కలెక్టరేట్ ను ముట్టడించిన అంగన్వాడీలు

ఏలూరు స్టూడియో భారత్ ప్రతినిధి

Jul 11, 2023 - 21:30
Jul 11, 2023 - 21:32
 0  80
కలెక్టరేట్ ను ముట్టడించిన అంగన్వాడీలు

కలెక్టరేట్ ను ముట్టడించిన అంగన్వాడీలు

36 గంటల మహా ధర్నాలో భాగంగా రాత్రంతా కలెక్టరేట్ వద్ద నిద్రించినా స్పందించని ప్రభుత్వం,అధికారులు.ఆగ్రహంతో కలెక్టరేట్ దిగ్బంధం.

ఏలూరు జూలై 11:

అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన 36 గంటల ధర్నా ఏలూరు కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన జరిగిన మహా ధర్నాకు జిల్లా నలుమూలల నుండి వేలాది మంది అంగన్వాడీలు తరలి వచ్చారు.గత 36 గంటలుగా కలెక్టరేట్ వద్ద బైఠాయించి అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.సోమవారం రాత్రి కలెక్టరేట్ వద్ద నిద్రించి వర్షంలో తడుస్తూ తమ నిరసన కొనసాగించారు.అయినప్పటికీ అధికారులు ప్రభుత్వం స్పందించకపోవడంతో అంగన్వాడీలు కలెక్టరేట్ ను ముట్టడించారు.కలెక్టరేట్ రోడ్డు వద్ద పోలీసు వలయాన్ని ఛేదించుకుని కలెక్టర్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద బైఠాయించారు.జిల్లా అధికారులు వచ్చి తమ సమస్యలపై స్పందించే వరకు కదిలేయలేదని కూర్చున్నారు.

ఈ సందర్భంగా అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని,కనీస వేతనం 26,000 ఇవ్వాలని,రాజకీయ వేధింపులు అరికట్టాలని,సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి గ్రాట్యూటీ ఇవ్వాలని,అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని,సంక్షేమ పథకాలు అమలు చేయాలని పెద్దపెట్టున నినదించారు.అంగన్వాడీల ఆందోళనకు స్పందించిన జిల్లా రెవెన్యూ అధికారి అంగన్వాడీల వద్దకు వచ్చి వినతిపత్రం తీసుకున్నారు.అంగన్వాడీల సమస్యలు పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు.

ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు (IV) మద్దతు

అంతకుముందు మహాధర్నాలో భాగంగా రెండో రోజు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు.అంగన్వాడీలు రాష్ట్రంలోనీ 26 జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించి ఆందోళన చేస్తున్నా జగన్ ప్రభుత్వం స్పందించకపోవడం అమానుషమన్నారు.ప్రభుత్వంతోపాటు జిల్లా అధికారులు కూడా కనీసం అంగన్వాడీలను పలకరించి వాళ్ల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం బాధాకరమన్నారు. 

ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలకు భిన్నంగా నాలుగేళ్ల కాలంలో అంగన్వాడీల సమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు.నాలుగేళ్లలో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా వేతనాలు మాత్రం పెంచలేదన్నారు.శాసనమండలంలో పిడిఎఫ్ పక్షాన అనేకసార్లు అంగన్వాడీల సమస్యలు ప్రస్తావించామని,అయినా ప్రభుత్వం వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.దీనిని బట్టే చిరుద్యోగులపై జగన్ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ తెలుస్తోందని ఎద్దేవా చేశారు.ఇప్పటికైనా జగన్ స్పందించి అంగన్వాడీల వేతనాలు వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. 

సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.రవి మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసే కుట్రలో భాగంగా ఐసిడిఎస్ ను కూడా నిర్వీర్యం చేస్తుందన్నారు.ఐసిడిఎస్ కు బడ్జెట్ కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు.ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు,ప్రధాన కార్యదర్శి డిఎన్వీడి ప్రసాద్,అంగన్వాడి యూనియన్ జిల్లా కార్యదర్శి పి భారతి లు మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ప్రకటించారు.అంగన్వాడీలంతా నిరవధిక సమ్మెకు కూడా సిద్ధమై ఉండాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పివి రామకృష్ణ,ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కే.లెనిన్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి.సూర్యకిరణ్,ఐద్వా జిల్లా కార్యదర్శి పి. హైమావతి,మెడికల్&హెల్త్ యూనియన్ గోవింద్,రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్.నరసింహ లు మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన సమస్యల పరిష్కారానికి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ప్రకటించారు. 

ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు కే విజయలక్ష్మి,టి మాణిక్యం,పి ఎల్ ఎస్ కుమారి,విమల,మీనా,రాజకుమారి,తులసి సరోజిని,బీజేఎన్ కుమారి,రాజమణి,పుష్ప,లత సిఐటియు జిల్లా నాయకులు బి సోమయ్య,జి రాజు,కెవికెఎస్ ప్రసాద్,నారపల్లి రమణారావు,ఎస్ రాంబాబు,ఎం నాగమణి,వి సాయిబాబు,జై గోపి,బి జగన్నాథం తదితరులు నాయకత్వం వహించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow