మొదటి ప్రయత్నం లోనే ఫైనల్‌ బెర్త్‌ ఖరారు

బుడాపెస్ట్ స్టూడియో భారత్ ప్రతినిధి

Aug 26, 2023 - 16:57
 0  31
మొదటి ప్రయత్నం లోనే ఫైనల్‌ బెర్త్‌ ఖరారు

   మొదటి ప్రయత్నంలోనే ఫైనల్‌ బెర్త్‌ ఖరారు

  • పారిస్‌ ఒలింపిక్స్‌కూ అర్హత ∙మనూ, కిశోర్‌ కూడా ఫైనల్‌కు
  • తొలిసారి ఒకే ఈవెంట్‌ ఫైనల్లో ముగ్గురు భారత అథ్లెట్లు

బుడాపెస్ట్‌ (హంగేరి):

కొన్నేళ్లుగా అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ వేదికపై భారత ముఖచిత్రంగా మారిన జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా మరోసారి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు.ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన నీరజ్‌ చోప్రా తొలి అడ్డంకిని విజయవంతంగా అధిగమించాడు.శుక్రవారం జరిగిన క్వాలిఫయింగ్‌లో నీరజ్‌ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు.తన మొదటి ప్రయత్నంలోనే ఈటెను ఏకంగా 88.77 మీటర్ల దూరం విసిరిన నీరజ్‌ ఆదివారం జరిగే ఫైనల్‌కు అర్హత సాధించాడు.

అంతేకాకుండా పారిస్‌ ఒలింపిక్స్‌ అర్హత ప్రమాణాన్ని (85.50 మీటర్లు) కూడా దాటేసి వచ్చే ఏడాది జరిగే విశ్వ క్రీడలకు బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు.శుక్రవారం జరిగిన క్వాలిఫయింగ్‌లో 12 మంది బరిలో ఉన్న గ్రూప్‌ ‘ఎ’లో నీరజ్‌ పోటీపడ్డాడు. మైదానంలోని అభిమానులు ఉత్సాహపరుస్తుండగా నీరజ్‌ జావెలిన్‌ను 88.77 మీటర్ల దూరం విసిరి ఒక్క త్రోతో రెండు లక్ష్యాలను సాధించాడు.జావెలిన్‌ను 83 మీటర్ల దూరం విసిరిన వారు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తారు లేదా టాప్‌–12లో నిలిచిన వారికి ఫైనల్‌ చేరే అవకాశం లభిస్తుంది.

నీరజ్‌ తప్ప గ్రూప్‌ ‘ఎ’ నుంచి మరెవరూ నేరుగా ఫైనల్‌ చేరలేకపోయారు. గ్రూప్‌ ‘ఎ’లోనే పోటీపడ్డ మరో భారత అథ్లెట్‌ డీపీ మనూ (81.31 మీటర్లు)... గ్రూప్‌ ‘బి’లో బరిలో నిలిచిన కిశోర్‌ కుమార్‌ జేనా (80.55 మీటర్లు) కూడా ఫైనల్‌కు చేరారు.ఓవరాల్‌గా మనూ ఆరో స్థానంలో,కిశోర్‌ తొమ్మిదో స్థానంలో నిలిచారు.ఫలితంగా ప్రపంచ చాంపియన్‌షిప్‌ చరిత్రలో తొలిసారి ఒకే ఈవెంట్‌లో ముగ్గురు భారత అథ్లెట్లు ఫైనల్లో పోటీపడనున్నారు.

నీరజ్‌తోపాటు అర్షద్‌ నదీమ్‌ (పాకిస్తాన్‌; 86.79 మీటర్లు),జాకుబ్‌ వాద్లెచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌; 83.50 మీటర్లు) మాత్రమే క్వాలిఫయింగ్‌ మార్క్‌ను అధిగమించి నేరుగా ఫైనల్‌ చేరారు.డిఫెండింగ్‌ చాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా; 78.49 మీటర్లు) ఓవరాల్‌గా 16వ స్థానంలో నిలిచి ఫైనల్‌ చేరలేకపోయాడు.  

ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ గేమ్స్, ఆసియా చాంపియన్‌షిప్, టోక్యో ఒలింపిక్స్, డైమండ్‌ లీగ్‌ మీట్‌లాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్స్‌లో స్వర్ణ పతకాలు గెలిచిన 25 ఏళ్ల నీరజ్‌ ఖాతాలో ప్రపంచ చాంపియన్‌షిప్‌ స్వర్ణ పతకం మాత్రమే చేరాల్సి ఉంది.గత ఏడాది అమెరికాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఈ హరియాణా జావెలిన్‌ త్రోయర్‌ రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెల్చుకున్నాడు.అంతా అనుకున్నట్లు జరిగితే ఆదివారం జరిగే ఫైనల్లో నీరజ్‌ను ఈసారి విశ్వవిజేతగా చూడవచ్చు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow