మద్యపాన నిషేధం సాధ్యం కానట్లేనా ?

స్టూడియో భారత్ స్పెషల్ స్టోరీస్

Oct 19, 2024 - 21:21
 0  89
మద్యపాన నిషేధం సాధ్యం కానట్లేనా ?

మద్యపాన నిషేధం సాధ్యం కానట్లేనా ?

మద్యపానాని నిషేదిస్తూ 1994 ముఖ్యమంత్రి నందమూరి.తారక రామారావు తొలిసంతకం - అప్పట్లోనే నిషేదాన్ని ఎత్తివేసిన ఆనాటి సి.ఎం చంద్రబాబు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి రామారావు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యపాన నిషేధం విధించాడు. దీనికి ముందు రాష్ట్రంలో 1991 సంవత్సరములో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కలిగిరి మండలం లోని దూబగుంటకు చెందిన రోశమ్మ మద్యపాన నిషేధ ఉద్యమాన్ని ప్రారంభించింది.ఈ గ్రామంతో మొదలైన మద్యపాన నిషేధ ఉద్యమం,రాష్ట్రమంతా విస్తరించి,దీనికి అప్పటి వామపక్షాలతో పాటు ప్రతిపక్ష రాజకీయ పార్టీ తెలుగుదేశం ఈ ఉద్యమానికి మద్దతు నిచ్చింది.1994లో ఎన్.టి.రామారావు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యపాన నిషేధం విధించారు.వేలాదిమంది ప్రజలు, పార్టీకార్యకర్తలు, అభిమానుల సమక్షంలో లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం అనంతరం ఈ సంపూర్ణ మద్యనిషేధం ప్రకటిస్తూ ఫైలుపై తొలిసంతకం చేసారు. ఈ ఉద్యమానికి గుర్తుగా ఆమె ఇంటి పేరు దూబగుంట రోశమ్మగా పేరుగాంచింది. మధ్యపాన నిషేధ చరిత్రలో మిగిలిపోయిన దూబగుంట రోశమ్మ ఆగస్టు 2016 సంవత్సరంలో మరణించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1992 వ సంవత్సరంలో, దాదాపుగా, అన్ని మధ్యం రకాల అమ్మకం, కొనుగోళ్ళు నేరంగా పరిగణించాలని, సారాకి వ్యతిరేకంగా స్త్రీలు చేపట్టిన ఉద్యమం ద్వారా సారా నిషేధం వచ్చింది. అంతకు ముందు రాష్ట్రంలో ఉన్న వారుణి వాహిని విధానానికి ప్రభుత్వ సహకారం ఉండడంతో, గ్రామీణ ప్రాంతాలలో కల్లును, సారా విరివిగా అమ్మేవారు. దీని ఫలితంగా ఎక్సైజ్ సుంకంగా 1991-92 సంవత్సరపు రాష్ట్ర వార్షిక బడ్జెట్లో 10 శాతం కన్నా ఎక్కువ మొత్తం సారా మూలకంగా ఆదాయం వచ్చింది.ప్రభుత్వం చేసిన నిషేధం ప్రశ్నించబడుతున్నా,మహిళా ఉద్యమ ప్రభావం రాజకీయాలపై కనబడింది.ఈ పోరాటం మహిళల వ్యక్తిగత బృందాలతో ప్రారంభమై తమ గ్రామాలలో సారా లేకుండా చూశారు.ముఖ్య కారణం సారా వల్ల వారి జీవితాలు నాశనమైన స్వీయానుభవంతోను, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో స్వచ్ఛంద సంస్థలచే నడపబడిన అక్షరాస్యతా ఉద్యమంలో ప్రాధమిక అభ్యాసకులకు ఇచ్చిన కథల పుస్తకంలో ఆడవాళ్లు ఏ విధంగా సారాకి బానిసలైన భర్తల చేతుల్లో బాధలు పడ్తున్నారో చెప్పడం, దీనితో మహిళలు చైతన్యవంతులై సారా ఉద్యమంలో పాల్గొన్నారు. మహిళలు తాము సంపాదిస్తున్న కూలీ డబ్బులను వారి భర్తలు తాగడానికి తీసేసుకోవడమే కాకుండ, తాగొచ్చి హింసించడంతో తీవ్రంగా విసిగిపోయారు. సారాని వినియోగించేవారి మీదకన్నా సారాని సరఫరా చేసేవారి పైన,సారా విక్రయము చేసే వారిపై ఆ మహిళలు దృష్టి పెట్టడం వలన చాలామంది క్రియారహితంగా మద్దతు ఇచ్చారు.ఆ మహిళల కార్యక్రమాలన్నీ కూడ వారి వారి గ్రామాల వరకే పరిమితమవడం తో, స్వచ్ఛంద సంస్థల సహాయ సహాకారాలు లభించాయి. వారి పోరాటాన్ని స్థానిక మహిళలే స్వయంగా నడిపేవారు.

ఈ పోరాటం పేద, గ్రామీణ స్త్రీల నుండి మధ్యతరగతి, పట్టణ స్త్రీలు, గాంధీజీ సిద్ధాంతాలను, ఆదర్శాలను అనుసరించే పురుషులు కూడ సంపూర్ణ మద్యనిషేధానికి మద్దతు తెలిపారు. ఏది ఏమైనప్పటికినీ రాజకీయ శక్తి పునాదులను వణికించేలాగా స్త్రీలంతా రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్యపాన నిషేధానికి తమ గ్రామాల నుండి పోరాటాలను చేసారు.

నిషేధం ఎత్తివేత 

1994 లో ఎన్. టి. రామారావు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజే మద్య నిషేధాన్ని జూన్ 1-1995 నుంచి సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే, అమల్లోకి వచ్చే సరికి విఫలమయ్యారు.పక్క నుంచి మద్యం ఏరులైపారింది.రాష్ట్రంలోకి మద్యం రాకుండా ఆపడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు మద్యపాన నిషేదాన్ని ఎత్తివేశారు.

ఆశయం ఒక్కటే సరిపోదు

ఒక చట్టం అమలు కావాలంటే మహోన్నత ఆశయం ఉండటం మాత్రమే చాలదని అనుభవం పాఠం చెబుతోంది. మద్యపాన నిషేధం రాజకీయ పలుకుబడి, మద్దతు లేని పేదల మీద ప్రతాపం చూపుతుంది. పోలీసు యంత్రాంగం బలం పెరిగిపోతుంది. పట్టణాల్లో డబ్బు, పలుకుబడి ఉన్నోళ్లకు మద్యం నేరుగా డోర్ డెలివరీ అవుతుంది. ఇలాంటి వైభోగం సాధ్యం కాని పేదలు అక్రమ మార్గాల్లో తాగుడును అలవాటు చేసుకుని కేసుల్లో ఇరుక్కుంటారు. అంతవరకు చట్టాన్ని గౌరవిస్తూ వచ్చిన వాళ్లు, నిషేధ కాలంలో రెండు గుక్కెల కోసం చట్టాన్ని ఉల్లంఘించాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ 1995- 1997 మధ్య నిషేధం అమల్లో ఉంది. అది ఎప్పుడూ పూర్తిగా అమలు కాలేదు. నిషేధ సమయంలో బీర్ తప్ప అన్ని రకాల మందు పుష్కలంగా దొరికింది. బీరు అలవాటున్నవాళ్లు బీర్ నుంచి ఇతర హార్డ్ లిక్కర్స్కు మారారు. స్మగ్లింగ్ జోరుగా సాగింది. స్మగ్లర్లు వేల కోట్లు వెనకేసుకున్నారు. చాలామంది ప్రభుత్వ అధికారులు కూడా బాగా సంపాదించారు. పేదలు, గ్రామీణులు, పట్టణాల్లోని బస్తీ ప్రజలు నాసిరకాలైన మద్యానికి అలవాటుపడ్డారు. కల్తీ మద్యం తాగి, మృత్యవాత పడ్డారు.

జాతీయోద్యమంలో భాగం

నిజానికి భారతదేశంలో మద్యాన్ని నిషేధించాలన్న డిమాండ్ స్వాతంత్య్రపోరాట కాలంలోనే మొదలైంది. బ్రిటీష్ వాళ్లు అబ్కారీ చట్టం తీసుకువచ్చి, అన్ని రకాల మద్యం వ్యాపారాలను తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. 1888-1920 మధ్య కాలంలో బ్రిటీష్ ప్రభుత్వం కల్లు, సారా వ్యాపారంతో పాటు విదేశీ మద్యం అమ్మకాలను తమ నియంత్రణలో ఉంచుకుని, దీనిని ప్రోత్సహించింది. దుకాణాల లైసెన్స్ల మీద రాబడి బాగా ఉండటంతో మద్యం ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఇదే కాలంలోనూ మద్యపాన నిగ్రహ ఉద్యమం కూడా మొదలయింది. ఈ కాలంలోనే ఒక వైపు విదేశీ మద్యం వ్యాప్తి పెరగడం, మరొకవైపు, జాతీయోధ్యమం బలపడటం విశేషం. జాతీయోద్యమ నాయకులు. విదేశీ మద్యం వ్యాప్తిని భారత వ్యతిరేక మహమ్మారిగా ప్రచారం చేశారు. భారతీయత మీద దాడి అని అన్నారు. విదేశీ పాలన, అనైతికత, భారత వ్యతిరేకతకు మద్యం మారు రూపంగా ప్రచారం చేశారు. మహత్మాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ మద్యాన్ని నిషేధించాలని ప్రచారం మొదలు పెట్టింది, 'దొంగతనం, వ్యభిచారం కంటే మద్యపానం అత్యంత నీచమైంది', 'ఒక గంటసేపు నేను భారతదేశ నియంత అయితే, ఎలాంటి పరిహారం ఇవ్వకుండా దేశంలోని అన్ని మద్యం దుకాణాలను మూసివేస్తాను' అని గాంధీ వ్యాఖ్యానించారంటే.. ఆయన మద్యాన్ని గాంధీ ఎంతగా వ్యతిరేకించారో అర్థం చేసుకోవచ్చు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow