అంగన్‌వాడీ సిలబస్ మరింత సరళం
హైదరాబాద్ స్టూడియో భారత్ ప్రతినిధి
అంగన్‌వాడీ సిలబస్ మరింత సరళం!
చిన్నారులకు ఆసక్తి కలిగించేలా కొత్త మాడ్యూళ్ల రూపకల్పన
సమీక్షకు కమిటీని నియమించిన శిశు సంక్షేమ శాఖ
హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలోని అంగన్ వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు ఆ కేంద్రాల్లో మరింత నాణ్యమైన పూర్వప్రాథమిక విద్యను అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలుచేయనుంది.తొలి విడత కింద దాదాపు 15 వేల కేంద్రాలను ఆటాపాటలతో కూడిన విద్యను అందించే ప్రీప్రైమరీ కేంద్రాలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఆయాచోట్ల ఆటాపాటలు, విద్యాబోధనకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించనుంది.అంగన్ వాడీ కేంద్రాల్లో ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సిలబస్ ను పూర్తిగా సమీక్షించి,చిన్నారులకు తేలికగా అర్థమయ్యేలా ఆటా పాటలతో కూడిన మాడ్యూళ్లుగా విభజించి బోధన చేసేలా కసరత్తు చేస్తోంది.2024-25 నుంచే దీన్ని అమలు చేసేందుకు టీచర్లకు కొత్త మాడ్యూళ్లపై శిక్షణ ఇప్పించనుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 35,700 అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నాయి.వీటి పరిధిలో దాదాపు 17 లక్షల మంది చిన్నారులు నమోదై ఉన్నారు.కేంద్రాలకు వచ్చే ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడంతోపాటు వారికి అక్కడే బోధన చేస్తున్నారు.అయితే,సిలబస్ ను ప్రస్తుత అవసరాల మేరకు మరింత సరళంగా తీర్చిదిద్ది,ప్రాథమిక విద్యకు అనుగుణంగా సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు ప్రస్తుతం అంగన్ వాడీ కేంద్రాల్లో అమల్లో ఉన్న సిలబస్ ను సమీక్షించేందుకు శిశు సంక్షేమ శాఖ ఉన్నతస్థాయి కమిటీని నియమించింది.ఈ కమిటీలో ఆరేళ్లలోపు చిన్నారుల విద్య,ఇతర సమస్యలపై కృషిచేస్తున్న పలు స్వచ్ఛంద సంస్థలతోపాటు అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీని భాగస్వామ్యం చేసింది.కమిటీ సభ్యులు నెల రోజులుగా సిలబస్‌ను సమీక్షించి,ప్రత్యేక మాడ్యూళ్లు సిద్ధం చేస్తున్నారు.ఈ మాడ్యూళ్లను మరోసారి సమీక్షించి,అందులోని పొరపాట్లను సవరించేలా సమీక్ష కమిటీలు పనిచేస్తున్నాయి.ఎన్నికల కోడ్ ముగిసే నాటికి సిలబస్ మాడ్యూళ్లన్నీ సిద్ధం చేయాలని శిశు సంక్షేమశాఖ నిర్ణయించింది.
What's Your Reaction?