ప్రశ్నించే ప్రజల గొంతుకలు అవసరం
స్టూడియో భారత్ ప్రతినిధి
ప్రశ్నించే ప్రజల గొంతుకలు అవసరం
అనేక ఆటుపోట్లను అధిగమించి, అడ్డంకులను తట్టుకొని, నిషేధాలను,అ నిర్బంధాలను ఎదుర్కొని,మార్క్సిజం ప్రాణవాయువుగా ఉద్యమస్ఫూర్తి సాహిత్యాన్ని సృష్టిస్తూ, ప్రశ్నించే ప్రజల గొంతుకై నిలుస్తున్న నిరంతర సాహిత్య చైతన్య స్రవంతి అభ్యుదయ రచయితల సంఘం (అరసం).అభ్యుదయ రచయితల సంఘం 80 సంవత్సరాల క్రితం 1943 ఫిబ్రవరి 13, 14 తేదీలలో తెనాలిలో తాపీ ధర్మారావు అధ్యక్షతన ప్రథమ మహాసభలు జరుపుకుంది.ఈ మహాసభలకు తెలంగాణ నుంచి ప్రముఖ రచయిత వట్టికోట ఆళ్వారు స్వామి హాజరయ్యారు.అనంతరం ఆయన తెలంగాణ ప్రాంతంలో అరసం సంస్థాగత నిర్మాణానికి ప్రయత్నించినా నిజాం నిరంకుశ పాలనలో సాధ్యపడలేదు.అయితే అభ్యుదయ సాహితీ సృజన ఈ ప్రాంతం నుండి విరివిగా వెలువడింది.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో సాహిత్యానికి దిశానిర్దేశం చేసింది.2008 సెప్టెంబర్ 13,14 తేదీలలో కడపలో జరిగిన అరసం 15వ రాష్ట్ర మహాసభ తెలంగాణ రాష్ట్ర అస్తిత్వ ఆకాంక్షను బలపరుస్తూ,ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తూ, అన్ని సాహితీ సంస్థలకన్న ముందుగా తీర్మానం చేసింది.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంతో అరసం మమేకమైంది.అరసం రచయితలు ఇందులో పాల్గొన డమే కాకుండా విరివిగా సాహిత్యాన్ని సృష్టించారు.ఈ క్రమంలోనే 2012 ఫిబ్రవరి 4,5 తేదీలలో సూర్యాపేటలో 16వ మహాసభలు జరుపుకుంది. అప్పటి ప్రభుత్వం తెలంగాణ పట్ల సరైన రాజకీయ నిర్ణయం తీసుకోకుండా డిసెంబరు 27,28 తేదీలలో తిరుపతిలో జరిపిన ప్రపంచ తెలుగు మహాసభలను అరసం బహిష్కరించింది.
తెలంగాణ ఉద్యమ సాహిత్య సృష్టిని కొనసాగిస్తూనే తెలంగాణ సాధనకోసం సాగిన మహత్తర తెలంగాణ లాంగ్ మార్స్లో పాల్గొన్నది. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడి పోయిన తరువాత 2014 జూన్ 10న హైదరాబాద్లో అరసం కార్యవర్గ సమా వేశం నిర్వహించి ఆంధ్రప్రదేశ్,తెలంగాణ కమిటీలను ఏర్పాటు చేసుకుంది.ఈ రెండు కమిటీల ఆధ్వర్యంలో 2014 సెప్టెం బర్ 27, 28 తేదీలలో వరంగల్లులో ఉమ్మడిగా మహాసభలు నిర్వహించినా,అవి ఆంధ్ర అరసానికి 17వ మహాసభలు,తెలంగాణ అరసానికి ప్రథమ మహాసభలుగా పేర్కొనడం జరుగుతోంది.ఈ క్రమంలో తెలంగాణ దృక్కోణంతో సామా జిక,రాజకీయ,ఆర్థిక,సాంస్కృతిక నేప ధ్యంలో తెలంగాణ అరసం తన అభ్యు దయ సాహిత్యోద్యమ వారసత్వాన్ని కొన సాగిస్తూ ముందుకు సాగుతుంది.
నేటి పాలకులు సాయుధ పోరాట తెలంగాణ ఉద్యమ చరిత్రను,ఆనాటి వీరుల త్యాగాలను పాఠ్యాంశాలలో లేకుండా చేస్తున్నారు.కేవలం 2014లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేపధ్య చరిత్రను,సాహిత్యాన్ని మాత్రమే వాటిలో చొప్పిస్తున్నారు.అందుకే విస్మరణకు గురవుతున్న సాయుధ రైతాంగ పోరాట ఫలితంగా తెలంగాణ సాయుధ పోరాట సాహిత్య సంపదను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని అరసం పిలుపునిస్తున్నది.
ఆంధ్రమహాసభ,కమ్యూనిస్టు పార్టీల నైజాం నుంచి నాడు తెలంగాణ విముక్తి చెందింది.అది జరగకుంటే నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు.ఈ సాయుధ రైతాంగ పోరాటాన్ని అణచివేసే పేరుతో భారత సైన్యాలు కిరాతకంగా వేలాదిమంది సాయుధ పోరాట వీరులను కాల్చి చంపాయి.ఈ వీరుల ధైర్య సాహసాలను,త్యాగాలను వెలిగెత్తి చాటుతూ విరివిగా అభ్యుదయ సాహిత్యం వచ్చింది.తెలంగాణలో అభ్యుదయ సాహిత్యానికి ఇది స్వర్ణ యుగం.ఆ పోరాట చరిత్రను,ఆనాడు వెలువడిన సాహిత్యాన్ని కావాలని నేటి పాలక వర్గాలు విస్మరణకు గురిచేస్తున్నాయి.2014లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ప్రత్యేక తెలంగాణ పోరాటాన్ని మాత్రమే తెరపైకి తెస్తూ కీర్తిస్తున్నారు.ఈ సాహిత్యానికి పెద్ద పీట వేస్తున్నారు.ఇది అభ్యంతరకరం కాకపోయినప్పటికి తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను,అనాటి సాహిత్యాన్ని వక్రీకరిస్తూ, మరుగున పడేసే వైఖరి ఆక్షేప ణీయం.
నరహంతక నైజాం నియంతృత్వాన్ని,ఆనాటి దొరలు,దేశముఖ్ లు, రజాకార్ల ఆ చకాలను తెరమరుగు చేస్తున్నారు.దాశరథి,కాళోజి లాంటి అనేకమంది కవులు నిజాంను గద్దె దించేందుకు తరతరాల బూజు నైజాం రాజు అంటూ విమర్శించారో అలాంటి నైజాం రాజును నేడు గొప్పవాడని,మంచివాడని,అభివృద్ధి కాముకుడని కీర్తిస్తున్నారు.అంతే కాకుండా విద్యార్థుల కోసం తయారు చేస్తున్న పాఠ్య గ్రంథాల్లో,పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షల పుస్తకాల్లో కావాలని నేటి పాలకులు సాయుధ పోరాట తెలంగాణ ఉద్యమ చరిత్రను, ఆనాటి వీరుల త్యాగాలను లేకుండా చేస్తూ కేవలం 2014లో ఏర్పడిన తెలం గాణ రాష్ట్ర ఉద్యమ నేపధ్య చరిత్రను,సాహిత్యాన్ని మాత్రమే చొప్పిస్తున్నారు.
అందుకే విస్మరణకు గురవుతున్న తెలంగాణ సాయుధ పోరాట సాహిత్య సంపదను సంరక్షించుకో వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అరసం పిలుపునిస్తున్నది. కొత్తగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులు,ప్రజల స్వేచ్ఛలు హరించబడుతున్నాయి.సమస్యలపై నినదించే గొంతులు లేకుండా చేయాలనే దుష్ట పన్నాగం కొనసాగుతున్నది.రైతులు,కార్మికులు,యువకులు,విద్యార్థులు తమ సమస్యలపై ఉద్యమాలు,పోరాటాలు చేస్తుంటే కేసులు పెట్టి ఆణచి వేస్తున్నారు.ఈ నేపధ్యంలో సామాజిక బాధ్యత కలిగిన రచ యితలు ప్రజల పక్షం నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం సాధించిన దేశం. నేడు కేంద్రంలో ఏర్పడిన ప్రభుత్వం తమ విశ్వాసాలు,భావజాలలను అంగీకరించని వారిపై భౌతిక దాడులకు పూనుకునే మత మౌఢ్యపు సంస్కృతిని పెంచి పోషిస్తుంది.ప్రగతిశీల,హేతువాద,ఉద్యమ స్ఫూర్తి రచయితలపై ఉద్యమకారులపై దాడులు పెరిగిపోతున్నాయి.రాసే స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్నారు.విద్యా వ్యవస్థలో మత మూఢ విశ్వాసాలను ప్రోదిచేసే విధంగా పాఠ్యాంశా'లను పొందుపరుస్తున్నారు.పాలక వర్గాల స్వార్ధం,ఎన్నికల ప్రయోజనంలో భాగంగా కుల,మత మౌఢ్యాలు,వైషమ్యాలు పెరిగిపోతున్నాయి.
ఈ సంక్షోభ సామాజిక,రాజ కీయ,సాంస్కృతిక నేపధ్యంలో అరసం తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభలు అక్టోబర్ 1,2 తేదీలలో హైదరాబాద్ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్తు హాలులో జరుపుకుంటున్నది.ఈ మహాసభల్లో రచయితలు,కవులు,కళాకారులు ప్రజా పోరాట సాహిత్య పరిపుష్టికి దోహదపడుతూ,ప్రశ్నించే ప్రజల గొంతుకై నిలవాలని కోరుతోంది.
What's Your Reaction?