సూపర్‌స్టార్ కొడుకు.. గొర్రెలు కాస్తున్నాడట!
స్టూడియో భారత్ ప్రతినిధి
సూపర్‌స్టార్ కొడుకు.. గొర్రెలు కాస్తున్నాడట!
స్టార్ డమ్ ని కాదని.. ఆనందాలను వెతుక్కొనే పనిలో పడ్డాడు.
సోలోగా లోకాన్ని చుట్టేస్తూ, చిన్నాచితకా పనులు చేసుకుంటూ డబ్బుకంటే విలువైన జ్ఞాపకాలను పోగుచేసుకుంటున్నాడు.
మోహన్ లాల్ తనయుడు ప్రణవ్.. ‘వర్క్ అవే’ ప్రోగ్రాంలో భాగంగా స్పెయిన్‌లోని ఓ ఫామ్‌లో ఉంటూ అక్కడ వాళ్లు పెట్టింది తిని ఉంటున్నాడట.
‘సూపర్‌స్టార్ కొడుకంటే ఎలా ఉంటాడు?’ - సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ.. బ్లాక్‌బస్టర్లు కొడుతూ.. ఖరీదైన కార్లలో రయ్‌మంటూ షికార్లు చేస్తుంటాడు.
కానీ,ఓ కుర్రాడు మాత్రం స్టార్ డమ్ ని కాదని.. ఆనందాలను వెతుక్కొనే పనిలో పడ్డాడు.సోలోగా లోకాన్ని చుట్టేస్తూ, చిన్నాచితకా పనులు చేసుకుంటూ డబ్బుకంటే విలువైన జ్ఞాపకాలను పోగుచేసుకుంటున్నాడు.
అతగాడెవరో తెలుసుకుందామా...
ప్రణవ్.. (Pranav Mohanlal) మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కొడుకు.
అతగాడు నటుడు, ప్లేబ్యాక్ సింగర్, పాటల రచయిత కూడా. ప్రస్తుతం తను ‘వర్క్ అవే’ ప్రోగ్రాంలో భాగంగా స్పెయిన్‌లోని ఓ ఫామ్‌లో ఉన్నాడట. అక్కడే పని చేసుకుంటూ.. ఇంకా చెప్పాలంటే గొర్రెలు, గుర్రాలు, మేకలు కాసుకుంటూ.. వారు పెట్టేది తింటూ అందులోనే నిద్రపోతున్నాడట.
ఈ వివరాలన్నీ అతడి తల్లి సుచిత్ర (Suchitra Mohanlal) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ప్రపంచానికి తెలిసింది.
‘స్టార్ కొడుకేంటి? ఫామ్‌లో పనేంటి?’ అంటూ నోరెళ్లబెట్టడం జనాల వంతైంది.
‘ఎందుకలా?’ అని అడిగితే..
డబ్బు, హోదా కంటే ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే విలువైన అనుభవాలకే తను ఎక్కువ విలువిస్తాడట.
స్వేచ్ఛగా లోకాన్ని చుట్టిరావడమంటే ప్రణవ్‌కి ఎంతో ఇష్టమనీ, ఇప్పుడు అదే పనిలో ఉన్నాడని గర్వంగా చెబుతుందామె.
ఈ ప్రయాణంలో కొన్ని పుస్తకాలు, సంగీత పరికరాలు మాత్రమే తోడుగా తీసుకెళ్లాడట.
నమ్మిందే చేస్తాడట.. :
తల్లిదండ్రులుగా తాము స్క్రిప్టులు విన్నా, వింటున్నా.. తుది నిర్ణయం మాత్రం ప్రణవ్‌దేనట.
అంటే.. నలుగురు నడిచేది కాదు, తాను ఏది నిజమని నమ్ముతాడో అదే చేస్తాడట.
స్టార్ హీరో కుమారుడిగా సకల భోగాలు అనుభవించడం కంటే మనసుకు నచ్చినట్లు బతకగలిగే సాధారణ వ్యక్తిగా ఉండేందుకే ఇష్టపడతాడట.
సక్సెస్ రుచి చూసినా.. :
తండ్రి పెద్ద హీరో కావడంతో చిన్నతనం నుంచే ప్రణవ్‌కు సినిమా వాతావరణంతో పరిచయం ఉంది.
2003లోనే చైల్డ్ ఆర్టిస్టుగా ‘పునర్జని’ సినిమాతో వెండితెర రంగప్రవేశం చేశాడు. ఈ చిత్రానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ బాల నటుడిగా అవార్డు గెలుచుకున్నాడు.
ఆ తర్వాత కాలేజీ,ఉన్నత చదువులపై దృష్టిసారించాడు.మళ్లీ 2015లో ఇండస్ట్రీ వైపు చూశాడు.
ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్ దగ్గర అసిస్టెంట్ గా చేరాడు.ఆయనతో కలిసి రెండు సినిమాలకు పనిచేశాడు.
2018లో జీతూ డైరెక్షన్ లోనే సోలో హీరోగా తెరకు పరిచయమయ్యాడు.ఆ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఆ సినిమా రికార్డులకెక్కింది. అందులో నటనకు గానూ ‘బెస్ట్ డెబ్యూ యాక్టర్’గా సైమా అవార్డును సాధించాడు.
ఈ చిత్రంలో ఒక పాట రాయడమే కాకుండా స్వయంగా పాడి.. తనలోని మరో కోణాన్నీ ప్రపంచానికి చూపాడు.
2022లో వచ్చిన ‘హృదయం’ (Hridayam Movie) సినిమాతో విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. అంతేకాదు, ఇందులోని ‘దర్శన’ (Hridayam - Darshana Video Song) సాంగ్ యూత్‌లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ప్రణవ్ ఆలోచనలు వేరు.. లోకం వేరు..
అందుకే బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా.. తానేంటో సొంతంగా నిరూపించుకున్నా.. ఇంకేదో చేయాలనీ, విలువైన అనుభవాలను పోగు చేసుకునేందుకు అవన్నీ వదులుకొని..వైవిధ్య జీవితాన్నే కోరుకుంటున్నాడీ బహుదూరపు బాటసారి.
What's Your Reaction?