సంకల్పం అతని‌ లక్ష్యం క్రికెటర్ యశస్వీ జైస్వాల్..

ముంబాయి స్టూడియో భారత్ ప్రతినిధి

Mar 1, 2025 - 09:12
Mar 2, 2025 - 11:54
 0  28
సంకల్పం అతని‌ లక్ష్యం క్రికెటర్ యశస్వీ జైస్వాల్..

సంకల్పం.. అతని‌ లక్ష్యం.._ క్రికెటర్ యశస్వీ జైస్వాల్..

పదేళ్ల బాలుడు.. 

అమ్మానాన్నను వదిలి, ఉన్న ఊరును కాదని ముంబయి వచ్చేశాడు. క్రికెట్‌ అంటే ప్రేమ. ఆటే జీవితం. ఆ మహా నగరంలో రోడ్లపై తిరిగాడు. పడుకోవడానికి చోటు లేక.. మైదానంలోని టెంటు కింద నిద్రించాడు. పానీపూరీ అమ్మాడు. అప్పుడే అనుకున్నాడు.

టీమ్‌ఇండియాకు ఆడాలని, ముంబయిలో ఇల్లు కొనాలని..!:పుష్కర కాలం గడిచింది.. ఇప్పుడు భారత జట్టులో అతనో కీలక ఆటగాడు. టెస్టుల్లో వరుసగా ద్విశతకాలు బాదేస్తూ.. రికార్డుల దుమ్ము దులుపుతున్నాడు. తాజాగా ముంబయిలో అత్యంత విలాసవంతమైన ప్రదేశంలో రూ.5 కోట్లకు పైగా డబ్బుతో 5 పడక గదుల ఫ్లాట్‌ కొన్నాడు. అతడే.. యశస్వి జైస్వాల్‌. ఏమీ లేని స్థితి నుంచి ఇక్కడివరకూ చేరుకున్న అతని స్ఫూర్తి ప్రయాణం అందరికీ ఆదర్శం. అతనో వ్యక్తిత్వ వికాస పాఠం. ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు. ఆ దిశగా కొన్ని రోజులు పని చేస్తారు. మహా అయితే కొన్ని నెలలు కష్టపడతారు. ఆశించిన ఫలితాలు కనిపించకుంటే తమ వల్ల కాదని ఎంతోమంది మధ్యలోనే వదిలేస్తారు. కొత్త ఏడాది రాగానే అది చేసేద్దాం.. ఇది నేర్చుకుందాం అనుకుంటారు.కానీ ఓ వారం తిరిగేసరికి మళ్లీ మొదటికే వస్తారు. కల కనడం కాదు దాన్ని అందుకోవడం ముఖ్యం. గమ్యాన్ని చేరేంతవరకూ విశ్రమించకపోవడం ప్రధానం. అలాంటివాళ్లనే విజేతలు అంటారు.

అలాంటి ఓ విజేతే.. యశస్వి జైస్వాల్‌..:

బలమైన సంకల్పం ఉంటే దేన్నైనా సాధించవచ్చు అనడానికి నిఖార్సైన ఉదాహరణ అతను.నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేంతవరకూ అలుపెరగని, భయమెరగని వీరుడు అతను. అతని జీవితం పూల పాన్పేమీ కాదు.అతని దారిలో ఎన్నో సవాళ్లు. కానీ ఒక్కో కారు మబ్బును దాటుకుంటూ మిరుమిట్లు గొలిపే భానుడిలా ప్రకాశిస్తున్నాడు.యశస్వి లాంటి నేపథ్యం ఉన్న ఓ కుర్రాడు ఈ స్థాయికి రావడం చిన్న విషయం కానేకాదు.కష్టపడితే కల నిజం చేసుకోవచ్చని అతను చాటాడు. క్రికెట్‌ అనే కాదు ఏ రంగమైనా, వృత్తి ఏదైనా శక్తివంచన లేకుండా సాగితే విజయవంతం కాగలమని నిరూపించాడు.

ఆగిపోవద్దు:

ఒక్క రోజులోనే ఏదీ మారిపోదు. అనుకున్న వెంటనే ఫలితం దక్కదు. నిరంతర ప్రయత్నం తప్పనిసరి. పోరాటం లేకపోతే గెలుపే లేదు. విజయం దక్కడం లేదని ఆగిపోతే ఏం సాధించలేం. అలా ఆగిపోయి ఉంటే ఇప్పుడు యశస్వి గురించి చెప్పుకోవాల్సిన అవసరమే ఉండేది కాదు. అతనెన్నో ఎదురు దెబ్బలు తిన్నాడు. ఎన్నో అడ్డంకులు దాటాడు. క్రికెట్‌ ఆడతానంటే తల్లిదండ్రులు వద్దన్నారు. తండ్రి చేయి చేసుకున్నాడు. కానీ ఆటంటే ప్రాణం. అందుకే ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి కట్టుబట్టలతో పెద్దగా ఏమీ తెలియని వయసులోనే ముంబయికి వచ్చేశాడు. డబ్బులు లేక పస్తులున్నాడు. డెయిరీలో పనికి కుదిరినా.. ఆటపై ధ్యాసతో సరిగ్గా పని చేయడం లేదంటూ అతణ్ని వద్దన్నారు. ఎక్కడ ఉండాలో తెలియక ఆజాద్‌ మైదానంలోని టెంట్లో పడుకున్నాడు. అక్కడే పానీపూరీ అమ్మాడు. ఇలా ఎన్నో ప్రతి కూలతలు. ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు.. మూడేళ్ల పాటు ఇవే ఇబ్బందులు. కానీ సాధించాడు. అందుకు కారణం.. అతని ఓపిక, స్వీయ నమ్మకం. కష్టాలకు బెదరని తీరు. సవాళ్లకు ఎదురుగా నిలబడే ధైర్యం.

