కొల్లేరును క్లీన్ చేయడం సాధ్యమేనా?చంద్రబాబు ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్..
స్టూడియో భారత్ ప్రతినిధి
కొల్లేరును క్లీన్ చేయడం సాధ్యమేనా?చంద్రబాబు ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్..
విజయవాడ వరదలు,కొల్లేరు ఉగ్రరూపం చూసిన తర్వాత ప్రక్షాళనపై ప్రభుత్వం ముందడుగు వేయాలని భావిస్తోంది.ఐతే తలాపాపం తిలా పిడికడు అన్నట్లు కొల్లేరును కొల్లగొట్టడంలో అన్నిపార్టీల వారి పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి.
దేశంలో అతిపెద్ద మంచి నీటి సరస్సు కొల్లేరు.ఈ ప్రాంత ప్రజలకు ప్రకృతి ప్రసాదించిన వరం కొల్లేరు.లక్షల మందికి ప్రత్యక్షంగా..పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న కొల్లేరుకు ఆక్రమణలే పెద్ద శాపం.ఈ ఆక్రమణలను తొలగించి కొల్లేరును ప్రక్షాళించాలని ప్రతి ప్రభుత్వం చెప్పేమాట…ఇప్పుడు కూడా విజయవాడ వరద ముంపునకు కొల్లేరు కారణమని..ప్రజల ప్రాణాల కోసం కొల్లేరును క్లీన్ చేస్తామంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.కానీ,వేల ఎకరాల కొల్లేరు భూములను ఆక్రమించిన బడాబాబులను కదపడం కుదిరే పనేనా? ఇప్పుడే కాదు చంద్రబాబు తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా ఇదే మాట అన్నారు.ఆయన తర్వాత రాజశేఖర్‌రెడ్డి కొల్లేరుపై ఉక్కుపాదం మోపాలనుకున్నారు.రోజులు మారాయేగానీ కొల్లేరును ఎవరూ కాపాడలేకపోయారు.మరి ఇప్పుడు సీఎం చంద్రబాబు శపథం నెరవేరుతుందా?
ఆపరేషన్ కొల్లేరు… చంద్రబాబు ప్రభుత్వానికి పెద్ద సవాల్..
ఆపరేషన్ కొల్లేరు…చంద్రబాబు ప్రభుత్వానికి పెద్ద సవాల్.విజయవాడ ముంపునకు ప్రధాన కారణమైన బుడమేరు,కొల్లేరు ఆక్రమణలను తొలగించాలని నిర్ణయించారు సీఎం చంద్రబాబు.ఆయన అభిప్రాయంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఏకీభవిస్తున్నారు.భవిష్యత్ లో వచ్చే విపత్తుల నుంచి విజయవాడ నగరాన్ని కాపాడాలంటే కొల్లేరును క్లీన్ చేయాలనేది చంద్రబాబు ఆలోచన.సీఎం ఆలోచనలను వంద శాతం సపోర్ట్ చేయాల్సిందే కానీ,కొల్లేరు సరస్సు…అక్కడ జరిగే దందాలు,ఇతర వ్యవహారాలు తెలిసిన వారు కొల్లేరు ప్రక్షాళన సాధ్యమయ్యే పనేనా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు జీననాధారం లేక కొల్లేరు వాసుల వలసలు..
సుమారు రెండు లక్షల 22 వేల ఎకరాల్లో విస్తరించిన కొల్లేరు సరస్సు… ఆక్రమణలతో బక్క చిక్కిపోతోందనేది జగమెరిగిన సత్యం. 12 మండలాల్లో 120కి పైగా గ్రామాల వారికి కొల్లేరే జీవనాధారం.ఒకప్పుడు కొల్లేరులో పర్యావరణ చట్టాలు పకడ్బందీగా అమలు చేసే కాలంలో ఇక్కడ బతకడం దుర్భరంగా ఉండేదని గుర్తు చేస్తున్నారు పర్యావరణ వేత్తలు.సరైన జీననాధారం లేక కొల్లేరు వాసులు ఇతర ప్రాంతాలకు వలస పోయేవారట.కానీ,1970 ప్రాంతంలో అప్పటి ప్రభుత్వం కొల్లేరులో చేపలు,రొయ్యల పెంపకానికి అనుమతి ఇవ్వడంతో కొల్లేరు దశ తిరిగిపోయింది.
వలస పోయిన కొల్లేరు వాసులు..
ఇతర ప్రాంతాల వారికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు.ఒకప్పుడు ఆక్వా పరిశ్రమ లక్షల రూపాయల పంట పండించేది. క్రమంగా ఆక్వా నష్టాల్లో కూరుకుపోయినా…చేపల పెంపకం ద్వారా కొల్లేరు వాసులు రెండు చేతులా సంపాదిస్తున్నారు. కొల్లేరు పరివాహ ప్రాంత వాసుల అంతా సొసైటీలుగా ఏర్పడి చేపల వేట ద్వారా డబ్బు సంపాదించగా,కాస్త అంగ అర్థ బలాలు ఉన్నవారు,రాజకీయ నాయకులు కొల్లేరును కొల్లగొట్టి..అక్రమంగా చెరువులు తవ్వించి దోచుకుంటున్నారు.ఇలా అనుమతులు లేకుండా వెలిసిన చెరువులతో కొల్లేరు నిండిపోయింది. రెండు లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉండే కొల్లేరు సరస్సు 70 వేల ఎకరాలకు తగ్గిపోయింది.
కొల్లేరు క్లీన్ చేసేందుకు గతంలో చంద్రబాబు, వైఎస్ఆర్ సంకల్పం..
ఈ పరిస్థితుల్లో కొల్లేరును పరిరక్షించాలని గత ప్రభుత్వాలు యజ్ఞాలు చేశాయి.గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 1999లో కొల్లేరు ఆక్రమణల తొలగింపునకు ప్రత్యేకంగా జీవో జారీ చేశారు.కానీ,వివిధ కారణాలతో ఆ జీవో ఆచరణకు నోచుకోలేదు.అనంతరం గద్దెనెక్కిన దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2006లో మరో జీవో జారీ చేశారు.కొన్ని చెరువులను బ్లాస్టింగ్ చేశారు.అయితే ఆక్రమణదారులు సుప్రీంకోర్టుకు వెళ్లి ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకున్నారు.ఆ తర్వాత కొల్లేరు ఆక్రమణలు యథేచ్ఛగా సాగిపోయాయి.ఇక గత ప్రభుత్వం కూడా కొల్లేరులో కొందరికి పట్టాలు పంపిణీ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి.ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వరదలు కొల్లేరుపై ఫోకస్ పెంచేలా చేస్తున్నాయి.దీంతో కొల్లేరులో ఆక్రమణల తొలగింపుపై మళ్లీ ప్రకటనలు చేస్తున్నారు సీఎం చంద్రబాబు.
కోట్ల రూపాయలు తెచ్చిపెట్టే కొల్లేరును ఖాళీ చేయడానికి అంగీకరిస్తారా?
విజయవాడ వరదలు,కొల్లేరు ఉగ్రరూపం చూసిన తర్వాత ప్రక్షాళనపై ప్రభుత్వం ముందడుగు వేయాలని భావిస్తోంది.ఐతే తలాపాపం తిలా పిడికడు అన్నట్లు కొల్లేరును కొల్లగొట్టడంలో అన్నిపార్టీల వారి పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి.ఇక్కడ ప్రజాప్రతినిధులు,మాజీలు అంతా కొల్లరు దందాలో పాత్రధారులు,సూత్రధారులే అంటున్నారు.ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలు దండుకోవడంలో ముందుంటారని చెబుతున్నారు.అధికారం చేతులు మారగానే పాత్రధారులు మారతారని చెబుతున్నారు.నేనే రాజు…నేనే మంత్రి అన్నట్లు కొల్లేరు ప్రాంత ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తుంటారు. కోట్ల రూపాయలు తెచ్చిపెట్టే కొల్లేరును ఖాళీ చేయడానికి వారు అంగీకరిస్తారా?అన్నదే అంతుచిక్కని ప్రశ్న.ఏదైనా సరే ప్రభుత్వం మునుముందు తీసుకోబోయే చర్యలే కొల్లేరు భవితవ్యంను తేలుస్తాయని వ్యాఖ్యాలు వినిపిస్తున్నాయి.
What's Your Reaction?