కాకినాడ కలెక్టర్ సింగం హీరో వలె
కాకినాడ స్టూడియో భారత్ ప్రతినిధి
కాకినాడ కలెక్టర్ సింగం హీరో వలె..!!
సముద్రంలో ఛేజింగ్ సీన్
సముద్రంలో సింగం-2 సీన్ రిపీట్
కాకినాడ నుంచి పశ్చిమ ఆఫ్రికా నౌకలో పేదల బియ్యం
సముద్రంలోకి వెళ్లి తనిఖీ చేసిన కాకినాడ కలెక్టర్
‘స్టెల్లా ఎల్’ షిప్‌లో 640 టన్నుల పీడీఎస్ బియ్యం గుర్తింపు
కాకినాడ పోర్టులో సోదాలు
పేదల బియ్యం(పీడీఎస్) అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటంలేదు. కాకినాడ పోర్టు ద్వారా అడ్డదారిన విదేశాలకు తరలిపోతూనే ఉన్నాయి. ఇక్కడి యాంకరేజి పోర్టులో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పశ్చిమ ఆఫ్రికా వెళ్లేందుకు సిద్ధమైన స్టెల్లా ఎల్ నౌకలో 640 మెట్రిక్ టన్నుల పేదల బియ్యాన్ని గుర్తించారు.ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఈ సోదాలు చేపట్టారు. బార్జిలు నిలిపే ప్రాంతం నుంచి సముద్రంలో గంటపాటు ఓడలో కలెక్టర్ ప్రయాణించారు. ‘స్టెల్లా- ఎల్’ నౌక ఉన్న ప్రాంతానికి పోలీసు, పోర్టు, మెరైన్, రెవెన్యూ, పౌరసరఫరాల బృందంతో చేరుకున్నారు. నౌకలోని ఐదు గదుల్లో (హేచెస్) నిల్వ ఉంచిన బియ్యం నిల్వల నమూనాలు సేకరించారు. 3, 5 గదుల్లోకి దిగి ప్రత్యక్షంగా నిల్వలు పరిశీలించారు. అనుమానం ఉన్నవాటిని అక్కడికక్కడే రసాయనాలతో పరీక్షించారు. 52 వేల టన్నుల సామర్థ్యం ఉన్న నౌకలో 38 వేల టన్నుల బియ్యం లోడయ్యిందని.. అందులో 640 టన్నులు పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించామని కలెక్టర్ విలేకర్లకు తెలిపారు. గతంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సీజ్ చేసిన పేదల బియ్యాన్ని ఇటీవల బ్యాంకు గ్యారంటీతో విడుదల చేశామని..పట్టుకున్న బియ్యం నిల్వలు అలాగే ఉన్నాయని అనిపిస్తోందన్నారు. అక్కడున్న మిగిలిన నిల్వలు బాయిల్డ్ రైస్‌గా పేర్కొన్నారు. పీడీఎస్ బియ్యంపై రసీదులు తనిఖీ చేశాక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
కాకినాడ కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా సమాచారంతో గత 2 రోజులుగా తనిఖీలు సాగుతున్నాయి. సోదాల్లో స్వాధీనం చేసుకున్నది పేదల బియ్యమే అని అధికారులు చెబుతున్నా అక్రమాలపై పూర్తిస్థాయి స్పష్టత లేదు.రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ సుధీర్ మంగళవారం రాత్రి కరప మండలం నడకుదురులోని గోదాములో ఆకస్మిక తనిఖీలు చేసి ఐదు లారీల్లోని బియ్యాన్ని సీజ్ చేశారు. తెలంగాణ నుంచి వచ్చిన ఓ లారీలో పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించి నమూనాలను పరీక్షలకు పంపారు. గురువారం కలెక్టర్ ఆధ్వర్యంలో పోర్టులో సోదాలు సాగాయి.ఈ రెండుచోట్లా పట్టుకున్నది ఇటీవల బ్యాంకు గ్యారంటీతో విడుదలైన పేదల బియ్యమే అనే అభిప్రాయం వినిపిస్తున్నా..ఆ ముసుగులో సరకు తరలిపోతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోర్టు బార్జిలోనూ పేదల బియ్యం
కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి చేసే నౌకలోకి ఎక్కించేందుకు వెళ్తున్న బార్జి ఐవీ0073లో 1,064 టన్నుల బియ్యం నిల్వలను అధికారులు బుధవారం రాత్రి గుర్తించారు. ఇవి లావణ్, సాయితేజ ఎక్స్‌పోర్ట్స్‌కు చెందినవిగా తేలింది. వీటి నమూనాలు పరీక్షిస్తే పీడీఎస్ ఆనవాళ్లు ఉన్నాయని చెప్పారు. ఇటీవల బ్యాంకు గ్యారంటీతో విడుదలచేసిన పీడీఎస్ నిల్వలని చెబుతున్నారని, పత్రాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని డీఎస్‌వో ప్రసాద్ తెలిపారు.
What's Your Reaction?