వెనుకబడిన కులాల రుద్ర భూమి దుస్థితిని పట్టించుకునే నాథుడే కరువైయ్యే! - https://studiobharat.com/Nath-who-cares-about-the-plight-of-the-backward-castes-Rudra-Bhoomi-will-suffer-drought

అవకాశం వదలొద్దు: 

అవకాశం ఎంతో విలువైంది.అది అందడమే కష్టం.అందినపుడు సద్వినియోగం చేసుకోకుంటే మొత్తంగా దారులు మూసుకుపోతాయి.యశస్వికి ఏ చిన్న అవకాశం వచ్చినా రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు.దేశవాళీల్లో ముంబయి తరపున రాణించాడు.17 ఏళ్లకే లిస్ట్‌- ఎ క్రికెట్లో డబుల్‌ సెంచరీ చేసి, ఆ ఘనత సాధించిన పిన్న వయస్సు ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2020 అండర్‌-19 ప్రపంచకప్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నాడు. ఆ టోర్నీలో అత్యధిక పరుగుల (400) వీరుడు అతడే. దీంతో అదే ఏడాది ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ అతణ్ని తీసుకుంది.ఆ జట్టు తరపున లీగ్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. నిరుడు ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం బాదాడు.ఇక టీమ్‌ ఇండియాకు ఆడాలనే స్వప్నం 2023 వెస్టిండీస్‌ పర్యటనలో సాకారమైంది.టెస్టులతో అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టాడు. అక్కడి పేస్‌ పిచ్‌లపై ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని తొలి ఇన్నింగ్స్‌లోనే 171 పరుగులు చేశాడు.

అలసత్వం వద్దు:

ఓ స్థాయికి వచ్చేశాక అలసత్వం మంచిది కాదు. ఆపైనే కెరీర్‌ను నిర్మించు కోవడం కీలకం.ఐపీఎల్‌లో సత్తాచాటిన ఎంతో మంది టీమ్‌ఇండియాలోకి వచ్చినా.. నిలకడ లేక మరుగున పడ్డారు. కానీ యశస్వి అలా కాదు. అతని కసి వేరు.నిరంతరం మెరుగవాలనే తపనతో సాగుతున్నాడు.మ్యాచ్‌ ఉన్నా లేకపోయినా సాధన కొనసాగిస్తాడు. ఒక షాట్‌ను పరిపూర్ణంగా ఆడేంతవరకూ ఎన్ని గంటలైనా సరే ప్రాక్టీస్‌ చేస్తాడు. ఆగిపోవడం, అలసి పోవడం అతనికి తెలియదు. అతని పరుగుల దాహం తీరనిది.అర్ధశతకాన్ని శతకంగా ఎలా మలచాలి?ద్విశతకం ఎలా సాధించాలి? అనే ధ్యేయంతోనే ఆడతాడు. ప్రస్తుత తరం ఆటగాళ్లలో యశస్వి ఓ అరుదైన రకం. ఒక్కసారిగా వచ్చిన పేరు,డబ్బుతో పొగరు తలకెక్కించు కోకూడదు.ఇతర ఆకర్షణల జోలికీ వెళ్లకూడదు. ఒకప్పుడు వినోద్‌ కాంబ్లి, ఈ తరంలో పృథ్వీ షా లాంటి ఆటగాళ్లు ఆరంభంలో సత్తాచాటి ఆ తర్వాత దారి తప్పారు. ఇప్పుడు యశస్వికి 22 ఏళ్లే.అతను స్థిరంగా నిలబడితే..డబ్బు,పేరు,ప్రఖ్యాతులు దాటి సాగితే మరో భారత సూపర్‌స్టార్‌ అవుతాడు.

యశస్వి అంటే విజయవంతమైన అని అర్థం.యశస్వి ఇదే తపనతో,సంకల్పంతో సాగితే సార్థక నామధేయుడు అవుతాడు.మూడు ఫార్మాట్లలోనూ ప్రధాన ఆటగాడిగా మారతాడు. యశస్వి ప్రేరణతో యువత తమ రంగాల్లో సాగితే..అతనిలాగే విజేతలుగా నిలుస్తారనడంలో సందేహం లేదు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow