శ్రీ ఆదివరాహుడు ఏదో రహస్యాన్ని చెప్పుతున్నట్లుంటాడు ఎందుకు..
ఆధ్యాత్మికం స్టూడియో భారత్ ప్రతినిధి
"తిరుమల శ్రీవారి పుష్కరిణి పక్కనున్న శ్రీ ఆదివరాహస్వామి వారి గుడిలో స్వామివారు తమకెదురుగా వచ్చే భక్తులను చూడకుండా అమ్మ వారితో ఏదో రహస్యంగా చెప్తున్నట్టుగా ఉంటారు.అలా పక్కకు తిరిగి ఎందుకున్నారు?
కలియుగంలో శ్రీవారు ఆదివరాహస్వామి వారికి ఒక వరమిచ్చారు. "ప్రధమపూజ, ప్రధమ నైవేద్యం, ప్రథమదర్శనం నీకే వరాహా!" అని. వైఖా నస ఆగమశాస్త్రప్రకారం, క్షేత్రనియమం ప్రకారం
స్వామివారి దర్శనానికెళ్లేముందు ప్రతి భక్తుడూ ముందుగా పుష్కర స్నానంచేసి,వరాహస్వామి దర్శనంచేసుకుని,ఆ స్వామి అనుమతితో మాత్రమే ఆనంద నిలయంలోనున్న శ్రీవారిదర్శనం చేసు కోవాలి. ఇది తిరుమల యొక్క క్షేత్రసంప్రదాయం.
శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం ముందు తల్లి ప్రదానం, తర్వాత గురువు, ఆ తర్వాతే భగవంతుడు. కనుక ముందు అలివేలు మంగాపురంలో అమ్మవారి దర్శనం చేసుకుని, తిరుమలకొచ్చి పుష్కరిణిలో స్నానంచేసి, జ్ఞానాపిరాన్ (గురువు) గా పిలవబడే ఆదివరాహస్వామి వారి దర్శనం చేసుకొని, వారి అనుమతితో మాత్రమే శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దర్శనానికెళ్లాలి. ఇది క్షేత్రనియమం, తిరుమలలో స్వామిని దర్శనంచేసుకునే క్రమ పద్దతి. వేంకటేశ్వరస్వామి వరాహస్వామి వారికిచ్చిన వరమేమిటంటే, " నిన్నుచూడక నన్ను చూసి నా ; నన్నుచూసి నిన్నుచూసినా ; నేను వారిని చూడను" అని చెప్పారు శ్రీనివాసుడు.
ఇప్పుడు ఆ విగ్రహమలా ఎందుకుందో తెల్సుకుందాం
అయ్యవారు, అమ్మవారు మాట్లాడుకుంటూ"లక్ష్మీ! ఈ భక్తుడు ముందు నీ దర్శనం చేశాడా? అని స్వామి తల్లిని అడిగితే, "చేసాడు స్వామి!" అని అమ్మవారు చెప్తున్నారు. మనం స్వామి పుష్కరిణిలో స్నానంచేశామా? లేదా?అని గమనించడానికే స్వామి కంటికెదురుగా పుష్కరిణి ఉంది.
"పద్ధతిప్రకారం ముందుగా నా దర్శనానికొచ్చి క్షేత్ర సంప్రదాయ నియమాలను పాటించాడు కనుక, ఆనంద నిలయంలో స్వామి వక్ష స్థలంలో కూడా ఉండే నువ్వు నామాటగా శ్రీనివాసుడితో చెప్పి ఈ భక్తుడి సమస్త ఈతి బాధలు తీర్చి, కోరిన కోర్కెలు తీర్చమనిచెప్పు!" అని తన భార్య చెవిలో మన గురించే చెప్తున్నారు శ్రీఆదివరాహస్వామి.
కనున తిరుమలకు దర్శనాని కెళ్ళి వచ్చామని మనం గొప్పగా చెప్పుకోడం కాదు ప్రదానం. "నా భక్తుడు నా కొండకు నేను చెప్పిన విధానంలో వచ్చి దర్శనం చేసుకున్నాడు!" అని స్వామివారు
ఆనందంతో పొంగిపోయేలా ఉండాలి మీ తిరుమల క్షేత్రయాత్ర. తిరుమల యాత్రలో ప్రతి చిన్న విషయాన్ని కూడా స్వామివారు గమనిస్తూ ఉంటారు. భక్తి భావనతో మాత్రమే స్వామికి దగ్గరగా వెళ్లగలం. ఇదీ వరాహస్వామి విగ్రహమలా పక్కకు తిరిగి, అమ్మవారితో ఏదో చెప్తున్నట్టు ఉండడానికి వెనకనున్నది.
What's Your Reaction?