పంచారామ క్షేత్రాలలో ఒకటైన అమరావతి

అమరావతి స్టూడియో భారత్ ప్రతినిధి

Dec 13, 2023 - 17:24
 0  46
పంచారామ క్షేత్రాలలో ఒకటైన అమరావతి

పంచారామ క్షేత్రాలలో ఒకటైన అమరావతి

శ్రీ అమరేశ్వర స్వామి వారి ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం..!! 

గుంటూరుకు వాయువ్యం దిశగా, సుమారు 32 Kms. దూరాన, పావన కృష్ణానదికి దక్షిణ తీరములో అమరావతి క్షేత్రం కలదు. ఇది కృతయుగంలోనే ఆవిర్భవించిన విశిష్టమైన పుణ్యక్షేత్రం. పురాణాల్లో క్రౌంచతీర్థంగా పేర్కొనబడింది. త్రిపురాసుర సంహార సమయంలో కుమారస్వామి చేత చేధించబడిన ఆత్మ లింగం యొక్క ఒక భాగం పడిందని, ఆ శివలింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించి, అమరేశ్వరుడనే నామకరణం చేసి పూజించినట్టు స్ధల పురాణం చెప్పుతుంది.

బృహస్పతి (దేవతల గురువు) ఆదేశం మేరకు కృతయుగంలో శివలింగం చుట్టూ పరివార దేవతలను ప్రతిష్ఠించారు. క్రౌంచతీర్థం అమరులకు నివాస ప్రాంతం అయింది. ఆ కారణంగా ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరు వచ్చిందని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. 

అమరావతికి పశ్చిమ దిశగా,సుమారు రెండు కీ.మీ దూరములో ధరణికోట ఉంది. పూర్వం ధాన్యకటకం అని పిలిచివారు. ఇది ఒకప్పుడు ఆంధ్ర శాతవాహనుల రాజధాని.శాతవాహనులలో ప్రసిద్ధుడైన గౌతమీపుత్ర శాతకర్ణి పాలనలో ధాన్యకటకం ఉచ్చ స్ధితి చేరింది.శాతవాహనుల వైదిక మతం మరియు రాణులు బౌద్ధ మతాన్ని ఆచారించేవారు.శాతవాహనులకు పూర్వం నుంచి అమరావతిలో బౌద్ధ మతం విస్తరించి ఉంది.బౌద్ధ విహారాలు,బౌద్ధ స్తూపములు నిర్మించారు.

బౌద్ధులు విశ్వవిద్యాలయము స్థాపించారని రాయప్రోలు సుబ్బారావు తన రచనలో అన్నారు. కొంత కాలము తర్వాత బౌద్ధం క్షీణించింది. హిందువులు బౌద్ధ స్తూప స్ధానములో శ్రీ అమరేశ్వరాయం ఏర్పాట్టు చేసారు.చాణక్య భీముడు పునః నిర్మాణం చేసాడు.1775 సంవత్సరంలో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతి మరియు శ్రీ అమరేశ్వరాయం ను అభివృద్ధి పర్చినాడు.శ్రీ కృష్ణ దేవరాయులు మొదలగు రాజ పోషకులు అనేక కానుకులు సమర్పించారు.1980లో జరిగిన పుష్కరాల సమయంలో అమరావతిలో పెద్ద ఎత్తున పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టబడ్డాయి.గాలి గోపురం,కృష్ణా నదీ ఘాట్ మొదలగు అభివృద్ధి పనులు జరిగాయి.

విశాలమైన ప్రాంగణములో దేవాలయం ఉంటుంది. అమరావతి దేవాలయం ద్రావిడ నిర్మాణ శైలిని పోలి ఉంది.దేవాలయం నకు నాలుగు వైపుల గోపురాలున్నాయి.ఆలయ ప్రవేశం తూర్పు గోపురం నుంచి జరుగుతుంది.తూర్పు గోపురం నకు కొంత దూరాన కృష్ణా నదీ తీరం,స్నాన ఘాట్టాలు కలవు. భక్తులు ముందుగా పవిత్ర స్నానములు ముగించి,ఆలయ ప్రవేశం చేస్తారు.దేవాలయం మూడు ప్రకారములు కలిగియున్నది.ప్రధానాలయం రెండు అంతస్ధులుగా ఉంటుంది.దేవాలయం మొదటి ప్రాకారము నందు మహిషాసుర మర్దిని,వీరభద్రస్వామి,ఓంకారేశ్వర స్వామి,గురు దత్తరేయ, అగస్తేశ్వర స్వామి,ప్రణవేశ్వరుడు,జ్వాలాముఖీ దేవి మొదలగు కలరు.

రెండవ ప్రాకారము నందు వినాయక,కాలభైరవ, ఆంజనేయ,నాగేంద్రస్వామి,కుమారస్వామి ఆలయాలు,యాగశాల,నవగ్రహ మండపం,శ్రీకృష్ణదేవరాయలు మండపం మొదలగు ఉంటాయి.మూవ ప్రాకారము నందు కాశీ విశ్వనాథ,మల్లికార్జున,పుష్పాంతేశ్వర స్వామి మరియు కాళహస్తీశ్వర ఆలయాలు ఉంటాయి.మూడు వృత్తాల నడిబొడ్డున అమరలింగేశ్వర స్వామి కొలువై ఉన్నారు.ధ్వజ స్తంభం దగ్గరగా సూర్య భగవానుడు ప్రతిష్ఠితమై ఉన్నాడు.అమరేశ్వర స్వామివారు త్రిగుణాలకు అతీతుడు అనే భావాన్ని ఆవిష్కరించేలా మూడు ప్రాకారాలతో ఆలయం కనువిందు చేస్తుంటుంది.శ్రీ వేణుగోపాల స్వామి,శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మ వారి సన్నిధిలున్నాయి.శ్రీ వేణు గోపాల స్వామి క్షేత్ర పాలకుడు.

ప్రధానాలయం రెండు అంతస్ధులుగా ఉంటుంది. గర్భాలయంలో 15 అడుగుల ఎత్తులో పొడవుగా ఊన్న మహా శివలింగం దంతం రంగులో ఉంటుంది.ఈ శివలింగం అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో తలపై మేకు కొట్టినట్టు చెబుతారు.అందుకు సంబంధించిన ఆనవాళ్లు కూడా కనిపిస్తూ వుండటం విశేషం.శ్రీ బాల చాముండికా సమేతుడైన అమరేశ్వరుడు ఇక్కడ విశేష పూజలను అందుకుంటూ ఉంటాడు.మహా శివరాత్రి పర్వదినం రోజున స్వామివారికి అమ్మవారికి అంగరంగ వైభవంగా కల్యాణోత్సవం జరుగుతుంది.త్రిశక్తి స్వరూపిణికి ప్రతి యేటా విజయదశమి రోజున నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.స్వామి వారి అభిషేకాలు ఉదయం 6:00 నుంచి 11:45 నిముషాలు వరకు జరుగుతాయి. ఆలయ దర్శనం ఉదయం 6:00 నుంచి 01:00 గంట వరకు తిరిగి సాయంత్రం 04:00 నుంచి రాత్రి 08:00 గంటలు వరకు లభ్యమవుతుంది.అన్న ప్రసాద వితరణ కూపన్లు ఉదయం 11:00 నుంచి 12:30 నిముషాలు వరకు ఇవ్వబడును.

గుంటూరు & విజయవాడ నుంచి అమరావతి గుడికి బస్సులు ప్రతి అర గంటకు ఉంటాయి.వీటిలో కొన్ని బస్సులు అమరావతి బస్ డిపో వరకు మాత్రమే ఉంటాయి.అమరావతి బస్ డిపో నుంచి అమరావతి గుడి మధ్య దూరం సుమారు రెండు కీ.మీగా ఉంటుంది.ఆటో రిక్షాలు దొరుకుతాయి.మార్గ మధ్యలో అమరావతిలో మ్యూజియము,అమరావతి స్తూపం ఉంటాయి.విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి కొన్ని అమరావతి గుడికి బస్ సర్వీసులు ఉంటాయి. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow