బడి లేని పంచాయతీ తెలంగాణలో ఉండొద్దు : సీఎం రేవంత్

హైదరాబాద్ స్టూడియో భారత్ ప్రతినిధి

Dec 31, 2023 - 16:46
 0  20
బడి లేని పంచాయతీ తెలంగాణలో ఉండొద్దు : సీఎం రేవంత్

బడి లేని పంచాయతీ తెలంగాణలో ఉండొద్దు : సీఎం రేవంత్

తెలంగాణలోని పంచాయతీల్లో బడి ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్ఠం చేశారు. బడి లేని పంచాయతీ తెలంగాణలో ఉండొద్దని డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన విద్యాశాఖ సమీక్షలో అన్నారు.

‘రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైన, మారుమూల తాండా అయినా తప్పకుండా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందే. ఏ ఒక్క బాలుడు గానీ, బాలిక గానీ చదువుకై ఇతర గ్రామాలకు, పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దు. విద్యార్థులు లేరనే నెపంతో మూసివేసిన అన్ని పాఠశాలలను తెరిపించాలి. ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలను నడపాల్సిందే’ అని సీఎం ఆదేశంచారు. దీనికోసం వెంటనే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల భర్తీకి చర్యలను తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ కాళీలను భర్తీ చేయడానికి డీ.ఎస్.సి నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మన ఊరు, మన బడి కార్యక్రమంలో జరిగిన పనుల పురోగతిని సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేసి, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలన్నారు.

ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలలో ఉన్న అవాంతరాలపై దృష్ఠిసారించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. బదిలీల అంశంలో ఉన్న అవాంతరాలను, అభ్యంతరాలను అధిగమించడానికి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. విద్యాలయాలకు విద్యుత్తు బిల్లులకు సంబంధించి కేటగిరి మార్పునకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు ముఖ్యమంత్రి సూచనలను చేశారు. విద్యాలయాలకు వ్యాపార, పారిశ్రామిక కేటగిరి కింద బిల్లులు వసూలు చేయడంపై తగిన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలన్నారు. పాఠశాలల్లో స్వీపర్లు, పారిశుధ్య కార్మికులను ఏర్పాటు చేయడానికి ఉన్న మార్గాల గురించి అధికారులకు తగిన ఆదేశాలను జారీ చేశారు.

ఉమ్మడి జిల్లాకో స్కిల్ యూనివర్సిటీ

రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ప్రారిశ్రామిక అవసరాలకు కావాల్సిన నైపుణ్యంగల ఉద్యోగాలను సాధించే విధంగా ఈ స్కిల్ యూనివర్సిటీలుండాలని అన్నారు. వీటిలో ఉపాధి ఆధారిత స్వల్పకాల, దీర్ఘ కాల కోర్సులను ప్రవేశ పెట్టాలని పేర్కొన్నారు. ఈ విషయంలో గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఒరిస్సా, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్న ఈ విధమైన స్కిల్ యూనివర్సిటీలని అధ్యయనం చేయాలన్నారు. కొడంగల్ నియోజక వర్గంతోపాటు తొమ్మిది జిలాల్లో ఈ స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఇందుకుగాను, విద్యా శాఖ, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖల కార్యదర్శులతో ప్రత్యేక కమిటీ వేసి తగు ప్రతిపాదనలను సమర్పించాలని సీఎస్ ను ఆదేశించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నత విద్య మండలి ఛైర్మన్ ప్రో.లింబాద్రి,విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యా శాఖ దేవసేన,సి.ఎం.ఓ అధికారులు శేషాద్రి,షా-నవాజ్ కాసీం తదితర అధికారులు హాజరయ్యారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow