ఏపి లో పల్లె పోరు షురూ....
అమరావతి
ఏపీలో పల్లెపోరు షురూ..
నేటి నుంచి రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు
4,960 సర్పంచ్‌లు.. 49,224 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు – నవంబర్ 29న పోలింగ్
అమరావతి, నవంబర్ 18:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. రాష్ట్ర ఎన్నికల సంఘం మూడు విడతల్లో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత నామినేషన్ల స్వీకరణ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ విడతలో 4,960 సర్పంచ్ స్థానాలు, 49,224 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో మొత్తం 13,167 సర్పంచ్ స్థానాలు, 1,32,514 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. మొత్తం ఓటర్లు 2,61,52,377 మంది ఉన్నారు.
రెండో విడత ఎన్నికల షెడ్యూల్ ఇదీ..
నవంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 21న పరిశీలన, 22న అప్పీళ్ల స్వీకరణ, 23న అప్పీళ్ల పరిష్కారం, 24న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నిర్వహించనున్నారు. నవంబర్ 29న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుండగా, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
మూడు విడతల్లో స్థానాల వివరాలు
మొదటి విడతలో 3,967 సర్పంచ్, 40,012 వార్డు సభ్యుల స్థానాలు, రెండో విడతలో 4,960 సర్పంచ్, 49,224 వార్డు సభ్యుల స్థానాలు, మూడో విడతలో 4,240 సర్పంచ్, 42,626 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
నామినేషన్ కు అవసరమైన పత్రాలు
అభ్యర్థులు నిర్ణీత నమూనాలో నామినేషన్ పత్రం, ప్రతిపాదకుడి సంతకం, ఓటరు జాబితాలో పేరు, అవసరమైన అఫిడవిట్, ఆస్తులు, అప్పులు, నేర చరిత్ర, విద్యార్హతలకు సంబంధించిన వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. రిజర్వేషన్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు సంబంధిత కుల ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకోవాలి. నామినేషన్ పత్రాలను సంబంధిత రిటర్నింగ్ అధికారికి నిర్ణీత సమయంలో అందజేయాలి.
ఎన్నికల నియమాలు తప్పనిసరిగా పాటించాలి
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలి. ఓటర్లకు డబ్బు, మద్యం, బహుమతులు పంపిణీ చేయడం, బెదిరింపులకు పాల్పడటం, కులమతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడం నిషేధం. తప్పుడు వివరాలతో నామినేషన్లు దాఖలు చేయకూడదు. ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేయరాదు.
దీనిని కూడా చదవండి.... https://studiobharat.com/meaning-behind-rituals
నేడు తొలి విడత నామినేషన్ల పరిశీలన
మరోవైపు తొలి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ బుధవారం ప్రారంభం కానుంది. తిరస్కరణకు గురైన నామినేషన్లపై నిర్ణీత గడువులో అప్పీలు చేసుకునే అవకాశం కల్పించారు. అనంతరం ఉపసంహరణ ప్రక్రియ పూర్తిచేసి తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు.
గ్రామాభివృద్ధికి కీలకంగా పల్లెపోరు
తాగునీరు,పారిశుద్ధ్యం, రహదారులు,డ్రైనేజీలు,వీధి దీపాలు, సంక్షేమ పథకాల అమలు వంటి స్థానిక సమస్యలు ఈ ఎన్నికల్లో ప్రధాన చర్చనీయాంశాలుగా మారనున్నాయి.గ్రామాల అభివృద్ధికి కృషి చేసే నాయకులను ఎన్నుకునేందుకు ఓటర్లు సిద్ధమవుతున్నారు.ఎన్నికలు ప్రశాంతంగా,పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0