సర్వీస్‌ ఇనాం భూముల పై ఆంక్షలతో బాధితుల విలవిల

జగ్గయ్యపేట స్టూడియో భారత్ పత్రినిధి

Sep 16, 2026 - 12:47
Sep 16, 2026 - 15:53
 0  130
సర్వీస్‌ ఇనాం భూముల పై ఆంక్షలతో బాధితుల విలవిల

భూమి ఉంది.. హక్కు ఎక్కడ?

సర్వీస్‌ ఇనాం భూములపై ఆంక్షలతో బాధితుల విలవిల

జగ్గయ్యపేటలో 627 ఎకరాలు.. సుమారు 10 వేల మంది అనుభవదారుల ఆవేదన

1956 చట్టం అమలు చేయాలి.. 16/2013పై పునఃపరిశీలన.. 22-A(1)(c) నుంచి అర్హమైన భూములను తొలగించాలని డిమాండ్

జగ్గయ్యపేట, సెప్టెంబరు 16:

తరతరాలుగా అనుభవిస్తున్న భూమి.. పాత లింకు డాక్యుమెంట్లు.. గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు.. అయినా ఇప్పుడు క్రయవిక్రయాలకు ఆంక్షలు! దీంతో సర్వీస్‌ ఇనాం భూముల బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తమ భూముల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ సర్వీస్‌ ఇనాం భూముల బాధితుల సంఘం–జగ్గయ్యపేట ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

సుమారు 627 ఎకరాలు.. 10 వేల మంది

జగ్గయ్యపేట ప్రాంతంలో సుమారు 627 ఎకరాల భూములకు సంబంధించిన సమస్యతో దాదాపు 10 వేల మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బాధితుల సంఘం ప్రతినిధులు చెబుతున్నారు.ఏళ్లుగా భూములను సాగు చేసుకుంటూ, అనుభవిస్తూ జీవనం సాగిస్తున్నామని.. కుటుంబ అవసరాలకు భూమే ప్రధాన ఆధారంగా ఉందని బాధితులు చెబుతున్నారు.అయితే సర్వీస్‌ ఇనాం భూములుగా పేర్కొంటూ క్రయవిక్రయాలపై ఆంక్షలు రావడంతో భూమి ఉన్నా అవసరమైన సమయంలో వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.“భూమి మా దగ్గరే ఉంది..మేమే అనుభవిస్తున్నాం..కానీ అవసరమైనప్పుడు అమ్ముకోలేకపోతున్నాం.ఆస్తి ఉన్నా దాని ప్రయోజనం పొందలేకపోతున్నాం” అని బాధితులు వాపోతున్నారు.

1956 నుంచి పత్రాలున్నాయంటున్న బాధితులు

బాధితుల వాదన ప్రకారం.. 1956 నుంచి వివిధ దశల్లో సర్వీస్‌ ఇనాం భూములకు కొనుగోలు, అమ్మకాలు జరిగాయి. లింకు డాక్యుమెంట్లను పరిశీలించి, పాత రిజిస్ట్రేషన్‌ పత్రాల ఆధారంగా అనేక లావాదేవీలు జరిగాయని వారు చెబుతున్నారు.అయితే 2013 తరువాత 1956 సంవత్సరానికి 20 రోజుల ముందు నుంచే సర్వీస్‌ ఇనాం భూములుగా గుర్తించి క్రయవిక్రయాలపై ఆంక్షలు విధించడంతో పరిస్థితి మారిపోయిందని పేర్కొంటున్నారు.కుటుంబంలో పిల్లల చదువులు, వైద్యం, వివాహాలు, అప్పుల చెల్లింపులు వంటి అవసరాలు వచ్చినప్పుడు భూమిని విక్రయించి డబ్బు సమకూర్చుకోలేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు.

బాధితుల మాటల్లో..

«“మా తాతలు, తండ్రుల కాలం నుంచి ఈ భూములతో మాకు సంబంధం ఉంది.పాత పత్రాలు ఉన్నాయి. అప్పట్లో రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇప్పుడు మా భూములపై ఆంక్షలు విధించడంతో మేమే నష్టపోతున్నాం.”»«“భూమి ఉన్నా పిల్లల అవసరాలకు ఉపయోగించుకోలేని పరిస్థితి. అత్యవసర సమయంలో కూడా భూమిని ఆధారంగా చేసుకుని డబ్బు సమకూర్చుకోలేకపోతున్నాం.”»«“ప్రభుత్వం మా పత్రాలు, రెవెన్యూ రికార్డులు పరిశీలించాలి. అర్హత ఉన్న భూములకు న్యాయం చేయాలి.”»

22-A నుంచి తొలగించాలని డిమాండ్‌

సర్వీస్‌ ఇనాం భూముల సమస్యలో 22-A(1)(c) నిషేధిత జాబితా అంశాన్ని పరిష్కరించాలని బాధితులు ప్రధానంగా కోరుతున్నారు.పాత రిజిస్ట్రేషన్‌ పత్రాలు, లింకు డాక్యుమెంట్లు, రెవెన్యూ రికార్డులు, భూమిపై వాస్తవ అనుభవం తదితర అంశాలను పరిశీలించి అర్హమైన భూములను 22-A(1)(c) నిషేధిత జాబితా నుంచి తొలగించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.అలాగే 1956 సర్వీస్‌ ఇనాం అబాలిషన్‌ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, 16/2013పై పునఃపరిశీలన చేసి బాధితుల డిమాండ్‌ మేరకు రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

1956 ఈనాం ఎబాలిషన్ యాక్ట్ ప్రకారం అప్పుడు ఆ భూములను అనుభవిస్తున్న సర్వీస్ ఈనాందార్లకు ప్రభుత్వం రైత్వారీ పట్టాలు మంజూరు చేసింది.

అప్పటినుంచి రైత్వారీ రైతులకు చట్టపరంగా ఏర్పడిన హక్కుల ప్రకారం వారు తమ భూములను ఇతరులకు విక్రయించుట లేదా తనవారికి బహుమతిగా చెందచేయటం జరిగింది.

సుమారు 55 సం.ల పాటు ఈ విధమైన క్రయవిక్రయాలు, చట్టబద్దమైన రిజిస్త్రేషన్లు జరిగి చాలా చేతులు మారినవి. 

2013 సం.లో - 1956 చట్టం ప్రకారం 

అప్పుడు ఇచ్చిన రైత్వారీ పట్టాలు చెల్లవని ఆ భూములు దేవాలయానికి లేదా ఎండోమెంట్‌కు చెందుతాయని ప్రభుత్వం మరలా రెట్రాస్పెక్టివ్‌గా 16/2013 సవరణ చట్టాన్ని తీసుకువచ్చింది.

🔴 బాధితుల ప్రధాన డిమాండ్లు

1956 సర్వీస్‌ ఇనాం అబాలిషన్‌ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి

▪ 16/2013ను పూర్తిగా రద్దు చేయాలన్న డిమాండ్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి

▪ అర్హమైన సర్వీస్‌ ఇనాం భూములను 22-A(1)(c) నుంచి తొలగించాలి

▪ పాత లింకు డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్‌ పత్రాలు పరిశీలించాలి

▪ రెవెన్యూ రికార్డులను భూముల వారీగా పరిశీలించాలి

▪ 627 ఎకరాల సమస్యపై ప్రత్యేక విచారణ చేపట్టాలి

▪ సుమారు 10 వేల మంది బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి.

మా భూములపై స్పష్టత ఇవ్వండి”

సర్వీస్‌ ఇనాం భూముల విషయంలో ప్రభుత్వం సమగ్రంగా విచారణ చేపట్టి, ప్రతి భూమికి సంబంధించిన రికార్డులను పరిశీలించి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.“మాకు ఎవరి మీదా వివాదం లేదు. మా భూములపై చట్టపరమైన స్థితి ఏమిటో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. అర్హత ఉన్న భూములకు హక్కులు, క్రయవిక్రయాలకు అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి” అని వారు కోరుతున్నారు.

ఆందోళనలు.. నిరాహార దీక్షలు

సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ఆంధ్రప్రదేశ్‌ సర్వీస్‌ ఇనాం భూముల బాధితుల సంఘం–జగ్గయ్యపేట ప్రతినిధులు తెలిపారు.ప్రతి రోజు ఆందోళనలు,నిరాహార దీక్షలు చేపడుతూ ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్తామని పేర్కొన్నారు.“ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నాం. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలి. అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మా పత్రాలను పరిశీలించాలి. మా కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి” అని బాధితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

భూమి ఉంది.. పత్రాలు ఉన్నాయి.. అనుభవం ఉంది..

అయినా ఆస్తిని అవసరానికి వినియోగించుకోలేకపోతున్నాం.మా గోడు వినండి.. రికార్డులు పరిశీలించండి..అర్హత ఉన్న భూములకు న్యాయం చేయండి.”— సర్వీస్‌ ఇనాం భూముల బాధితులు, జగ్గయ్యపేట

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin top avernace of telugu news