కరెంట్ కోతలతో కేబుల్ ఆపరేటర్లకు కష్టాలు
జగ్గయ్యపేట స్టూడియో భారత్ పత్రినిధి
కరెంట్ కోతలతో కేబుల్ ఆపరేటర్లకు కష్టాలు
స్థంభాల మార్పులతో రోజుల తరబడి అంతరాయం.. గాలిలోకి సిటీ కేబుల్ కనెక్షన్లు
వినియోగదారుల ఫిర్యాదులతో సతమతం.. కనెక్షన్లు కొనసాగించడం కష్టమంటున్న ఆపరేటర్లు
జగ్గయ్యపేట:
విద్యుత్ స్థంభాల మార్పులు, రోజుల తరబడి కొనసాగుతున్న కరెంట్ కోతలు సిటీ కేబుల్ ఆపరేటర్లకు తీరని ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి.విద్యుత్ స్థంభాల మార్పుల సమయంలో కేబుల్ వైర్లు తొలగిపోవడం, తిరిగి సరిచేయడంలో జాప్యం జరగడంతో పలు ప్రాంతాల్లో కేబుల్ కనెక్షన్లకు అంతరాయం ఏర్పడుతోంది.దీంతో కేబుల్ ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఒకవైపు కరెంట్ లేక కేబుల్ సిస్టమ్ పనిచేయకపోవడం.. మరోవైపు స్థంభాల మార్పులతో లైన్లు అస్తవ్యస్తం కావడంతో వినియోగదారులకు సరైన సేవలు అందించలేని పరిస్థితి నెలకొంది. సిగ్నల్ రాకపోవడంతో వినియోగదారుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌కు సమాధానం చెప్పడం, సమస్య పరిష్కారం కోసం సిబ్బందిని పంపడం ఆపరేటర్లకు రోజువారీ సమస్యగా మారింది.కేబుల్ వైర్లు గాలిలో వేలాడుతూ ఉండటం, కొన్ని చోట్ల కనెక్షన్లు తెగిపోవడం వంటి సమస్యలు కూడా ఎదురవుతున్నాయని ఆపరేటర్లు చెబుతున్నారు. చిన్నపాటి సమస్య వచ్చినా సిబ్బందిని పంపి లైన్‌ను సరిచేయాల్సి వస్తుండటంతో నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయని వాపోతున్నారు.“కరెంట్ కోతలతో ఇప్పటికే కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. దానికి తోడు స్థంభాలు మార్చినప్పుడు కేబుల్ లైన్లు కూడా దెబ్బతింటున్నాయి. ఒక సమస్యను సరిచేసేలోపే మరోచోట నుంచి ఫిర్యాదు వస్తోంది.
ఇలా అయితే కేబుల్ కనెక్షన్లు కొనసాగించడం కష్టంగా మారుతోంది” అని పలువురు కేబుల్ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కేబుల్ కనెక్షన్ల ద్వారా వచ్చే ఆదాయం కంటే వాటి నిర్వహణకు అయ్యే ఖర్చులు, సిబ్బంది ఖర్చులు, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి పడుతున్న సమయం ఎక్కువవుతోందని ఆపరేటర్లు అంటున్నారు. దీంతో కేబుల్ కనెక్షన్లు కొనసాగించడంపై ఆసక్తి తగ్గి,ఎయిర్ టెల్,జియో, డిటిహెచ్ లాంటి డిస్ కనెక్షన్ల వైపు మొగ్గు చూపాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చెబుతున్నారు.విద్యుత్ స్థంభాల మార్పుల సమయంలో కేబుల్ ఆపరేటర్లతో సమన్వయం చేసుకుని లైన్లను సురక్షితంగా తిరిగి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. కరెంట్ కోతలు, స్థంభాల మార్పుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపితేనే కేబుల్ రంగంలో కొనసాగడం సాధ్యమవుతుందని ఆపరేటర్లు పేర్కొంటున్నారు.✍️మెటికల శ్రీనివాసరావు
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0