సామాజిక సంస్కర్తల దార్శనికుడు మహాత్మ జ్యోతీబా ఫూలే

స్టూడియో భారత్ ప్రతినిధి

Apr 10, 2024 - 13:42
 0  66
సామాజిక సంస్కర్తల దార్శనికుడు మహాత్మ జ్యోతీబా ఫూలే

సామాజిక సంస్కర్తల దార్శనికుడు మహాత్మ జ్యోతీబా ఫూలే

మహాత్మా జ్యోతీరావ్ గోవింద్ ఫూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్ర లోని సతారా గ్రామంలో ఒక మాలి కుటుంబంలో గోవిందరావు,చిన్నూభాయి దంపతులకు జన్మించాడు.వీరి వృత్తి ఆనాటి పీష్వా కుటుంబానికి పువ్వులు సరఫరా చేయడం.ఆ కాలం నాటి సమాజంలోని అసమానతలు,అవిద్య,అజ్ఞానాలకు కులవైషమ్యాలు కారణమని,ముఖ్యంగా ఆనాటి సమాజంలో స్త్రీ వెనుకబాటుతనానికి,అణచివేతకు విద్యా జ్ఞానం లేకపోవడం ప్రధాన కారణం అని గ్రహించి స్త్రీ విద్య కోసం కృషి చేశారు జ్యోతీరావు ఫూలే.సమాజంలోని అసమానతలను పోగొట్టడానికి,అలాగే స్త్రీ,పురుషుల మధ్య లింగ వివక్షతను తొలగించడానికి ఆయన విశేషంగా కృషి చేశారు.అమెరికాకు చెందిన థామస్ పైన్ రచించిన ‘‘ద రైట్స్ ఆఫ్ మ్యాన్’’ అనే గ్రంథం వల్ల ప్రభావితుడైన పూలే,ప్రపంచాన్ని మార్చగల సాధనం విద్య ఒక్కటే అని,సమాజంలోని రుగ్మతలను తొలగించడానికి ప్రజలు జ్ఞానవంతులు కావాలని ప్రగాఢంగా నమ్మాడు.మొదటగా బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి గానూ బాల,బాలికలకు పాఠశాలలను ప్రారంభించాడు.ఆనాటి బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం ఫూలేని పూనా మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యుడిగా నియమించడంతో అణగారిన వర్గాల వారి హక్కుల కోసం,స్త్రీల సమానత్వం కోసం,అలాగే రైతుల సమస్యల కోసం ప్రభుత్వ పెద్దలతో రాజీలేని పోరాటం జరిపి,రాజకీయ పాలనా సమావేశాలలో ప్రజా సమస్యలపై గళమెత్తాడు.

జ్యోతిబా ఫూలే సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలలో అక్షర చైతన్యం నింపడానికి చేస్తున్న కృషిని గౌరవిస్తూ 1888లో ముంబాయికి చెందిన సామాజిక సంస్కర్త రావ్ బహుదూర్ విఠల్ రావు కృష్ణాజీ వాండేకార్,కొంతమంది ప్రజలు కలసి ‘మహాత్మా’ అను బిరుదును జ్యోతీబా ఫూలేకి ప్రదానం చేశారు.19వ శతాబ్దంలో జ్యోతిబా పూలే ప్రారంభించిన ‘‘అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడం’’ అనే మహోన్నత ఆశయాన్ని 20వ శతాబ్దంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సైతం స్ఫూర్తిగా తీసుకొని కొనసాగించారు.ఆశాజనకమైన సమసమాజ నిర్మాణం జరగాలంటే ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ,స్వాతంత్ర్యం కల్పించాలి అని ఫూలే విశ్వసించాడు. బానిసత్వాన్ని,కుల వివక్షతను నిశితంగా విమర్శిస్తూ ఫూలే రాసిన ‘గులాంగిరి’, సేద్యగాడిపై ఛర్నాకోలా వంటి రచనల అధ్యయనం బడుగు,బలహీన వర్గాల సమాజాన్ని చైతన్యపరచి వారి ఆలోచనా విధానాన్ని ఈనాటికీ ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.

విశాల మానవ ధర్మానికి సంబంధించిన అవగాహనను ఆనాటి సమాజంలో కలిగించడానికి ‘సత్య శోధక్ సమాజం’ అనే సంస్థను ఏర్పాటు చేసి ‘‘మనమంతా దేవుని సంతానం,దేవుని దృష్టిలో మనందరం సమానం. ఈ భేద భావాలు మనం సృష్టించుకొన్నవే’’ అని పేర్కొంటూ నిర్బంధ విధ్య,స్వదేశీ భావన,నిరాడంబరతని అలవర్చేందుకు సత్యశోధక సమాజం ఎంతో అవసరమని...ఇవే ఈ సంస్థ లక్ష్యాలు అని ఫూలే ప్రకటించాడు.ధనుంజయ్ కీర్ రచించిన పూలే జీవితచరిత్రలో ‘‘సామాజిక విప్లవాల పితామహుడిగా’’ మహాత్మా జ్యోతీరావ్ పూలేను అభివర్ణించాడు.ఫూలే ప్రజాస్వామిక వ్యవస్థను అభిలషించాడు.మూఢవిశ్వాసాలను వ్యతిరేకించాడు.వైదిక హిందూ ఆధిక్యతావాదాన్ని విమర్శించాడు.పూలేయిజం లోని ప్రాథమిక అంశం మానవాతావాదం.ఫూలే ప్రపంచ పౌరహక్కుల,మానవ హక్కుల ఉద్యమ నిర్మాతల్లో,సిద్ధాంతకర్తల్లో ఒకరు. తన జీవితాన్నే ప్రజాసేవకై అర్పించిన యోధుడు మహాత్మా జ్యోతీబా పూలే...1890 నవంబర్ 28న పూణేలో మరణించాడు.సామాజిక సమానత్వం,సమరసత కోసం కృషి చేసిన మహాత్మా జ్యోతీబా ఫూలే ఆలోచనలను ఆచరిస్తూ,ఆయన ఆశయాలను సాధించడమే మనం ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow