భారతదేశం vs ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. రోహిత్ శర్మ అనూహ్య నిర్ణయం!
స్టూడియో భారత్ ప్రతినిధి
ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది.ఓపెనర్‌గా ఆడే రోహిత్ శర్మ ఇక నుంచి మిడిలార్డర్‌లో ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ అదరగొట్టడంతో రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.రెండో సంతానాన్ని ఆస్వాదించేందుకు రోహిత్ శర్మ పెర్త్ టెస్ట్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అతని సతీమణి రితికా సజ్దే ప్రసవ సమయంలో పక్కన ఉండేందుకే రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 15న రితికా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దాంతో రోహిత్ శర్మ త్వరగానే టీమిండియాతో కలిసాడు.అడిలైడ్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న పింక్ బాల్ టెస్ట్ కోసం సన్నదమవుతున్నాడు.
ఈ మ్యాచ్ నేపథ్యంలో పీఎమ్ ఎలెవన్‌తో కాన్‌బెరా వేదికగా జరుగుతున్న పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగలేదు. తొలి టెస్ట్‌లో సత్తా చాటిన యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్‌లనే ఓపెనర్‌గా కొనసాగించాడు.దాంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ ఈ ఇద్దరే ఓపెనర్లుగా కొనసాగుతారనే చర్చ మొదలైంది. రోహిత్ శర్మ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే ఈ వ్యవహారంపై అటు బీసీసీఐ కానీ..
ఇటు రోహిత్ శర్మ కానీ అధికారికంగా ప్రకటించలేదు.వర్షం అంతరాయం కలిగించిన ఈ రెండు రోజు వామప్ మ్యాచ్‌ను 50 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ప్రధాని ఎలెవన్ 43.2 ఓవర్లలో 240 పరుగులకు కుప్పకూలింది.ఓపెనర్ సామ్ కోన్‌స్టాస్(97 బంతుల్లో 14 ఫోర్లు, సిక్స్‌తో 107) సెంచరీతో రాణించగా..టేయిలెండర్ హన్నో జకోబ్స్(60 బంతుల్లో 4 ఫోర్లు,2 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణాతో పాటు ఆకాశ్ దీప్(2/58) రెండు వికెట్లు తీయగా..మహమ్మద్ సిరాజ్,ప్రసిధ్ కృష్ణ,వాషింగ్టన్ సుందర్,రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు.తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి ఒక్క వికెట్ దక్కలేదు.ఈ సన్నాహక మ్యాచ్ లో టీమిండియా స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా బౌలింగ్ చేయలేదు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 75 పరుగులు జోడించిన అనంతరం యశస్వి జైస్వాల్(59 బంతుల్లో 9 ఫోర్లతో 45) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు.ఆ వెంటనే కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగ్గా..రోహిత్ శర్మ బ్యాటింగ్‌కు వచ్చాడు.
What's Your Reaction?