ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

మైదుకూరు

Oct 6, 2026 - 05:58
Oct 6, 2026 - 06:24
 0  35
ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

రూ.3,500కు తగ్గకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: రైతు సంఘం, సీపీఐ

మైదుకూరు 

ఉల్లి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం (ఏఐకేఎస్), భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నాయకులు డిమాండ్ చేశారు. మైదుకూరు మండలం అక్కులాయిపల్లె గ్రామంలో ఉల్లి పంట సాగు చేసిన రైతులు అందె వెంకటసుబ్బయ్య, మైలారు శ్రీనివాసులు, మైలారు వెంకటేశ్వర్లు తదితర రైతులను కలిసి పంట పరిస్థితి, మార్కెట్ ధరలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నాయకులు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.వి. సుబ్బారెడ్డి, పోతిరెడ్డి భాస్కర్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. శ్రీరాములు, మైదుకూరు నియోజకవర్గ కార్యదర్శి ఎస్. షావల్లి మాట్లాడుతూ కడప జిల్లాలో సుమారు 15 వేల ఎకరాల్లో, మైదుకూరు మండలంలో సుమారు 2,400 ఎకరాల్లో ఉల్లి సాగు చేసినట్లు తెలిపారు.ఉల్లి పంట దిగుబడి ఒక మోస్తరుగా వచ్చినప్పటికీ ప్రారంభంలో మార్కెట్ ధర ఆశాజనకంగా ఉండటంతో రైతులు సంతోషించారని తెలిపారు. అయితే ప్రస్తుతం వ్యాపారులు సిండికేట్‌గా మారి కొనుగోలు ధరను భారీగా తగ్గించారని ఆరోపించారు. గతంలో రూ.4,500 వరకు ఉన్న ధరను ప్రస్తుతం రూ.2,000–2,500కే కొనుగోలు చేస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు.

ఇటీవల కురిసిన వర్షాలను సాకుగా చూపుతూ వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారని, అయితే వర్షాల కారణంగా ఉల్లి పంటకు పెద్దగా నష్టం జరిగినట్లు కనిపించడం లేదని నాయకులు తెలిపారు. ఒక్కసారిగా ధరలు తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేక నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి ఉల్లి సాగు అధికంగా జరిగిన మండలాల్లోని మార్కెట్‌ యార్డులలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి క్వింటాలుకు రూ.3,500కు తగ్గకుండా ఉల్లిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రైతులకు ఉపయోగపడేలా శీతల గిడ్డంగులను ఏర్పాటు చేయాలని కోరారు.

దయచేసి దీనిని కూడా చదవండి ... https://studiobharat.com/Degree-hands-youth-Ambiguity-over-future

ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే గత ఏడాది మాదిరిగానే ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. ఉల్లి రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో ఏఐకేఎస్, సీపీఐ ఆధ్వర్యంలో రైతుల పక్షాన ఆందోళనలు, పోరాటాలను ఉధృతం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీపీఐ మైదుకూరు పట్టణ కార్యదర్శి డి. సుబ్బరాయుడు, నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు బి. పీరయ్య, రైతు సంఘం నాయకులు వై. సుబ్బిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
By Studiobharat Reporter స్టూడియో భారత్ న్యూస్ – తెలుగు తాజా వార్తలు