ప్రతికూల ఔషధ ప్రతిచర్యలను గుర్తించి నివేదించాలి
విజయనగరం
ఔషధాల సురక్షిత వినియోగంపై విస్తృత అవగాహన
ప్రతికూల ఔషధ ప్రతిచర్యలను గుర్తించి నివేదించాలి
వైద్యుల సూచనల మేరకే మందుల వినియోగం
‘ఔషధాల సురక్షిత వినియోగం – రోగి భద్రత’పై అవగాహన కార్యక్రమాలు
విజయనగరం
ఔషధాలను సురక్షితంగా వినియోగించడంతో పాటు,మందుల వల్ల కలిగే ప్రతికూల ఔషధ ప్రతిచర్యలను (ఏడీఆర్) గుర్తించి వెంటనే వైద్య సిబ్బందికి తెలియజేయాల్సిన అవసరంపై విజయనగరంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల ఫార్మకాలజీ విభాగం ఆధ్వర్యంలోని ఏడీఆర్ మానిటరింగ్ సెంటర్‌లో 6వ జాతీయ ఔషధ భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తున్నారు.సెప్టెంబర్ 17 నుంచి 23వ తేదీ వరకు కొనసాగుతున్న ఈ కార్యక్రమాల్లో భాగంగా పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.వారోత్సవాల ప్రారంభంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఛాంబర్‌లో ఫార్మాకోవిజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఔషధాల వల్ల కలిగే ప్రతికూల ఔషధ ప్రతిచర్యలను గుర్తించడం, నమోదు చేయడం,నివేదించడం ద్వారా రోగుల భద్రతను మెరుగుపరచడం,ఔషధాల సురక్షిత వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం వంటి అంశాలపై చర్చించారు.
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్య అధ్యాపకులు, పారా మెడికల్ సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. ఔషధాలను సురక్షితంగా వినియోగించడం, మందుల వల్ల కలిగే అనుమానిత ప్రతికూల ప్రతిచర్యలను గుర్తించి నివేదించడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (యూపీహెచ్‌సీ), సమీప సచివాలయ ప్రాంతాల్లోనూ ప్రజా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వైద్యుల సూచన మేరకే మందులు వినియోగించాలని, మందుల వాడకంతో అనుమానిత ప్రతికూల ప్రతిచర్యలు కనిపిస్తే వెంటనే వైద్య సిబ్బందికి తెలియజేయాలని సూచించారు.
దయచేసి దీనిని కూడా చదవండి ... https://studiobharat.com/Ganesh-Navratri-celebrations-devotional-devotion
అదేవిధంగా రెండో సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులకు క్విజ్ నిర్వహించారు.జేఎన్‌టీయూ విజయనగరంలోని బి.ఫార్మసీ విద్యార్థులకు ఫార్మాకోవిజిలెన్స్ ప్రాముఖ్యత,ఏడీఆర్‌ల గుర్తింపు, నివేదిక,ఔషధాల సురక్షిత వినియోగంలో ఫార్మసిస్టుల పాత్రపై అవగాహన కల్పించారు.‘ఔషధాల సురక్షిత వినియోగం – రోగి భద్రత’ అనే సందేశాన్ని వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, విద్యార్థులు, ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడమే కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమాల విజయవంతమైన నిర్వహణలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. బి. దేవి మాధవి, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. అల్లూ పద్మజ,ఫార్మకాలజీ విభాగాధిపతి డా. డి.అన్నపూర్ణ, ఏడీఆర్ మానిటరింగ్ సెంటర్ సిబ్బంది,వైద్య అధ్యాపకులు,విద్యార్థులు,ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0