అధికంగా శ్రావణ మాసం నిజంగా ఎప్పటి నుంచో తెలుసా?

స్టూడియో భారత్ ప్రతినిధి

Jul 13, 2023 - 00:43
 0  92
అధికంగా శ్రావణ మాసం నిజంగా ఎప్పటి నుంచో తెలుసా?

అధికంగా శ్రావణ మాసం నిజంగా ఎప్పటి నుంచి?

నిజ శ్రావణ అధిక మాసం తేదీలు,ఆయా సమయాల్లో చేయాల్సిన కార్యక్రమాల గురించి పంచాంగకర్తలు వివరించారు.జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కాలగణనం సూర్యడు చంద్రుల ఆధారంగా జరుగుతుంది.సూర్యుని ఆధారంగా లెక్కగట్టే కాలమానాన్ని సౌరమానం అని అంటారు.చంద్రుని ఆధారంగా లెక్కకట్టే సంవత్సర గణనాన్ని చంద్రమానమని అంటారని పంచాంగకర్తలు తెలియజేస్తారు.

చాంద్రమానం నెల అంటే 29.53 రోజులుగా భావించవచ్చు.దీనిప్రకారం చాంద్రమానంలో సంవత్సరం అంటే 354 రోజులు.అనగా చాంద్రమాన మాస పద్ధతిలో సంవత్సరానికి 11 రోజుల తేడా ఏర్పడుతుంది.సౌరమానం చాంద్రమానంలో తేడా ప్రతీ నాలుగు సంవత్సరాలలో 31 రోజులు అవుతుంది.అది అధిక మాసంగా ఉంటుంది.

దీని మూలానా 32 నెలలకు ఒకసారి ఏర్పడే మాసాన్ని అధిక మాసంగాను,చాంద్రమాన సంవత్సరానికి సౌరమాన సంవత్సరానికి ఉన్న తేడాను సరిచేసేందుకు చాంద్రమాన సంవత్సరంలో ఒక నెల అధికంగా జోడించి అధిక మాసమని అంటారని పంచాంగకర్తలు తెలియజేస్తున్నారు.

ఈ విధంగా అధిక మాసము శూన్యమాసము నందున శుభకార్యాలు ఆచరించడానికి నిషిద్ధము.అధిక మాసంలో శుభాకార్యక్రమాలైన వివాహము,ఉపనయనము,గర్భాదానం,గృహారంభం,గృహప్రవేశం వంటివి నిషేధితము.అధికమాసంలో ఎలాంటి శుభకార్యాలను ఆచరించకూడదు.పితృ కార్యాలను కూడా అధికమాసాన్ని వది లేసి నిజమాసంలోనే ఆచరించవలెనని జ్యోతిష్య పెద్దలు తెలియజేస్తున్నారు.

ఈ సంవత్సరం అధిక మాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు18 జూలై 2023 మంగళవారం నుంచి 16 ఆగస్టు 2023 బుధవారం వరకు అధిక శ్రావణ మాసం అవుతోందని జ్యోతిష్య నిపుణులు తెలిపారు.నిజ శ్రావణం 17 ఆగస్టు 2023 గురువారం నుంచి 15 సెప్టెంబరు 2023 వరకు ఉంటుందని వివరించారు.అధిక మాసం శూన్య మాసం.భగవత్ సాక్షాత్కారానికి సంబంధించిన కార్యక్రమాలు,పుణ్యార్చన సంపాదించే కార్యాల ఆచరించవచ్చునని జ్యోతిష్య పెద్దలు తెలియజేశారు.అంటే హోమాలు,విష్ణుసహస్రనామ పారాయణం,అష్టాదశ పురాణాలు,మహాభారత పఠనం,రామాయణ పఠనం వంటివి చేయవచ్చు.

అధిక శ్రావణ మాసంలో ఆచరించవలసినవి

దైవారాధనలు,వ్రతాలు,పితృ ఆరాధన,అధికమాస పూజ,దాన ధర్మాలు వంటివి ఆచరించడం వలన విశేషం అయినటువంటి ఫలితాలు లభిస్తాయని పండితులు తెలిపారు.పురాణాల ప్రకారం అధిక మాసానికి సంబంధించినటు వంటి ఒక ప్రత్యేకమైన విశేషమున్నది.మహావిష్ణువుకు చాలా ప్రత్యేకమైనటువంటి మాసం అధిక శ్రావణ మాసము.మహావిష్ణువు అధికమాసానికి పురుషోత్తమ మాసమని పేరు ఇచ్చినట్లుగా చెప్పబడినది.

విష్ణుమూర్తి అధిక శ్రావణ మాస మహాత్యాన్ని చెబుతూ మాసంలో చేసేటటువంటి మంచి పనులకు అధికమైన ఫలితాలు వస్తాయని అందుకనే మాసానికి అధిక శ్రావణ మాసమని పేరు.అందువలన అధిక శ్రావణ మాసంలో విష్ణుమూర్తిని ఆరాధించడం,విష్ణు సహస్ర నామాలు పఠించడం ఏకాదశి రోజు ఉపవాసము,వ్రతాలు,దీక్షలు వంటివి చేయడం వల్ల మామూలు మాసముల కన్న అధికమైన ఫలితాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

అనాథలకు,మూగ జీవాలకు,ఆహారాన్ని అందించడం, దాన ధర్మాలు ఆచరించడం వల్ల మామూలు మాసంలో చేసేటివంటి వాటి కంటే,అధికమైన ఫలితం పురుషోత్తమమైన మాసం అయినటువంటి అధిక శ్రావణ మాసంలో లభిస్తుందని పండితులు వివరించారు.

చరిత్ర ప్రకారం పూర్వం ఇంద్రుడు అధిక మాస వ్రతాన్ని ఆచరించి ఇంద్ర పదవిని పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి.ఒకానొకప్పుడు లక్ష్మీదేవి స్వయముగా అధిక శ్రావణ మాస మహిమ గురించి మహా విష్ణువును అడుగగా మహావిష్ణువు పురుషోత్తమ మాసములో ఎవరైతే పుణ్య నదీ స్నానాలు జప హోమాలు,దానాలు వంటివి ఆచరిస్తారో వారికి మామూలు మాసంలో వచ్చేటటువంటి ఫలితాలు కన్నా అధిక రెట్ల ఫలితాలు వస్తాయని వారు చెప్పారు.

ఇది కాకుండా ఇలాంటి అధిక శ్రావణ మాసంలో గనుక పుణ్యకర్మలు ఆచరించకపోతే వారి జీవితంలో కష్టనష్టములు ఎదురవుతాయని పెద్దలు చెబుతారు.అధిక శ్రావణ మాసంలో శుక్ల పక్షమునందు గాని,కృష్ణపక్షమునందు గాని అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజున కనీసము ఇటువంటి పుణ్యకార్యాలు ఆచరించినట్లు అయితే వారికి అధిక శ్రావణ మాస పుణ్య ఫలము లభిస్తుందని మహావిష్ణుమూర్తి స్వయంగా లక్ష్మీదేవికి చెప్పినట్లుగా పురాణాలు తెలిపాయని పంచాంగకర్తలు వివరించారు.

నిజ శ్రావణ మాస తేదీలు ఎప్పటి నుండి

నిజ శ్రావణ మాసం తేదీ 17 ఆగస్టు 2023 గురువారం నుంచి 15 సెప్టెంబరు 2023 వరకు ఉంటుందని పండితులు తెలియజేసారు.శ్రావణ సోమవారం రోజున శివారాధన,మంగళ గౌరీ వ్రతాలు,వరలక్ష్మీ పూజలు,నాగ పంచమి,పుత్రద ఏకాదశి,జంద్యాల పూర్ణిమ(శ్రావణ పూర్ణిమ) వంటి పండగలన్నీ కూడా నిజ శ్రావణ మాసంలో 17 ఆగస్టు 2023 నుంచి 15 సెప్టెంబరు 2023 మధ్య జరుపుకోవాలని పంచాంగకర్త లు వివరించారు.అధిక శ్రావణ మాసంలో చేయాల్సిన దైవ కార్యములు చేసి దేవుని కృపకి పాత్రులు కాగలరు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow