వలలో చిక్కిన ఇరవై ఏడు కిలోల కచ్చిడి చేప

మూడు లక్షల తొంభై వేల రూపాయలు రికార్డు ధర... స్టూడియో భారత్ ప్రతినిధి

Nov 29, 2023 - 10:19
 0  119
వలలో చిక్కిన ఇరవై ఏడు కిలోల కచ్చిడి చేప

వలలో చిక్కిన 27 కిలోల కచ్చిడి చేప.. రూ. 3.90 లక్షల రికార్డు ధర

పూడిమడక

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామం. అక్కడ మత్స్యకారులే నివాసం ఉంటారు. వారి జీవనాధారం చేపల వేట. ఎప్పుడూ మాదిరిగానే మెరుగు నూకయ్య అనే మత్స్యకారుడు వేటకు వెళ్లాడు.గంగమ్మకి మొక్కుకొని సముద్రంలో వల విసిరాడు. వలకు ఏదో చిక్కింది. కాస్త బరువుగా కూడా అనిపిస్తుంది. సహచరులతో కలిసి మెల్లగా వల లాగారు. ఆ వలకు మామూలు చేప కాదు భారీ కాయంతో కూడిన చేప చిక్కింది. ఆ వలకు చిక్కిన చేప మామూలు చేప కాదు. గోల్డెన్ ఫిష్‌గా పిలుచుకునే కచ్చిడి చేప. దాన్నే కిచిడీ ఫిష్ అని కూడా అంటుంటారు. బోటుపై ఎక్కించుకుని హుషారుగా ఒడ్డుకొచ్చేసారు. విషయం ఆ నోటా ఈ నోటా పాకింది. చేపను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. అంతే ఆసక్తిగా ఆ చేపను సొంతం చేసుకునేందుకు పోటీపడ్డారు. దీంతో ఇక వేలం నిర్వహించక తప్పలేదు.

3.90 లక్షలు పలికిన చేప..

27 కిలోల ఈ చేపను వేలానికి పెట్టారు. మెరుగు కొండయ్య అనే వ్యక్తి వచ్చి.. చేపను సొంతం చేసుకున్నాడు. మెరుగు కొండయ్య మూడు లక్షల 20 వేల రూపాయలకు కొనుగోలు చేశాడు. దీంతో నూకయ్య కుటుంబానికి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఒక్క రోజులోనే ఆ మత్స్యకారుడు లక్షాధికారి అయిపోయాడు.

ఎందుకంత డిమాండ్ అంటే ..?

సముద్ర జలాల్లో అరుదుగా లభించేది ఈ కచ్చిడి చేప. మత్స్యకారులు దీన్ని గోల్డెన్ ఫిష్‌గా భావిస్తారు. అత్యంత అరుదుగా వలకు చిక్కుతుంటాయి. ఇవి ఒక చోట ఉండవు. వేర్వేరు ప్రాంతాల్లో సముద్ర జలాల్లో సంచరిస్తూ ఉండడం ఈ చేప లక్షణం. చేప మాంసం చాలా రుచిగా ఉండడంతో పాటు.. ఔషధ గుణాలతో కూడుకున్నదని అంటుంటారు. అందుకే ఆ చేపకు అంత డిమాండ్ మరి. కచ్చిడి చేపలో మగ చేప బంగారు వర్ణంలో ఉంటుంది. ఈ చేపల్లో పొట్ట భాగం చాలా విలువైనదట. చేప బరువును బట్టి దాని పొట్ట భాగమే ఏకంగా 80 వేల వరకు ధర పలుకుతుందట.

మందులు,ఔషధాల్లో ఈ చేపను వినియోగిస్తుంటారు అనేది మత్స్యకారులే చెబుతున్నారు.అందుకే..జీవితంలో ఒక్కసారైనా తమ వలకు ఇలాంటి చేపలు చిక్కాలని మత్స్యకారులు కోరుకుంటారట. ఎవరికైతే ఈ చేప చిక్కుతుందో.. వాళ్ల పంట పండినట్లే. అందుకే ఈ చేపకు అంతటి ప్రత్యేకత..!

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow