పౌరుషాల పురిటిగడ్డలో… వీరుల ఆరాధనోత్సవాలు

స్టూడియో భారత్ ప్రతినిధి

Dec 2, 2024 - 05:56
 0  26
పౌరుషాల పురిటిగడ్డలో… వీరుల ఆరాధనోత్సవాలు

పౌరుషాల పురిటిగడ్డలో… వీరుల ఆరాధనోత్సవాలు

  • దక్షిణ కాశీగా వెలుగొందిన కారంపూడి 
  • 800 ఏళ్ళు గా వేడుకలు 
  • నేటి నుంచి 5రోజు ల పాటు ఉత్సవాలు 
  • తొలిరోజు రాచగావు

 ప్రత్యేక కథనం :-

పరమ పవిత్రమైన కాశీ పట్టణంలో వెలసిన విశ్వనాధుడు దివ్యలింగముల రూపంలో బ్రహ్మనాయుడు ఈశ్వరుడుగా , అంకమ్మశక్తి అన్నపూర్ణగా, పోతురాజు కాల భైరవుడుగా, గంగాధర మడుగు మణికర్ణికగా, నాగులేరు పవిత్ర దర్శనమిస్తుండగా శ్రీ చెన్నకేశవస్వామి భక్తుల పాలిట వరదాభయ మూర్తిపై శ్రీదేవి, భూదేవిలతో అలరారుతుండగా, కారంపూడి పట్టణం నిజంగా పల్నాటి వాసులకు కాశీతో సమానమైంది. ఉత్తరముగా ప్రవహిస్తున్న జీవనది నాగులేరు వీరాలయక్షేత్ర మహనీయ తత్వమును ద్విగుణీకృతం చేసింది. అందుకే కాబోలుకవి సార్వభౌముడు శ్రీనాధుడు కారంపూడిని ‘దక్షిణకాశీ’గా అభివర్ణించాడు.

పౌరుషానికి ప్రతీక గా పల్నాడు…

పౌరుషానికి ప్రతీక గా పల్నాడు ను పేర్కొంటారు. పల్నాటి రణక్షేత్రంలో అసువులు బాసిన వీర సైనికులను స్మరించుకొనుటయే వీరారాధన ఉత్సవాల ప్రత్యేకత. వీరత్వంతో యుద్ధభూమిలో అమరులైన వీర సైనికుల స్మృతియార్ధం ఈ వేడుకలు గత 800 ఏళ్ళ నుంచి వీరాచార పీఠం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. వీరాచార పీఠాధిపతి తరుణ్ చెన్నకేశయ్యవార్, వీరాచారపీఠం నిర్వాహకులు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 14 జిల్లాలకు చెందిన వీరాచారవంతులు తమ వీరుల కొణతములతో వీరాచార పీఠం నిధి పైకి తరలివస్తారని నిర్వాహకులు పేర్కొన్నారు.

చాపకూడు సిద్ధాంత కర్త పల్నాటి బ్రహ్మనాయుడు

చాపకూడు సిద్ధాంత కర్త పల్నాటి బ్రహ్మనాయుడని పేర్కొంటారు.దళితులకు ఆలయ ప్రవేశాన్ని కల్పించి సర్వసమానత్వ భావనతో చాపకూడు సిద్ధాంతాన్ని అమలుచేసిన తొలి సాంఘీక సంస్కర్త బ్రహ్మనాయుడే.దళితుడైనా మాల కన్నమదాసు ను మానవపుత్రినిగా స్వీకరించి పల్నాటి రాజ్యానికి సర్వసైనాధ్యక్షుడి గా నియమించటం ద్వారా ఆనాడే గొప్ప సాంఘిక విప్లవాత్మక సంస్కరణలకు బ్రహ్మన్న పూనుకున్నారు. ప్రపంచంలో వీరారాధన మహోత్సవాలు ఇటలీ దేశం లోని రోమ్ నగరంలో జరుగుతాయని పేర్కొంటున్నారు.ఇక భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలోని కారంపూడి పట్టణంలో మాత్రమే వీరులను ఆరాధిస్తూ ఉత్సవాలను గత 800 సంవత్సరాల నుంచి నిర్వహిస్తుంటారు.పల్నాటి సీమలో యుద్ధపటిమగల నేటి వీరుడిగా పేరుగాంచిన ఆలరాజు,బాలచంద్రుడు,నారీలోకం గర్వించదగ్గ వీరవనితలు నాయకురాలు నాగమ్మ, మగువ మాంచాల, రతనాల పేరెందేవి లతో పాటు మరెందరో వీరులు వీరనారీమణులు ఖ్యాతి గడించిన వారే.

పల్నాటి యుద్ధానికి దారితీసిన పరిస్థితులు :

ఆనాటి సమాజంలో వైష్ణవులకు, శైవులకు మధ్యజరిగిన పోరాటమే పల్నాటి యుద్ధమని కథనం.బ్రహ్మనాయుడు వైష్ణవ మతమునకు ప్రతీక కాగ, నాయకురాలు నాగమ్మ శైవ మతానికి ప్రాతినిథ్యం వహించారని ప్రతీతి.

