మహాలయ పక్షంలో పితృకర్మలు జరుగుతాయి
స్టూడియో భారత్ ప్రతినిధి
మహాలయ పక్షారంభం...
మహాలయ పక్షంలో పితృకర్మలు జరుగుతాయి
మనిషి ఎంతగా ఎదిగినా,ఎంత దూరం పయనించినా తన మూలాలను మర్చిపోకూడదు.ఆ మూలాలే అతని జన్మకి,సంస్కారానికీ,సంస్కృతికీ కారణం.అందుకనే ఏటా ఏదో ఒక సమయంలో మన పెద్దలను తల్చుకునేందుకు కొన్ని సందర్భాలను ఏర్పరిచారు.వాటిలో ముఖ్యమైనవి మహాలయపక్షం రోజులు.చనిపోయిన వారి ఆత్మ తిరిగి జన్మించాలంటే అన్నాన్ని ఆశ్రయించే తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుందని శాస్త్రం చెబుతోంది.శ్రాద్ధకర్మలు సరిగా నిర్వహించకపోతే మనిషికి ప్రేత రూపంలో సంచరిస్తూనే ఉంటాడని చాలా మతాలు నమ్ముతాయి.
ఈ రెండు వాదనలూ నమ్మకపోయినా పూర్వీకులను తల్చుకోవడం సంస్కారం అన్నది మాత్రం కాదనలేం కదా!అందుకు ఓ సందర్భమే మహాలయ పక్షం.భ్రాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకూ వచ్చే 15 రోజుల కాలాన్నీ మహాలయ పక్షమని అంటారు.మహాలయ పక్షంలో పితృ దేవతలకు తర్పణాలు విడుస్తారు కాబట్టే దీనికి పితృపక్షమని కూడా పేరు.ఇప్పటివరకు మనం పితృదేవతలకు చేస్తున్న శ్రాద్ధకర్మలలో ఎలాంటి లోపం వచ్చినా కూడా ఈ పక్షంలో తర్పణాలని విడిస్తే దోషాలన్నీ తొలగిపోతాయట.
అంతేకాదు!మనకి రక్తసంబంధం లేని గురువులు,స్నేహితులకు కూడా ఈ సమయంలో తర్పణాలను వదలవచ్చు.కొందరికి పుత్రులు లేకపోవడం వల్ల శ్రాద్ధకర్మలు జరగకపోవచ్చు.అలాంటివారికి కూడా ఈ సమయంలో తర్పణాలను వీడవచ్చు.మహాలయం పక్షంలోని ఒక్కో రోజుకీ ఒక్కోక్క ప్రత్యేకత ఉంది.ఒక్కో కారణంతో చనిపోయినవారికి ఒకో రోజుని కేటాయించారు.క్రితం ఏడు చనిపోయినవారికీ,భర్త ఉండగానే చనిపోయినవారికీ,పిల్లలకీ,అర్థంతరంగా చనిపోయినవారికీ, ఇలా ఒకొక్కరికీ ఒక తిథినాడు తర్పణం విడవడం మంచిదని చెబుతారు.
ఇలా కుదరకపోతే చివరిరోజు వచ్చే అమావాస్యనాడు తర్పణం వీడవచ్చని చెబుతారు. అందుకే ఆ అమావాస్య రోజుని ‘సర్వ పితృ అమావాస్య’ అని పిలుస్తారు.ఈ మహాలయ అమావాస్య వెనుక ఓ చిత్రమైన కథ ప్రచారంలో ఉంది. కర్ణుడు చనిపోయిన తర్వాత స్వర్గలోకానికి చేరుకున్నాడట.అక్కడ ఇంద్రుడు అతన్ని సాదరంగా ఆహ్వానించాడు.బంగారం,వజ్రాలని అతని ముందు ఉంచి భుజించమన్నాడు.వాటిని చూసిన కర్ణుడికి ఆశ్చర్యం వేసింది. అన్నంతో తీరే ఆకలి బంగారంతో ఎలా తీరుతుందని అడిగాడు.‘నీ జీవితకాలమంతా బంగారం,వజ్రాలను దానం చేశావు.కానీ నీ పితృదేవతలకు ఏనాడూ పిండప్రదానం చేసి ఎరగవు,’అని బదులిచ్చాడట ఇంద్రుడు.దాంతో కర్ణుడు తన తప్పుని తెలుసుకుని,తన పితృదేవతలకు తర్పణాలు విడిచేందుకు ఓ పదిహేను రోజులు తిరిగి భూలోకం మీదకు పంపమని వేడుకున్నాడట.
అలా కర్ణుడికి దక్కిన 15 రోజులే ఈ మహాలయ పక్షం. మహాలయ పక్షంలో ఏదో ఒక రోజున కనీసం ఒక భోక్తనన్నా పిలిచి పితృదేవతలకు తర్పణాలు వీడాలి.లేదా గయ వంటి పుణ్యక్షేత్రాలకు చేరుకుని అక్కడ శ్రాద్ధకర్మలు నిర్వహించాలి.లేదా తమ పితృదేవతలను స్మరిస్తూ ఎవరన్నా బ్రాహ్మణుడికి స్వయంపాకాన్ని దానం చేయాలి.మహాలయపక్షంలో అంతటా ఈ పితృకర్మలు జరుగుతాయి కాబట్టి పెద్ద పనులు వేటినీ చేపట్టకూడదని అంటారు.
What's Your Reaction?