హైదరాబాద్‌లో పేట్రేగిపోయిన సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్ స్టూడియో భారత్ ప్రతినిధి
హైదరాబాద్‌లో పేట్రేగిపోయిన సైబర్ నేరగాళ్లు.. 15 మంది అరెస్టు..
హైదరాబాద్:
నగరంలో సైబర్ నేరగాళ్లు పేట్రేగిపోయారు. అమాయకుల పేరిట రుణాలు తీసుకున్న వారు కొందరైతే, క్రెడిట్ కార్డు కస్టమర్ కేర్ పేరుతో మోసాలకు పాల్పడిన వారు ఇంకొందరు..
వారి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు 15 మందిని అరెస్టు చేశారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి అమాయకుల పేరిట రూ.4.38కోట్లు రుణాలు తీసుకున్న 10 మందిని తొలుత పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా నకిలీ కంపెనీల పేరుతో ఉద్యోగాలిచ్చి.. వారి డాక్యుమెంట్లతో వ్యక్తిగత రుణాలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. రుణం మంజూరైన తర్వాత వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు తేలింది. బాంక్యు అధికారుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు 10 మందిని అరెస్టు చేశారు..
మరో ఘటనలో క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్ నంబర్ కోసం ఓ వ్యక్తి గూగుల్‌లో వెతికాడు. ఈ క్రమంలో నకిలీ నంబర్‌ను గుర్తించలేక దానికి ఫోన్ చేశాడు. కస్టమర్ కేర్ సిబ్బందిగా బాధితుణ్ని నమ్మించిన మోసగాళ్లు అతని మొబైల్‌లో ఎనీడెస్క్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు. అనంతరం బాధితుడి క్రెడిట్ కార్డ్ నుంచి రూ. 16 వేలు కాజేశారు. నష్టపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా దిల్లీకి వెళ్లి నిందితుల్ని అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా నిందితులపై కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఓ ముఠాగా ఏర్పడి నిందితులు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు..
What's Your Reaction?