మహభారతంతో పోలిన యుద్ధం…పల్నాటి యుద్ధంలో ఒక అద్భుతమైన విశ్లేషణ చరిత్ర సాహితీ ప్రపంచంలో ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. మహాభారత కధతో పోలిన ఘట్టాలు పల్నాటి యుద్ధంలో కనిపిస్తాయి. దాయాదుల కలహం ఇరువైపులా పాచికలు, కోడిపందాలు, గోగ్రహణం,మందపోరు, శ్రీ కృష్ణరాయభారం -అలరాజు రాయభారం, అభిమన్యుని వీరోచిత పోరాటం బాలచంద్రుని స్వైరవివారం,ఇటు కృష్ణుడు- అటు బ్రహ్మనాయుడు ,ఇటు కర్ణుడు – అటు నాగమ్మ, మలి దేవరాజు, ఇటు దుర్యోధునుడు-అటు నలగామ రాజు సంఘటనల పోలికతో పల్నాటి వీర చరిత్రను మినీ భారతంగా చరిత్రకారులు కొనియాడారు.

పల్నాడుకు ఆ పేరు ఇలా వచ్చింది…

పల్నాడు ను అనేక పేర్లతో వ్యవహరించే ఈ ప్రదేశం పూర్వకాలం నుండే ప్రసిద్ధమైంది. రామాయణ కాలంలోని దండకారణ్యం లోని దే.. ఈ పల్నాటి ప్రాంతం. కరుడు ఏలినది కార్యమపూడి అని, దూషనుడు ఏలినది దుర్గి అని, మారీచుడు ఏలినది మాచర్ల అని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో పాలరాయి ఎక్కువగా దొరుకుటచే పల్నాడు అని, అనేక గ్రామాలు ఉండటంవల్ల పలునాడు అని, పల్లవులు పాలించుట చేత పల్లవునాడు అని పేరు వచ్చి ఉండవచ్చని చారిత్రక కథనం.పల్నాటి ప్రాంతంలో బౌద్ధ మతం పరిఢవిల్లిన ప్రదేశాలు మనకు అనేకం నేటికీ సజీవ చిహ్నాలుగా కనిపిస్తున్నాయి. బుద్ధుడు నిర్యాణం అనంతరం ఆయన అవశేషాలు అనేక ప్రదేశాలలో నిక్షిప్తం చేసి స్థూపాలు, చైతన్యాలు నిర్మించినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. అదే కోవలో బుద్ధుని దంతం ఒకటి తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో నాటారా అని ఐతిహ్యము, దంతమును పల్లు అని వ్యవహరిస్తారు. పల్లు నాటిన ప్రదేశం కనుక పల్లునాట అని, అదే కాలక్రమంగా పలునాడు అని అదే రూపాంతరం చెంది పల్నాడుగా మారిందని ఓ కథనం. పల్నాటి ప్రాంతంలో జైనులు కూడా విస్తరించి ఉన్నారన్నటానికి మనకు అక్కడక్కడ ఆనవాళ్లు కనిపిస్తాయి. పల్నాటి ప్రాంతంలో ఓటి గళ్ళు, ఓటు గళ్ళు ప్రమాణాలు, జైనులు విగ్రహారాధనకు వ్యతిరేకులు అందువల్ల వీరు నిర్మించిన దేవాలయాల్లో ఏ విగ్రహాలు ప్రతిష్టించారు. ఏ విగ్రహాలు లేని గుళ్ళు కావడం వల్ల వీటిని ఓటిగుళ్ళు అని పిలిచేవారు. అప్పటిలో జైన్లు సామూహికంగా నివసించే ప్రాంతాలను పల్లి అని పిలిచేవారు. పలు పల్లీలు ఉన్న ప్రదేశం కావటం చేత పల్లినాడు అని, అది కాలక్రమంగా పలినాడు అని మార్పు చెందుతూ వ్యవహారికంగా పల్నాడు గా రూపాంతరం చెందిందని చారిత్రక అభిప్రాయం. 

నేటి నుంచి ఐదు రోజులపాటు వీరారాధనఉత్సవాలు :

కార్తిక అమావాస్య నుంచి 5 రోజు ల పాటు వీరారాధన ఉత్సవాలు జరుగుతాయని వీరాచార పీఠాధిపతి తరుణ్ చెన్నకేశయ్యవార్, వీరాచారపీఠం నిర్వాహకులు విజయ్ కుమార్ లు తెలిపారు. నవంబర్ 30న రాచగావు,డిశంబర్ 1న రాయబారం,2 న మందపోరు (చాప కూడు కార్యక్రమం),3న కోడిపోరు (ప్రధాన ఘట్టం),4న కల్లిపాడు తో వీరుల ఆరాధన ఉత్సవాలు ముగుస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow