ఈజిప్టు పర్యటనలో నరేంద్ర మోదీ
కైరో స్టూడియో భారత్ ప్రతినిధి

కైరో:
విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈజిప్టు కు చేరుకున్నారు.మూడు రోజుల అమెరికా అధికారిక పర్యటన అనంతరం ప్రధాని మోదీ.. కైరోకు పయనమైన విషయం తెలిసిందే. స్థానిక విమానాశ్రయంలో మోదీకి ఈజిప్టు ప్రధాని ముస్తఫా మద్‌బౌలీ ఘన స్వాగతం పలికారు.అనంతరం ప్రధాని మోదీ ఈజిప్టు సేనల గౌరవ వందనం స్వీకరించారు.ఇదిలా ఉండగా.. 1997 తర్వాత భారత ప్రధాని ఒకరు ఈజిప్టులో పర్యటించడం ఇదే తొలిసారి. ప్రధానిగా నరేంద్ర మోదీకి ఇది ఈజిప్టు తొలి పర్యటన.
ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ రెండు రోజుల పాటు ఈజిప్టులో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఈజిప్టు, పాలస్తీనాల్లో ఉండి పోరాడి మరణించిన భారతీయ సైనికులకు నివాళులు అర్పించనున్నారు. వారి కోసం హెలియోపొలిస్ కామన్‌వెల్త్ వార్ గ్రేవ్ సిమెట్రీలో స్మారకం నిర్మించారు. దీంతో పాటు అతి పురాతన అల్ హకీమ్ మసీదునూ మోదీ సందర్శిస్తారు. ఈజిప్టు ప్రధానితో రౌండ్ టేబుల్ సమావేశంతో పాటు ఇతర నేతలు, ఉన్నతాధికారులు, ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ భేటీ కానున్నారు.
ఇదిలా ఉండగా..ఈ ఏడాది భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి పాల్గొన్న విషయం తెలిసిందే. అరబ్, ఆఫ్రికా దేశాల రాజకీయాల్లో ఈజిప్టు ఎంతో కీలకంగా వ్యవహరిస్తుందనే చెప్పవచ్చు. ఆఫ్రికా, ఐరోపా మార్కెట్లకు ప్రధాన గేట్‌వేగానూ ఈ దేశాన్ని పరిగణిస్తారు. అలాంటి ఈజిప్టుతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుచుకునేందుకు భారత్ ఆసక్తి చూపుతోంది.
What's Your Reaction?






