భూలోక వైకుంఠం భద్రాచల క్షేత్రం

భద్రాచలం స్టూడియో భారత్ ప్రతినిధి

Apr 9, 2024 - 15:21
 0  144
భూలోక వైకుంఠం భద్రాచల క్షేత్రం

భూలోక వైకుంఠం భద్రాచల క్షేత్రం

ప్రత్యేకం

భూలోక వైకుఠం భద్రాచలం.భద్రాచల దివ్యక్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది.బ్రహ్మపురాణంలో భద్రాచల క్షేత్రమహాత్మ్యం అత్యద్భుతంగా వర్ణించబడింది.అష్టాదశ పురాణాలను రచించినటువంటి వేదవ్యాస భగవానుడు బ్రహ్మ పురాణంలో భద్రాచల క్షేత్రం ఏవిధంగా ఆవిర్భవించిందో తెలియపరచాడు. 

త్రేతా యుగంలో భగవంతుడు రామచంద్రమూర్తిగా అవతారకాలంలో తన తండ్రి దశరథ మహారాజుయొక్క ఆజ్ఞమేరకు సీతాలక్ష్మణ సమేతుడై రామచంద్రమూర్తి పధ్నాలుగు సంవత్సరములు వనవాసం చేసినప్పుడు దండకారణ్యంగా పిలువబడే ఈ భద్రాచలానికి విచ్చేసాడు.భద్రాచలానికి సమీపంలో ఉన్న పర్ణశాలలో సీతారామ లక్ష్మణులు నివసించారు.ఆ సమయంలో సీతారామలక్ష్మణులు ముగ్గురూ వనవిహారం చేస్తూ ఆప్రాంతమంతా తిరుగుతూ గోదావరీ తీరంలోని ఒక శిలపై కాసేపు విశ్రాంతి తీసుకోగా వారికి ఆశిల గొప్ప విశ్రాంతిని కలుగచేసింది. సీతారాములు ఆశిలను దీవించారు.

"భవిష్వసి మహాత్మత్వం భక్తోపి గిరి రూపధృత్" మాకు ఈ కొద్దిసేపు విశ్రాంతిని ఇచ్చిన ఫలితంగా వచ్చేజన్మలో నీవు మా భక్తుడవై పుట్టి సర్వకాల సర్వావస్థల్లోనూ మా సేవను చేసుకునే భాగ్యం పొందగలవు.సీతారాముల దీవెన లందుకున్న ఆశిల అనంతర కాలంలో మేరువు మేరుదివి అనే దంపతులకు కుమారునిగా జన్మించింది.ఆ దంపతులు తమ కుమారునికి భద్రుడు అని పేరు పెట్టి పెంచుతూ ఉన్నారు. 

భద్రునికి పూర్వజన్మ స్మృతి ఉన్నది. 

తాను పూర్వజన్మలో ఒక రాయిగా పడిఉంటే సీతారాములు ఉత్తమమైన మానవ జన్మ కలుగ జేశారు.అనే గొప్ప కృతజ్ఞతా భావంతో రామ భక్తుడై నారద మహర్షి వద్ద రామతారక మంత్రోపదేశాన్ని, పొంది రాముడు సంచరించిన ఈ గోదావరీ నదీ తీరంలో ఉంటూ రామదర్శనం కొరకు అనేక వేల సంవత్సరాల తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చి అప్పటి తమ అవతారాన్ని ముగించిన రామచంద్రుడు వైకుంఠంలో నుంచి శ్రీమన్నారాయణమూర్తి భూలోకానికి వచ్చి సీతాలక్ష్మణసమేతుడై భద్రమహర్షి ముందు శంఖ చక్ర ధనుర్బాణ ధారి అయిన రామచంద్రమూర్తిగా,చతుర్భుజ రాముడుగా సాక్షాత్కరించాడు. భద్రమహర్షి తన ముందు కనపడిన శ్రీమన్నారాయణుని వరం కోరుకున్నాడు. 

'అనేన మే ప్రసన్నేన రూపేణ మమ మూర్ధని,శంఖచక్రధనుర్బాణసీతాలక్ష్మణ సంయుతః,నివస త్వం రఘుశ్రేష్ఠః నాథః కాంక్షే వరం ప్రభో

ఓ స్వామి నాకు నీవు ఎలా దర్శనం ఇచ్చావో అదే రూపంలో సీతాలక్ష్మణ సహితుడవై శంఖచక్రధనుర్బాణ ధారివై చతుర్భుజ రాముడుగా నాశిరస్సుమీద వేంచేసి ఉండవలసినదని ప్రార్థించగా ఆ భద్రమహర్షి కోరికను తీరుస్తూ ఆయన తలపై తన పాదములను ఉంచాడు.రామపాద స్పర్శ తగలగానే భద్రమహర్షి ఒక కొండగా మారిపోగా కొండపై రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతుడై స్వయంభువుగా ఆవిర్భవించాడు.అని వేద వ్యాసమహర్షి బ్రహ్మపురాణంలో తెలిపాడు.

అటువంటి అత్యంత పురాణ ప్రఖ్యాతమైన స్వయంభూ రామక్షేత్రం భద్రాచలం దివ్యక్షేత్రం.వైకుంఠం నుంచి సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే ఆ భద్ర మహర్షి ముందు సాక్షాత్కరించి ఆర్చామూర్తిగా ఈ భద్ర పర్వతంపై ఆయన కొలువు తీరి ఉన్నాడు. భద్రమహర్షి ఆయనను ధరించి ఉన్న కారణంగా ఈ క్షేత్రానికి భద్రాచలమని పేరు ఏర్పడింది."వైకుంఠవత్ సదా తస్మిన్ వైకుంఠపుర వాసిఖిః" అంటూ బ్రహ్మపురాణంలోని ఈ క్షేత్ర మహత్యంలో వైకుంఠంలో వైకుంఠపురవాసులతో ఎలగైతే వేంచేసి ఉంటాడో అలాగే "వైకుంఠవత్ సదా" వైకుంఠంలో వలె ఎల్లప్పుడు భద్రపర్వతంపైన రామచంద్రమూర్తి కొలువుతీరి ఉంటాడు అని చెప్పబడింది. 

భద్రాచలంలోభూలోక వైకుంఠం భద్రాచల క్షేత్రం

రామదాసుగారు ఈ క్షేత్రపురాణాన్ని ఆధారంగా చేసుకుని భద్రాచలాన్ని భూలోక వైకుంఠము అని అభివర్ణించారు."శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవా చార జనంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠ ము న్నారయభద్ర శైలశిఖరాగ్రముగాగ వసించు చేతనో ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధీ"అంటూ దాశరథీ శతకంలో వైకుంఠంలో ఉండే సన్నివేశం భద్రాచలంలో ఉన్నదీ అని భద్రాచలం భూలోక వైకుంఠము అని రామదాసుగారు చెపుతున్నారు. 

లక్ష్మీదేవి సీతమ్మగా,వైకుంఠంలో లక్ష్మీ నారాయణులకు నిరంతర సేవచేసే వైకుంఠ పార్శ్వకులు అయిన అనంత గరుడ విశ్వక్సేనాదు లంతా ఈ భద్రాచలంలో కైంకర్యం చేసే అర్చక, పరిచారక, అధ్యాపకాది రూపంలో ఉండి స్వామికి సేవలు చేస్తున్నారట.భద్రశైల శిఖరాగ్రము పైన విమాన స్థానం ఏదైతే ఉందో అది వైకుంఠము అన్నారు.భక్త రామదాసు గారు ఈ పద్యం ద్వారా భద్రాచలాన్ని గురించి శ్రీరాముడు చేతనోద్ధారకుడైన విష్ణుడు అని భూలోక వైకుంఠనాథుడు భద్రాచలంలో గల రామచంద్రుడు అర్చామూర్తిగా సాక్షాత్తు వైకుంఠం నుండి నేరుగా దిగినటువంటి వాడు అని చెపుతున్నారు.ఆయన ఉన్న స్థానం వైకుంఠమనే కాకుండా అయోధ్యయే వైకుంఠము అనే మాట.వేదముల ద్వారా తెలుస్తున్నది.

“రథస్థం రాఘవం పునర్జన్మ నవిద్యతే” 

రథమందు వేంచేసిన రాఘవుడైన భద్రాచల రామున్ని సేవించిన వారికి పునర్జన్మలేదు. అందుకే భూలోకవైకుంఠం భద్రాచల క్షేత్రం."దేవానాం పూరయోధ్యా తస్యాగుం హిరణ్మయః కోశః" అని అరుణ పాఠంలో కృష్ణ యజుర్వేదంలో అన్నారు.దేవతలు అనగా నిత్య సూరులు. వారు ఉండే స్థానానికి అయోధ్యా అని పేరు.కనుక వైకుంఠానికి అయోధ్య అని మరొక పేరున్నది. ఆపేరునే ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు పెట్టుకున్నారని మనువు తన రాజధానిగా చేసుకొని అయోధ్యా ప్రాంతాన్ని పరిపాలించాడు అని, రామచందమూర్తి తన అవతార కాలంలో పదకొండువేల సంవత్సరాలు పరిపాలించాడు అని ప్రశస్తి....అని మనకు రామాయణం ద్వారా వాల్మీకి మహర్షి తెలియ పరిచాడు. 

రాముడు ఉన్న స్థానం అయోధ్య, వైకుంఠానికి అయోధ్య అని పేరున్నది.ఈ రెండింటికీ గుర్తు చేస్తూ వేదాంత దేశికుల వారంటారు "దివ్యభౌమ అయోధ్యాధి దైవతా"దివ్యమనగా పరమపదం, భౌమమనగా భూలోకం లోని అయోధ్య,రెండిటికి అయోధ్య అనిపేరు.అధిదైవమే శ్రీరామచంద్రుడు అని వేదాంత దేశికులు రఘువీర గద్యలో దృష్ట్వా రామచంద్రుని కీర్తిస్తారు. అలాగే భద్రాచల దివ్యక్షేత్రం కూడా వైకుంఠమే!స్వయంగా శ్రీమన్నాయణుడే భూలోకానికి దిగినటువంటి ప్రాంతం.ఈ ప్రాంతంలో శ్రీరామచంద్రమూర్తి స్వయంభువుగా ఆవిర్భవించాడు అనేది తెలుగు రాష్ట్రాలకు ఎంతో గర్వ కారణమైన ప్రాంతం.అయోధ్యకు ఎంత వైశిష్ట్యం ఉందో భద్రాచలానికి అంత వైశిష్ట్యం ఉన్నది. రాముడు రామావతార కాలంలో వనవాస సమయంలో సంచరించిన ప్రాంతం.రామావతారం ముగిసిన తరువాత కూడా భద్రమహర్షి తపఃఫలంగా వైకుంఠం నుంచి శంఖ చక్ర ధారియై చతుర్భుజుడుగా ఆవిర్భవించిన ప్రాంతం భద్రాచలం.భద్రాచలంలో సీతారాములకు లక్ష్మీ నారాయణులుగా ఆరాధన జరపడం ఆచారం.

రామదాసుగారి దాశరథి శతకం ద్వారా క్షేత్ర మహత్యం ద్వారా ఇక్కడ ఉండే రామచంద్రుని వైకుంఠరాముడని,ఓంకార రాముడని,రామ నారాయణుడని,భద్రాద్రి రాముడని,సీతారామచంద్ర మూర్తి అని అనేక పేర్లతో ఈ స్వామిని కీర్తిస్తారు.ద్వాపర యుగం చివర నుండే స్వయం వ్యక్త క్షేత్రమైన ఈ క్షేత్రాన్ని భక్తరామదాసు 17వ శతాబ్దంలో జీర్ణోద్దరణ చేసి గొప్ప ఆలయాన్ని నిర్మించారు.తద్వారా రాముని గొప్పతనాన్ని చాటాడు. రామచంద్రమూర్తి ఒక్కడే దైవమని లోకానికి చాటుతాను అని దాశరథీ శతకంలో అంటాడు.అటువంటి భూలోక వైకుంఠమైన ఈ క్షేత్రంలో శ్రీరామనవమి పండుగను శ్రీరాముడు అవతరించిన రోజును ఎంతో విలక్షణంగా జరుపుకోవటం అనూచానంగా వస్తున్న గొప్ప ఆచారం.

భూలోకవైకుంఠం భద్రాచలక్షేత్రం

శ్రీరామనవమి అనగానే అయోధ్యకంటే ముందే గుర్తుకు వచ్చే క్షేత్రం భద్రాచల క్షేత్రం. ఇక్కడ ఉగాది నుండి ప్రారంభించి 15 రోజులు పక్షోత్సవంగా జరుపబడతాయి. వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలుగా కీర్తింప బడుతున్నాయి. ఉగాది నుండి పూర్ణిమ వరకు నిర్వహించబడే ఈ బ్రహ్మోత్సవాల్లో శ్రీరామచంద్రమూర్తి ఒక్కోక్క రోజు ఒక్కొక్క వాహనంలో పన్నెండు వాహనాలపైన ఊరేగటం గొప్ప విశేషమైన విషయం.ఆ పన్నెండు వాహనాలు ఏమిటంటే ఎందుకు అంటే? ద్వాదశాదిత్య రూపంగా మరియు ద్వాదశాక్షర రూపంగా ఉండే వాహనాలపైన ఒక్కోరోజు ఒక్కోరకంగా భక్తులకు దర్శనం ఇస్తాడు.

ఉగాది రోజు కల్పవృక్ష వాహనం,ఘమర్నాడు సార్వభౌమ వాహనం, ఎదుర్కోలు ఉత్సవంనాడు గరుడవాహనం ముందురోజు హనుమద్ వాహనంపై ఇలా దర్శనం ఇస్తాడు. శ్రీరామనవమి నాడు కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించబడుతుంది.మర్నాడు పట్టాభిషేక మహూత్సవం చేసుకొని రాముడు పుర వీధుల్లో రథంపై ఊరేగుతాడు.కళ్యాణోత్సవం,పట్టాభిషేకం కన్నులపండుగగా వైభవంగా నిర్వహించబడుతాయి.అంతేగాక రామాయణ,వేద,ఇతిహాస,దివ్య ప్రబంధ పారాయణాలు వైభవోపేతంగా నిర్వహింపబడుతాయి.పూర్ణిమనాడు శ్రీపుష్పయాగంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.ఆరోజు శ్రీరాముడు దివ్య ఊర్ధ్వపుడ్రంతో విశేషంగా దర్శనం ఇస్తారు. సంవత్సరమంతా కస్తూరి తిలకంతో దర్శనఇచ్చే రాముడు పూర్ణిమనాడు పుష్పయాగంలో ఆదిశేష వాహనంపై దివ్య ఊర్ధ్వపుండ్రంతో వైకుంఠనారాయణుడిగా, పరమపద నాథునిగా భక్తులకు దర్శనం ఇస్తాడు. "రథస్థం రాఘవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే" అని క్షేత్ర పురాణంలో చెబుతారు. రథమందు వేంచేసిన రాఘవుడైన భద్రాచల రామున్ని సేవించిన వారికి పునర్జన్మలేదు. అందుకే భూలోకవైకుంఠం భద్రాచల క్షేత్రం.

ద్వాదశ ప్రదక్షిణలు ద్వాదశారాధనలతో పూర్ణిమ నాడు పుష్పయాగంలో శ్రీరాముడు గొప్ప శేష వాహనం పైన దివ్యోర్ధ్వ పుండ్రధారియై ఊరేగుతూ పుష్పయాగాన్ని స్వీకరించే ఉత్సవం కన్నుల పండుగగా ఉంటుంది. ఆ వైభవాన్ని అందరం దర్శించి తరిద్దాం!.జై శ్రీరామ్ 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow