమతులు, భవన నిర్మాణ అనుమతులు, మున్సిపల్ కాంప్లెక్స్ దుకాణాల అద్దెలు, ఇంటి పన్నులు, నీటి పన్నుల వసూళ్లలో పారదర్శకత తీసుకొచ్చి వందశాతం లక్ష్యాన్ని సాధించగలరా? అన్నది ప్రజల్లో ఆసక్తికర చర్చగా మారుతోంది.మున్సిపల్ ఆస్తుల పరిరక్షణ, ఖాళీ స్థలాల వినియోగం, ఆదాయ వనరుల పెంపు, ఖర్చులపై సామాజిక పర్యవేక్షణ వంటి అంశాలపై దృష్టి పెడితే పట్టణ అభివృద్ధికి ఆర్థికంగా బలమైన పునాది ఏర్పడుతుంది.

చెరువుల అభివృద్ధి..నీటి నిల్వల పెంపునకు ప్రాధాన్యత!

జగ్గయ్యపేట పట్టణ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నీటి వనరుల పరిరక్షణకు కొత్త పాలకవర్గం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. పట్టణ పరిధిలోని చెరువులను అభివృద్ధి చేసి, పూడికతీత చేపట్టి, ఆక్రమణలు ఉంటే నిబంధనల ప్రకారం తొలగించి, వర్షపు నీరు చెరువుల్లోకి చేరేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి.

చెరువుల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు వాటి పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దితే భూగర్భ జలాల పెంపునకు, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో నీటి ఎద్దడి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టడం కూడా అవసరం.

యర్రకాల్వ, వేపల వాగులకు పునరుజ్జీవం కల్పిస్తారాని  ప్రజలు ఆశిస్తున్నారు!?

జగ్గయ్యపేట ప్రాంతానికి సంబంధించిన యర్రకాల్వ, వేపల వాగులు ఒకప్పుడు వర్షపు నీటి ప్రవాహానికి, పరిసర ప్రాంతాల నీటి అవసరాలకు ఉపయోగపడే సహజ జలమార్గాలుగా ఉన్నాయి. కాలక్రమంలో పూడిక, చెత్తాచెదారం, ఆక్రమణలు, ఇతర అడ్డంకులతో నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయనే ఆందోళనలు వినిపిస్తున్నాయి.

ఈ జలమార్గాలను సమగ్రంగా పరిశీలించి, అవసరమైన చోట పూడికతీత, చెత్త తొలగింపు, అడ్డంకుల నివారణ చేపట్టి వర్షపు నీరు సజావుగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలి. సంబంధిత శాఖల సమన్వయంతో శాశ్వత పరిష్కారం చూపగలిగితే పట్టణ పరిసర ప్రాంతాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.

ఇనాం భూముల సమస్యలకు పరిష్కారం చూపే చొరవ ఉంటుందా?

జగ్గయ్యపేట ప్రాంతంలో ఇనాం భూములకు సంబంధించిన సమస్యలు ఎన్నో ఏళ్లుగా ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. భూముల హక్కులు, రికార్డులు, 22(ఏ) జాబితా, రిజిస్ట్రేషన్లు, నివాసితుల ఇబ్బందులు వంటి అంశాల్లో పరిష్కారం కోసం పలువురు ఎదురుచూస్తున్నారు.

ఈ సమస్య పూర్తిగా మున్సిపాలిటీ పరిధిలో పరిష్కారమయ్యేది కాకపోయినా,బాధితుల తరఫున సంబంధిత రెవెన్యూ శాఖ, జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని న్యాయబద్ధమైన పరిష్కారం కోసం చైర్‌పర్సన్ చొరవ చూపాల్సిన అవసరం ఉంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఇనాం భూముల సమస్యలకు పరిష్కారం దిశగా అడుగులు పడితే ప్రజలకు గొప్ప ఊరట లభిస్తుంది.

స్వర్ణకారులు,చేతివృత్తిదారులకు ప్రోత్సాహం అవసరం!

జగ్గయ్యపేట పట్టణంలో స్వర్ణకారులతో పాటు వివిధ సంప్రదాయ చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు ఉన్నాయి. ఆధునిక మార్కెట్ పోటీ, ముడిసరుకుల ధరలు, పెట్టుబడి సమస్యలు, వ్యాపార అవకాశాల కొరత కారణంగా ఈ వర్గాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

స్వర్ణకారులు, వడ్రంగులు, కుమ్మరులు, కమ్మరులు, ఇతర సంప్రదాయ వృత్తిదారులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం, బ్యాంకు రుణాలు అందేలా సహకరించడం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఆధునిక పనిముట్ల కొనుగోలుకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ప్రోత్సాహకాలను చేరవేయడం వంటి చర్యలు తీసుకోవాలి.చేతివృత్తులను కేవలం సంప్రదాయంగా కాకుండా ఉపాధి, ఆర్థిక స్వావలంబనకు మార్గంగా అభివృద్ధి చేయగలిగితే ఎన్నో కుటుంబాలకు భరోసా కల్పించినట్లవుతుంది.

వ్యాపార వర్గాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ!

