భారత్ లోనే అతిపెద్ద షాపింగ్ మాల్..
గుజరాత్ స్టూడియో భారత్ ప్రతినిధి
భారత్ లోనే అతిపెద్ద షాపింగ్ మాల్.. రూ. 4 వేల కోట్లతో ఈసారి అక్కడే.. లులు గ్రూప్ కీలక ప్రకటన.
ప్రముఖ హైపర్ మార్కెట్ చెయిన్ లులు మాల్స్ గురించి తెలిసే ఉంటుంది. అత్యంత విశాల షాపింగ్ మాల్స్‌లో దీని గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. కేరళకు చెందిన వ్యక్తి.. ఒట్టి చేతులతో యూఏఈ వెళ్లి అక్కడ మొదటగా ఈ మాల్ ప్రారంభించారు. క్రమక్రమంగా మళ్లీ ఇతర దేశాలకు విస్తరించారు. భారత్‌లోనూ పలు నగరాల్లో లులు మాల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్‌ను దేశంలోని ఒక ప్రధాన నగరంలో నిర్మించబోతున్నారు.
యూఏఈ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న.. హైపర్‌మార్కెట్స్ & రిటైల్ కంపెనీస్ చెయిన్ లులు గ్రూప్ మరోసారి కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈ లులు మాల్స్‌ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. గతేడాది ఆఖర్లో.. తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో కూడా లులు మాల్ ప్రారంభించింది. దీని విలువ సుమారు రూ. 300 కోట్లుగా ఉంటుంది. KPHB మంజీరా మాల్‌ను రీబ్రాండింగ్ చేసి.. లులు మాల్‌గా తీర్చిదిద్దింది. దీంతో ఇక్కడి జనం.. అంతర్జాతీయ స్థాయి షాపింగ్ అనుభవాల్ని పొందుతున్నారని చెప్పొచ్చు. ఇక 2 వేల మంది వరకు ఉపాధి కూడా కల్పించింది. దేశంలో ఇప్పటికే కొచ్చి, బెంగళూరు, కోయంబత్తూరు, లక్నో, తిరువనంతపురం, హైదరాబాద్‌తో కలిపి 6 మాల్స్ ఉన్నాయి.
ఈ క్రమంలోనే ఇప్పుడు లులు గ్రూప్ ఒక కీలక ప్రకటన చేసింది. దేశంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్‌ను సుమారు రూ. 4 వేల కోట్ల అంచనా వ్యయంతో.. నిర్మించనున్నట్లు ఈ సంస్థ గతేడాది ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిపై మరోసారి స్పందించారు లులు గ్రూప్ ఇంటర్నేషనల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంఏ యూసుఫ్ అలీ.భారత్‌లో పెట్టుబడులు పెట్టడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
గుజరాత్ అహ్మదాబాద్‌లో.. దేశంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ నిర్మించేందుకు కట్టుబడి ఉన్నామని.. త్వరలోనే ఈ ఏడాదిలోనే పనులు ప్రారంభం అవుతాయని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి.. అన్ని మంత్రిత్వ శాఖల నుంచి తమకు పూర్తి మద్దతు లభిస్తుందని.. ఇక్కడ యువతీయువకులకు ఉద్యోగాలు ఇస్తుండటం ఆనందం కలిగిస్తుందని యూసుఫ్ చెప్పారు.
'అహ్మదాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ నిర్మించబోతున్నాం. మాకు ఇప్పటికే ఇక్కడ ల్యాండ్ కూడా లభించింది. కేంద్రం, మంత్రిత్వ శాఖల నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. ఈ రోజుల్లో మేం ప్రారంభించబోతున్న అతిపెద్ద ప్రాజెక్టు అని చెప్పొచ్చు. 3,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తాం. ఇంకా 3 వేల మంది వరకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.' అని యూసుఫ్ అలీ వివరించారు.
ఈ ఏడాది ప్రారంభంలో గుజరాత్ లో జరిగిన వైబ్రేంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్‌కు హాజరైన యూసుఫ్ అలీ.. అహ్మదాబాద్‌లో అతిపెద్ద మాల్ నిర్మించే ప్రణాళికను బయటపెట్టారు. మరొక అతిపెద్ద మాల్‌ను చెన్నైలో కూడా ఏర్పాటు చేసేందుకు సంస్థ సంసిద్ధంగా ఉందని అన్నారు. ఈ అతిపెద్ద రిటైలర్ సంస్థ.. దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ సహా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభించేందుకు యోచిస్తున్నట్లు తెలిపింది.
What's Your Reaction?