సర్వదేవాత్మకుడు ఆదిత్యుడు
స్టూడియో భారత్ ప్రతినిధి
సర్వదేవాత్మకుడు ఆదిత్యుడు
ప్రాతఃకాలాన్నే స్నానం చేసి, శుచిగా సూర్యుని నమస్కరిస్తే చాలు- పాప నిర్మూలనం జరిగి, పవిత్రులమ వుతామని మహాభారతంలో శ్రీకృష్ణుడు బోధించాడు.
సూర్యోదయ సమయంలోని రోగహరణ శక్తే ఉష సూర్యకిరణాల వలన కలిగే వికసనశక్తి చేతనే సర్వ జగతి చేతనత్వం పొందుతోంది. ఆ శక్తినే 'పద్మిని' అన్నారు. ప్రతిబింబశక్తిని 'ఛాయ'గా చెప్పారు.
వీరే సూర్యుని భార్యలు.
సౌమ్యత, తీక్షత, ప్రశాంతం, ప్రచండం....అన్నీ సూర్యునిలోనే మనం చూడవచ్చు. ఘోరం, అఘోరం.... ఈ రెండింటితోనూ ప్రపంచాన్ని ప్రభావితం చేసే వాడీ తడే కనుక రుద్రుడనీ, శివుడనీ, దిక్కులకు పతి అనీ వేదం పేర్కొంది.
సూర్యుని నుంచే దిక్కులు ఏర్పడుతున్నాయి. సూర్యో దయ దిశను తూర్పుగా తెలుసుకున్నాకనే, మిగిలిన దిశలను నిర్ణయిస్తున్నాం.
కనుక 'దిశాంచ పతయే నమః' అని శ్రుతిమంత్రం వినుతించింది. ఆ కిరణాలే ఆయనకు సహస్రకరాలు.
ఇవ్వడం, లాలించడం, పాలించడం, కర్మచేయడం చేతుల లక్షణం. సూర్యకిరణాలు ఈ నాలుగు పనులతో విశ్వానికి హితాన్నీ, రమ్యతనీ అందిస్తాయి. కనుక 'హిరణ్యబాహువు' అని కీర్తించారు. ఈ కిరణాలను ప్రపంచమంతా పరచి వాటి ద్వారా సకల చరాచరాలకు ప్రాణశక్తిని అందిస్తున్న వ్యాపకత్వం చేత ఈయననే 'విష్ణువు' అన్నారు.
కిరణాలకున్న గమనలక్షణం బట్టి'గరుత్మంతుడ'ని పేర్కొన్నారు.కిరణాలనధిష్ఠించిన ఆదిత్యుడు గరుడ వాహనారూఢుడు.
సూర్యుని చైతన్యశక్తే జగతికి ఐశ్వర్యాలను ప్రసాదిస్తోంది. అందుకే లక్ష్మిగా, పరాశక్తిగా జగదంబగా సౌరశక్తిని ఆరాధిస్తున్నాం. (భాను మండల మధ్యస్థా.... లలితా సహస్రనామాల్లోని ఒక నామం.) సూర్యకిరణాలు తీక్షణంగా ఉన్నా, సౌమ్యంగా ఉన్నా పరిణామంలో మనకు మంగళ కరాలు. మంగళమే ఆయన స్వభావం. అందుకే 'శివుడు' (మంగళమయుడు) అని ఆయనను నుతించారు (ఆదిత్యంచ శివం విద్యాతే... శాస్త్రోక్తి).
ప్రాణశక్తి ప్రదానంతో సృష్టిని నిర్వహిస్తాడు- కనుక బ్రహ్మ, స్థితి, పోషణ కలిగించే శ్రీహరి. 'వారం' అంటే సర్వజీవసమూహం. వారికి శక్తినిచ్చే ఆశ్రయ శక్తి (ఆయనం) ఈతడే కనుక సూర్యనారాయణుడు.
'ఇంద దీప్తౌ' 'ఇది ఐశ్వర్యే'* - అనే సంస్కృత ధాతువుల ననుసరించి ప్రకాశ, ఐశ్వర్య లక్షణాలచేత సూర్యుని 'ఇంద్రుడు' అన్నారు.
కిరణాల్లోని జిడ్డుశక్తి 'మిత్ర', పోషణశక్తి 'పూష', ఆర్ద్రత 'వరుణ'. ఇలా సర్వదేవతలు సౌరశక్తి విశేషాలే. అందుకే వేదం ఏకం సత్ విప్రాః బహుధా వదన్తి అనే మంత్రాన్ని సూర్యపరంగానే చెప్పింది.
ఒకే సూర్యశక్తి పలు విధాలుగా జగతిని అనుగ్రహిస్తోంది.
సూర్యుడు జడ ప్రకృతి కాదు, పూర్ణచైతన్యం. సకల జగన్నిర్వహణ చేసే పరబ్రహ్మ చైతన్యం సూర్యుని ద్వారా మనల్ని అనుగ్రహిస్తున్నది. కనుక సర్వ దేవమయుడు ఆదిత్యుడు. సర్వదేవతాత్మకుడైన సూర్యుని ప్రకాశ దాహక శక్తినే యజ్ఞాగ్నిగా రగిల్చి, సర్వదేవతలను ఆరాధించే యజ్ఞసంస్కృతి మనది.
అఖండ తేజః స్వరూపుడైన ఆదిత్యుని మాఘ మాసం నుంచి మనం మరింత కాంతులతో గ్రహించనున్నాం.
ఉత్తరాయణ పుణ్యవేళ, దైవీయమైన సూర్యకాంతులు మన ప్రాంతాలకు సముజ్జ్వలంగా లభిస్తాయి.
ఈ కాంతిగమన పరిణామాన్నే 'రథం మారడం'గా చెప్పి, సప్త సంఖ్యా ప్రధానత చేత 'సప్తమి' తిథిని 'రథసప్తమి'గా సూర్యారాధనకు వినియోగిం చడం మన సంప్రదాయం. వారాలలో తొలి దినమైన ఆదివారం, తిథుల్లో సప్తమి - సూర్యారాధనకు ప్రశస్తం.
సూర్యనమస్కారం, ఆరాధన వైజ్ఞానికంగా, ఆధ్యాత్మికంగా కూడా సాఫల్యమైన భవ్య సంస్కృతి.
What's Your Reaction?