జగ్గయ్యపేట పట్టణ ఆర్థిక వ్యవస్థలో చిరు వ్యాపారులు, హోల్‌సేల్ వ్యాపారులు, దుకాణదారులు, చిన్న పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వ్యాపారులకు అవసరమైన మౌలిక వసతులు, పారిశుధ్యం, పార్కింగ్ సదుపాయాలు, రహదారుల అభివృద్ధి, వీధి దీపాలు వంటి అంశాలను మెరుగుపరచాలి.

మున్సిపల్ మార్కెట్లు, వాణిజ్య సముదాయాలను అభివృద్ధి చేయడంతో పాటు చిరు వ్యాపారులకు ప్రభుత్వ పథకాలు, రుణ సదుపాయాలు అందేలా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. వ్యపార వర్గాల సమస్యలను తెలుసుకునేందుకు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తే పట్టణ ఆర్థికాభివృద్ధికి మరింత ఊతం లభిస్తుంది.

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలి!

పట్టణంలో ఇప్పటికీ సరైన రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు లేని ప్రాంతాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కొత్త పాలకవర్గంపై ఉంటుంది. తాగునీటి సరఫరా, పారిశుధ్యం, దోమల నివారణ, పన్నుల వసూళ్లు, ప్రజలకు అందుబాటులో ఉండే పాలన వంటి అంశాల్లో స్పష్టమైన కార్యాచరణ రూపొందిస్తేనే ప్రజల విశ్వాసాన్ని చూరగొనగలరు.

ప్రతి వార్డులో ప్రజలతో సమావేశాలు నిర్వహించి సమస్యలను గుర్తించడం, అభివృద్ధి పనులకు వార్డుల వారీగా ప్రాధాన్యత కేటాయించడం, పనుల నాణ్యతపై పర్యవేక్షణ చేయడం అవసరం.

గత పాలనపై ఆరోపణలు..కొత్త పాలనలో పారదర్శకత ఉంటుందా?

గత మున్సిపల్ పాలనపై వివిధ వర్గాల నుంచి వినిపిస్తున్న ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో కొత్త చైర్‌పర్సన్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. గత పాలనలో జరిగిన నిర్ణయాలు, అభివృద్ధి పనులు, ఆర్థిక లావాదేవీలపై నిబంధనల ప్రకారం సమీక్ష జరిపి, ఏవైనా అవకతవకలు గుర్తిస్తే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారా? లేక కొత్త పాలనకు కొత్త దిశ చూపిస్తారా? అన్నది కాలమే సమాధానం చెప్పాలి.

కుటుంబ రాజకీయ నేపథ్యంతో వచ్చిన అవకాశం.. ప్రజా విశ్వాసం నిలబెట్టుకోవడమే అసలైనదిగా ప్రజలు ఆశిస్తున్నారు!

రాజకీయ కుటుంబ నేపథ్యం, ఎమ్మెల్యేతో ఉన్న అనుబంధం, పట్టణంపై అవగాహన ఇవన్నీ నరేంద్రుల వినీతకు అదనపు బలాలు కావచ్చు. అయితే ప్రజల దృష్టిలో నాయకత్వానికి అసలైన కొలమానం కుటుంబ నేపథ్యంతో పాటు ప్రజలకు అందించే సేవలు, చేపట్టే అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారంలో చూపించే చొరవే ముఖ్యం.

జలవనరుల పరిరక్షణ, ఇనాం భూముల సమస్యల పరిష్కారానికి చొరవ, చేతివృత్తిదారుల సంక్షేమం, వ్యాపార వర్గాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన బాధ్యత కొత్త చైర్‌పర్సన్‌పై ఉంది.

దీనిని కూడా చదవండి.... https://studiobharat.com/Nagarjunasagar-stone-block-reservoir-lives-crores-people

జగ్గయ్యపేట మున్సిపాలిటీ చరిత్రలో రెండో మహిళా చైర్‌పర్సన్‌గా నరేంద్రుల వినీత తన పదవీకాలంలో అభివృద్ధి పనులతోనూ ప్రత్యేక ముద్ర వేయాలని పట్టణ ప్రజలు ఆశిస్తున్నారు.రాజకీయాలకు అతీతంగా అన్ని వార్డులకు సమాన ప్రాధాన్యతనిస్తూ,ప్రజలకు అందుబాటులో ఉండే పారదర్శకమైన పాలన అందిస్తే ఆమె పేరు మున్సిపాలిటీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే అవకాశం ఉంది.

చరిత్రలో రెండో మహిళా చైర్‌ పర్సన్‌ గా పేరు సంపాదించడం ఒక ఘనత.. చెరువులకు జలకళ తీసుకురావడం, వాగులకు పునరుజ్జీవం కల్పించడం, భూముల సమస్యలకు పరిష్కారం చూపడం,చేతివృత్తులు–వ్యాపారాలను ప్రోత్సహించడం,అభివృద్ధి–ప్రజా సంక్షేమంతో ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించడమే అసలైన విజయం!

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
By Studiobharat Reporter స్టూడియో భారత్ న్యూస్ – తెలుగు తాజా వార్తలు