పశ్చిమబెంగాల్ లో రెండు రైళ్లు ఢీ
బంకురా స్టూడియో భారత్ ప్రతినిధి

పశ్చిమబెంగాల్ లో రెండు రైళ్లు ఢీ.. పట్టాలు తప్పిన 12 వ్యాగన్లు
బంకురా:
పశ్చిమబెంగాల్‌లోని బంకురా జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. అడ్రా డివిజన్ పరిధిలోని ఓండా స్టేషన్‌కు సమీపంలో గూడ్స్ రైలు, మెయింటెనెన్స్ రైలును ఢీకొంది..
ఈ ఘటనతో 12కిపైగా వ్యాగన్లు పట్టాలు తప్పాయి.ప్రమాద తీవ్రతకు గూడ్స్ రైలు ఇంజిన్.. మరో రైలు వ్యాగన్ పైకి చేరింది.ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.రైల్వే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.ఈ ప్రమాదంలో ఓ రైలు డ్రైవర్ స్వల్ప గాయాల పాలయ్యాడు.
ప్రమాదం ఎలా జరిగిందంటే..?
తెల్లవారుజామున 4.05 గంటల సమయంలో ఓండా స్టేషన్ వద్ద రైల్వే మెయింటెనెన్స్ రైలు (బీఆర్‌ఎన్) షంటింగ్ పని జరుగుతోంది.ఆ సమయంలో గూడ్స్ రైలుకు రెడ్ సిగ్నల్ పడింది.కానీ,గూడ్స్ రైలు ఆగకుండా ముందుకు వెళ్లిపోయింది.ఆ తర్వాత బీఆర్‌ఎన్ మెయింటెనెన్స్ రైలును ఢీకొంది. దీంతో 12 వ్యాగన్లు పట్టాలు తప్పాయి.ఉదయం 7 గంటల సమయానికి అప్ మెయిల్,అప్ లూప్ లైన్లను పునరుద్ధరించారు.ఈ విషయాన్ని ఆగ్నేయ రైల్వే సీపీఆర్‌వో వెల్లడించారు.
ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు మాట్లాడుతూ.. రెండు రైళ్లలో ఎటువంటి లోడు లేదని వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలను తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.ఈ ఘటన చోటు చేసుకొన్న అడ్రా డివిజన్..పశ్చిమబెంగాల్‌లో నాలుగు జిల్లాలైన వెస్ట్ మిడ్నాపుర్, బంకురా, పురులియా, బృందావన్‌లో రైళ్ల రాకపోకలకు కీలకమైంది. ఇక ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్, బొకారో, సింగభూమ్ పై కూడా కొంత ప్రభావం పడవచ్చు. ప్రమాదం జరిగిన మార్గంలో వీలైనంత త్వరగా రాకపోకలను
పునరుద్ధరించి..పురులియా ఎక్స్‌ప్రెస్ వంటి సర్వీసులను పునరుద్ధరించేలా రైల్వే అధికారులు తక్షణమే ప్రయత్నాలు మొదలుపెట్టారు..
What's Your Reaction?






