ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి హామీలు ఎన్ని అమలయ్యాయి?

తెలంగాణ స్టూడియో భారత్ ప్రతినిధి

Dec 7, 2024 - 20:30
Dec 7, 2024 - 20:39
 0  72
ఏడాది పాలనలో  రేవంత్ రెడ్డి హామీలు ఎన్ని అమలయ్యాయి?

వేలాది మందితో ఎల్బీ స్టేడియం ప్రాంగణం కిక్కిరిసిపోయింది. బయట కూడా చాలామంది రోడ్లపై ఉన్నారు.తెలంగాణ ఏర్పాటు తరువాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేశారు.''4 కోట్ల తెలంగాణ ప్రజలకు..ముఖ్యంగా తెలంగాణ రైతుల,విద్యార్థుల,నిరుద్యోగ యువకుల, ఉద్యమకారుల,అమరవీరుల కుటుంబాల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఈనాడు ఇందిరమ్మ రాజ్యం ప్రతినబూనింది.ఈ ప్రభుత్వ ఏర్పాటుతో తెలంగాణ నలుమూలలా సమాన అభివృద్ధి జరుగుతుంది'' అంటూ రేవంత్ రెడ్డి ప్రసంగం సాగిందిఆ వెంటనే ఆరు గ్యారంటీల అమలు ఫైలుపై అదే వేదికపై తొలి సంతకం చేశారు రేవంత్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచింది.

మరి,ఈ ఏడాదిలో ఏం మారింది? 

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు ఎన్ని నెరవేరాయి?

పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన ఆరు గ్యారంటీల్లో ఎన్ని అమలయ్యాయి?.

కాంగ్రెస్ ఏడాది పాలనపై ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కె.శ్రీనివాస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.''కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంచుకున్న ప్రాధాన్యాలు సరిగా లేవు'' అని కె.శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.ఆరు గ్యారంటీల్లో ఎన్ని అమలయ్యాయంటే..2023 నవంబరు 17న అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు.అధికారంలోకి వస్తే అమలు చేస్తామంటూ 66 హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.మేనిఫెస్టో కంటే కూడా ఎక్కువగా ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది.మహిళలు,రైతులు,యువత,పేదలు,వృద్ధులు..ఇలా వివిధ వర్గాల కోసం ఆరు గ్యారంటీలను రూపొందించింది.తెలంగాణలో ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.కానీ ఏడాది గడిచేసరికి వీటిలో కొన్నింటిని మాత్రమే అమలు చేయగలిగింది.

దీనిపై ..''స్థూలంగా ఇంత వరకైతే కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత అనేది విజుబుల్‌గా కనిపించలేదని చెప్పాలి,లగచర్ల లాంటి ఒకట్రెండు ఘటనలు తప్పితే.అయితే,అక్కడ కూడా ప్రభుత్వం ఒకడుగు వెనక్కి వేసి జాగ్రత్తగా రూట్ తీసుకుంది.పూర్తి వ్యతిరేకత అనలేకపోయినా అసంతృప్తి అయితే కొన్ని సెక్షన్లలో మొదలైంది.పరిష్కారాల బదులు అటూ ఇటూగా ఏమార్చే రూటును ఎంచుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం.ఇలా మ్యానేజ్ చేయడం ఎంత కాలం సాగుతుంది అనేదే ప్రశ్న.కొన్ని పరిష్కారాలు చూపించాలి.అన్ని అలవిగాని హామీలిచ్చి ఆశలు పెంచిన ప్రభుత్వం ఉన్న బడ్జెట్లో ఎంత కాలం మ్యానేజ్ చేయగలుగుతుంది అనేది పెద్ద ప్రశ్న''.

ఇక ఆరు గ్యారంటీల పరిస్థితి ఎలా ఉంది?

మహాలక్ష్మి పథకం హామీ:

మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం,రూ.500కే గ్యాస్ సిలిండర్,నెలకు మహిళలకు రూ.2,500 సాయం. ఏం జరిగిందంటే?మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లో..అంటే డిసెంబరు 9 నుంచే ఈ హామీని అమలు చేసింది.''2024 డిసెంబరు 4 నాటికి 116.13 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ఉచితంగాప్రయాణించారు.రూ.3,913.81 కోట్ల రవాణా ఖర్చులను ఆదా చేసుకున్నారు.మహాలక్ష్మి పథకం ప్రారంభించక ముందు సగటున 45 లక్షల మంది ప్రయాణించగా.. ప్రస్తుతం సగటున ప్రతి రోజూ 58 లక్షల మంది ప్రయాణిస్తున్నారు'' అని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ చెప్పారు.దీనిపై రాజకీయ విశ్లేషకురాలు ప్రొఫెసర్ పద్మజా షా మాట్లాడుతూ.. ''మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచి పథకమే. ముఖ్యంగా మండల, గ్రామ స్థాయిలో ప్రయాణించే రోజువారీ శ్రామికులకు ఎంతో ఉపయోగం'' అని అన్నారు.అయితే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చాక ఆటోలకు గిరాకీ పడిపోయిందనే ఆందోళన ఉంది.దీనిపై హైదరాబాద్‌ లో కొందరు ఆటో డ్రైవర్లు బిక్షమెత్తుకుంటూ నిరసన తెలిపారు.''ఆటోవాలాలకు నష్టమనేది నిజమే గానీ,మహిళల ప్రయాణంతో వారిలో వస్తున్న స్వావలంబనను మనం అర్థం చేసుకోవాలి'' అన్నారు ప్రొఫెసర్ పద్మజా షా.ఉన్నత వర్గాల మహిళలు,ఉద్యోగినులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టికెట్ కొనుక్కుంటే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.మహాలక్ష్మి పథకం ద్వారా మహిళల సాధికారత సాధ్యపడుతుందని గతంలో రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుండగా..నెలకు మహిళలకు రూ.2500 సాయం గురించి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టతా లేదు.

రైతు భరోసా.. హామీ:

ఏటా రైతులు,కౌలు రైతులకు రూ.15,000 ఆర్థిక సాయం,వ్యవసాయ కూలీలకు రూ.12,000, వరికి రూ.500 బోనస్. ఏం జరిగిందంటే:

రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం రైతుబంధు పేరును రైతు భరోసాగా మార్చి ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది.మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఏటా రైతులు,కౌలు రైతులకు ఇస్తామన్న రూ.15,000 ఆర్థిక సాయం ఇంకా మొదలు కాలేదు.వ్యవసాయ కూలీలకు రూ.12,000 హామీ ఇంకా అమల్లోకి రాలేదు.''రైతు భరోసా పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం వేశాం.విధివిధానాలు ఖరారు కాగానే వచ్చే సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తాం'' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.అయితే, మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా రూ.15 వేలకు పెంచి ఇస్తారా లేదా అనే దానిపై సీఎం స్పష్టత ఇవ్వలేదు.వరికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన హామీని ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది.ఇప్పటివరకు 31లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు.

గృహజ్యోతి హామీ:

200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఏం జరిగిందంటే:

డిస్కంల లెక్కల ప్రకారం తెలంగాణలో 1.08 కోట్ల మంది వినియోగదారులు 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుతున్నారు.కానీ 50 లక్షల మంది వినియోగదారులకే పథకం వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.''మేనిఫెస్టోలో అందరికీ ఆరు గ్యారంటీలు అని చెప్పి,తర్వాత అధికారంలోకి వచ్చాక దరఖాస్తులు తీసుకున్నప్పుడు మాత్రం ఆదాయ పరంగా లెక్కలు చూసి అమలు చేస్తోంది ప్రభుత్వం. అందుకే 200 యూనిట్లలోపు వాడుతున్నప్పటికీ కరెంటు బిల్లులు వస్తున్నాయి'' అని జేఎన్టీయూ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ ఒకరు చెప్పారు.

 ఇందిరమ్మ ఇళ్లు హామీ:

ళ్లు లేని పేదలకు ఇళ్ల పట్టాలు.

ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం. ఏం జరిగిందంటే: అధికారంలోకి వచ్చిన ఏడాదికి..అంటే 2024 డిసెంబరు 5 నుంచి పథకాన్ని అమల్లోకి తీసుకు వస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం.ఇందుకు ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. ''ప్ర‌తి శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలో తొలి ఏడాదిలో 4.50 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తాం.ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు నిర్మిస్తాం.అందుకు తగ్గట్టుగా కొన్ని డిజైన్లు విడుదల చేస్తున్నాం.ఈ డిజైన్ ప్రకారమే ఇల్లు కట్టుకోవాలని లేదు. లబ్ధిదారులు తమకు నచ్చినట్లుగా నిర్మించుకోవచ్చు'' అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తామని చెప్పిన 250 చ.గజాల ఇళ్ల స్థలం పంపిణీ కార్యక్రమం ఇంకా మొదలు కాలేదు.

యువ వికాసం హామీ:

ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కింద రూ.5 లక్షల విలువైన కార్డు. ప్రతి మండలంలో అంతర్జాతీయ స్కూల్స్. ఏం జరిగిందంటే: ఈ రెండు హామీలనూ అమలు చేయలేదు.తొలి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అయితే,గత ఏడాది కాలంలో 55,143 ఉద్యోగాలు భర్తీ చేసినట్లుగా చెబుతోంది ప్రభుత్వం.ఈ మేరకు ప్రభుత్వం డిసెంబరు 4న తెలుగు దినపత్రికలు కొన్నింటికి ఇచ్చిన ప్రకటనల్లో శాఖల వారీగా భర్తీ చేసిన వివరాలు ప్రకటించింది.యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.డిసెంబరు 5 నాటికి ఈ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం మేరకు రెండు కంపెనీలకు సంబంధించి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.ఈ యూనివర్సిటీకి అదానీ నుంచి రూ.100 కోట్ల విరాళం తీసుకోవడం జాతీయ స్థాయిలో వివాదాన్ని రేపింది.అమెరికాలో అదానీపై కేసు నమోదుపై వివాదం రేగడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అదానీ ఇస్తానని ప్రకటించిన రూ.100 కోట్లు తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.ఈ ఏడాది కాలంలో విద్యార్థులు,నిరుద్యోగుల అంచనాలు అందుకోవడంలో ప్రభుత్వం వెనుకబడిందని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు.''విద్యా రంగానికి గత ప్రభుత్వ హయాంలో దక్కినట్లే.. ఏడు శాతం నిధులే దక్కాయి. ఇప్పటికే ఉన్న యూనివర్సిటీలను అభివృద్ధి చేయకుండా,కొత్తగా స్కిల్స్ యూనివర్సిటీ తీసుకురావడం వల్ల ఉపయోగం ఏం ఉంటుంది?గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను లెక్కపెట్టుకుని ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చినట్లుగా ప్రభుత్వం చెబుతోంది'' అని చెప్పారు నాగేశ్వరరావు.విద్యాశాఖ మంత్రి లేకపోవడమూ విద్యా రంగానికి ఇబ్బందికరంగా మారిందని ఆయనన్నారు.అయితే,ఉద్యోగాల కల్పన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పరిష్కారం లభించిందని ఎమ్మెల్సీ కోదండరాం చెప్పారు.''కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభించింది.జాబ్ క్యాలెండర్ ప్రకటించి కొత్తగా ఏయే ఉద్యోగాలు భర్తీ చేస్తారనేది చెప్పారు.ఐటీఐలను అభివృద్ధి చేశారు'' అని ఆయన అన్నారుమున్ముందు ప్రైవేటు కంపెనీల్లో స్థానిక యువతకు రిజర్వేషన్ కల్పించడంతో పాటు చిన్న,సూక్ష్మ,వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కోదండరాం చెప్పారు.

చేయూత హామీ:

నెలకు వృద్ధులకు రూ.4 వేల పింఛను, వికలాంగులకు రూ.6 వేల పింఛను, రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా రూ.10లక్షలకు పెంపు. ఏం జరిగిందంటే: రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పరిమితి రూ.10 లక్షలకు పెంపును 2023 డిసెంబరు 9న అమల్లోకి తీసుకువచ్చింది ప్రభుత్వం.మరోవైపు పింఛన్ల పెంపు విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు.మూసీ సుందరీకరణ ప్రాజెక్టు మూసీ ప్రాజెక్టు.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని చేపడుతున్న ప్రాజెక్టు ఇది. ఇక్కడ ప్రభుత్వం అనే కంటే కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారనేది కాంగ్రెస్ నాయకులు చెబుతున్నమాట.దీని అంచనా వ్యయం ఎంతనే దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు.ఇదింకా డీపీఆర్ స్టేజీలోనే ఉంది. ఇందుకు రూ.140 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వం రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తోందని విమర్శలు చేస్తున్నాయి.మూసీ పరివాహకంలోని కొత్తపేట,చైతన్యపురి,అత్తాపూర్,కిషన్ బాగ్ ప్రాంతాల్లో ప్రజల నుంచి దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.ప్రత్యామ్నాయం చూపించి ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లాలని తెలంగాణ హైకోర్టు సూచించింది.మూసీ ప్రాజెక్టును చేపట్టకూడదని ఎవరూ చెప్పడం లేదు కానీ ప్రాధాన్యతలు ఏమిటన్నది కూడా గుర్తించాల్సి ఉంటుందని అన్నారు.''ప్రస్తుతం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చూస్తున్నారు.రైతు భరోసా,పింఛన్లు వంటివి పెండింగులో పెట్టి మూసీ వంటి ప్రాజెక్టులు చేపడతామని చెప్పడం సరికాదనిపిస్తోంది.ప్రజల్లో అసంతృప్తి ఉంది కానీ ప్రతిపక్షాలకు బలం చేకూర్చేలా అది రాలేదు.ఇప్పటివరకు చేస్తున్న పనులను చెప్పుకోవడంలోనూ ప్రభుత్వపరంగా ఎక్కడో లోపం కనిపిస్తోంది'' అని కె.శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.ఎన్నికల సమయంలో ఉన్న ప్రాధాన్యాలు ప్రస్తుతం కనిపించడం లేదని ప్రొఫెసర్ పద్మజా షా అంటున్నారు.''వైద్య, ఉద్యోగాల కల్పన పరంగా ప్రభుత్వ చర్యలు ఫర్వాలేదు.విద్యా రంగంలో రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకువస్తున్నట్లు చెబుతున్నారు గానీ మిగిలిన పాఠశాలలకు అవసరమైన నిధులు కేటాయించాల్సి ఉంది కదా.అందుకే క్షేత్రస్థాయిలో పాఠశాలల్లో మార్పు కనిపించడం లేదు'' అని ఆమె చెప్పారు.ప్రభుత్వం సరైన దిశలో ప్రయాణం చేస్తోందని,కానీ ఏడాదిలోనే అన్ని పనులూ పూర్తవుతాయని భావించకూడదని ఎమ్మెల్సీ కోదండరాం చెప్పారు.''మునుపటి మాదిరిగా వేధింపులు లేవు. మంత్రులు,అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.వ్యవస్థలలో ప్రభుత్వపరంగా మితిమీరిన జోక్యం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తున్నాయి.

హాట్ న్యూస్ ని చదవండి:- గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని గోవాకు.. అడవిలో ల్యాండ్ అయిన కుటుంబం - https://studiobharat.com/A-family-landed-in-Goa-jungle-relying-on-Google-Maps

ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో కొన్ని పనులు అనుకున్న స్థాయిలో కావడం లేదు'' అని కోదండరాం అన్నారు.రైతు రుణమాఫీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఐదో హామీ ఇది.2022 మే 7న వరంగల్‌లో జరిగిన రైతు డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ హామీని ప్రకటించింది.రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేస్తామనేది సారాంశం.రూ.3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని ప్రకటించినా.. ఇంకా ఆచరణలోకి రాలేదని రైతు సంఘం నేతలు చెబుతున్నారు.రుణమాఫీ విషయానికి వస్తే.. 2024 డిసెంబరు 2 నాటికి 25,35,964 మంది రైతులకు రుణాలు మాఫీ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ''మొత్తం నాలుగు విడతల్లో రూ.20,616 కోట్లు మాఫీ చేశాం. రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ అయ్యాయి.రూ.2 లక్షలకు పైబడి రుణం ఉంటే..ఆ ఎక్కువ ఉన్న మొత్తం కడితే మిగిలినది మేం మాఫీ చేస్తున్నాం'' అని సీఎం అన్నారు.రుణమాఫీ కాలేదని చాలామంది రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని రైతు సంఘం నేతలు ఆరోపిస్తున్నారు.''పంట రుణాలు అనేవి కేవలం రైతులే కాకుండా సాగులో లేనివారు తీసుకున్నారు.అలాంటి వారికి మాఫీ వద్దని మేం అడిగాం. రుణమాఫీ పేరు చెప్పి వ్యవసాయపరంగా మిగిలిన పథకాలకు నిధులు విడుదల చేయడం లేదు.రైతు భరోసా ఇవ్వలేదు.రైతు బీమా అవ్వలేదు.యాంత్రీకరణకు రాయితీలు ఇవ్వలేదు.వ్యవసాయ కూలీలు,భూమి లేని పేదలను బీమా పథకంలోకి తీసుకురాలేదు'' అని రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్ కన్నెగంటి రవి చెప్పారు.రైతు భరోసా కూడా ఎవరి సాగులో ఉంటే వారికే అందించేలా చూడాలని ఆయన సూచించారు.ప్రజావాణి నిర్వహణ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజున తెలంగాణలో జరిగిన మరో ముఖ్యమైన ఘట్టం..ప్రగతి భవన్ ముందు కంచె తొలగింపు.గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రగతి భవన్ ముందు కంచె ఉండేది.రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజునే దాన్ని తొలగించారు.మరుసటి రోజు,అంటే 2023 డిసెంబరు 8 నుంచి ప్రజాదర్బార్ నిర్వహించారు.ప్రగతి భవన్ పేరు మహాత్మా జ్యోతిరావు ఫూలే భవన్‌ గా మార్చి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటాయించింది ప్రభుత్వం.ప్రస్తుతం అక్కడ వారానికి రెండు రోజులు ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తోంది ప్రభుత్వం.ప్రతిరోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తామని మేనిఫెస్టోలో చెప్పినప్పటికీ, వారానికి రెండు రోజులు మాత్రమే నిర్వహిస్తోంది.

మేనిఫెస్టోలో చెప్పి అమలు చేయని హామీలలో కొన్ని..

తెలంగాణ తొలి,మలిదశ ఉద్యమ అమరవీరుల తల్లి లేదా తండ్రి లేదా భార్యకు రూ.25 వేలు నెరవారీ గౌరవ పింఛను, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసి, 250 గజాల ఇళ్ల స్థలాల కేటాయింపు. ప్రతి విద్యార్థి, విద్యార్థినికి ఉచిత వై-ఫై సౌకర్యం.విద్యా రంగానికి బడ్జెట్‌లో ప్రస్తుత వాటా 6 శాతం నుంచి 15 శాతానికి పెంపు. మూతపడిన దాదాపు 6 వేల పాఠశాలలను తిరిగి మెరుగైన సదుపాయాలతో ప్రారంభించడం.బాసర ట్రిపుల్ ఐటీ తరహాలో మరో నాలుగు ట్రిపుల్ ఐటీల ఏర్పాటు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ విధానం అమలు. ప్రభుత్వ ఉద్యోగులు,ఆర్టీసీ సిబ్బందికి కొత్త పీఆర్సీ ప్రకటించి ఆరు నెలల్లోపు సిఫార్సుల అమలు. ప్రతి ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి రూ.12వేల ఆర్థిక సాయం.ఎస్సీ వర్గీకరణ అనంతరం మాదిగ, మాల, ఇతర ఎస్సీ ఉపకులాలకు కొత్తగా మూడు ఎస్సీ కార్పొరేషన్ల ఏర్పాటు.18 సంవత్సరాలు పైబడి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉచితంగా అందజేత.గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు. మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా.ప్రతి జిల్లాకు రెసిడెన్షియల్ స్పొర్ట్స్ స్కూల్ ఏర్పాటు.నిరుపేద హిందూ,మైనార్టీ ఆడపడుచులకు వివాహ సమయంలో ఇచ్చే రూ.లక్షతోపాటు ఇందిరమ్మ కానుకగా 10 గ్రాముల బంగారం అందజేత.బీడీ కార్మికులకు జీవిత బీమా,ఈఎస్ఐ అమలు. అంగన్వాడీ టీచర్లకు నెలసరి వేతనం రూ.18 వేలకు పెంచుతూ ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకువచ్చి ఉద్యోగ భద్రత కల్పించడం. హామీల అమలుపై భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. ''ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. తొలి ఏడాది పాత బాకీల కిస్తీలకే రూ.64 వేల కోట్లు వెచ్చించాల్సి వచ్చింది.అయినప్పటికీ మేం ఇచ్చిన హామీల్లో చాలావరకు అమలు చేస్తూనే ఉన్నాం'' అని చెప్పారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow