తిరుమల లడ్డు వివాదం - ఇమేజ్,డామేజ్ ఎవరికి..!!
అమరావతి :
తిరుమల తిరుపతి దేవస్థానం...గత కొన్ని రోజులుగా ప్రధాన వార్తల్లో నిలుస్తోంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారనే ఆరోపణలు రావడంతో వివాదం మొదలైంది.అయితే ఈ వివాదం కాస్త చిలికి చిలికి గాలి వానయ్యేలా ఉంది.తిరుమల లడ్డూ ప్రసాదంకు రాజకీయ మకిలి అంటింది.ఏపీలోని ప్రధాన పార్టీలు వివాదంపై ఒకరినొకరు దూషించుకుంటూ ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకోవడం తిరుమలకు వచ్చే భక్తులను కలచివేస్తోంది.అసలు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్రసాదం కల్తీ అయ్యిందంటే అసలు నమ్మడం లేదని చాలామంది భక్తులు చెప్తున్నారు.కానీ రాజకీయాల కోసం స్వామివారి పేరును తీయడం అత్యంత ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.
వివాదం ప్రారంభమైంది. ఇలా..
సెప్టెంబర్ 18వ తేదీ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వినియోగించారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలు దావనంలా ప్రపంచమంతా పాకాయి,దీంతో ప్రపంచంలో ఏ మూలన చూసినా తిరుమల లడ్డూ ప్రసాదం గురించే చర్చ జరుగుతుండటం విశేషం.అంతగా ప్రసిద్ధి ప్రఖ్యాతి గాంచిన ఏడుకొండల వెంకటేశ్వరుడి నివాసంలో రాజకీయాలు రాజ్యమేలుతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఒకవైపు తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించలేదని టీటీడీ ఈవో స్పష్టంగా చెప్తున్నప్పటికీ..అక్కడ రాజకీయాలు లేదా రాజకీయ నాయకులు మాత్రం విషయాన్ని ఇంతటితో ఆపడం లేదని భక్తులు చెబుతున్నారు.మన పరువు మనమే తీసుకుంటున్నామనే బాధను వ్యక్తం చేస్తున్నారు.స్వతంత్ర సంస్థచే విచారణ ఇక సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచే తిరుమల లడ్డూలో కలుషిత నెయ్యి వినియోగించారనే ప్రకటన రావడంతో దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే దారి తీసింది.ఎన్డీయే కూటమిలోని బీజేపీ స్వతంత్ర సంస్థచే విచారణ చేయించాలని డిమాండ్ చేస్తోంది.మరో వైపు మాజీ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సైతం సుప్రీంకోర్టు నేతృత్వంలో విచారణ జరగాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.అయితే తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందనే వార్తలు వచ్చినప్పటికీ భక్తులు మాత్రం నమ్మడం లేదనేది స్పష్టమవుతోంది.ఎందుకంటే రోజూ తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అలానే ఉంది.అదే సమయంలో లడ్డూ ప్రసాదం కూడా పెద్ద సంఖ్యలోనే కొనుగోలు చేస్తున్నారు.ఇక హర్యానా మహారాష్ట్రల్లో ఎన్నికలు సమీపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో తిరుమల లడ్డూ వివాదం చెలరేగడంతో రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీకి ఇది కొంత తలనొప్పిగా మారింది.రాజకీయంగా తమకు ఈ అంశం ఇరుకున పెట్టే అవకాశం ఉందని బీజేపీ నేతలు నాయకులు గుసగుసలాడుకుంటున్నారు..
నేషనల్ ఫుడ్ లేబొరేటరీని విస్మరించారా..?
గుజరాత్లోని ఆనంద్లో ఉన్న సెంటర్ ఫర్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవస్టాక్ ఫుడ్ (జారారాఖీ) కు కల్తీ అయ్యిందని చెబుతున్న నెయ్యి శాంపిల్స్ను పరీక్షకు పంపింది టీటీడీ.ఈ ల్యాబ్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు అనుబంధ సంస్థ.జూలై 9వ తేదీన లడ్డూ శాంపిల్స్ ఈ ల్యాబు కు చేరాయి.జూలై 16న పూర్తిస్థాయి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.మరి నివేదిక బయటికొచ్చిన రెండు నెలలకు అంటే సెప్టెంబర్ నెలలో చంద్రబాబు విషయం చెప్పడాన్ని కొందరు రాజకీయ విశ్లేషకులు తప్పుబడుతున్నారు.ఈ నెయ్యి సప్లయ్ చేసింది తమిళనాడులోని దిండిగల్కు చెందిన ఏఆర్ డెయిరీ.ఈ సంస్థ సప్లయ్ చేసిన నెయ్యి కలుషితం అయ్యిందని రిపోర్ట్ ఇచ్చింది.అయితే ఘజియాబాద్ లో ఉన్న అత్యున్నత ఫుడ్ క్వాలిటీ చెక్ సంస్థ నేషనల్ ఫుడ్ లేబొరేటరీ కు నెయ్యి శాంపిల్స్ ఎందుకు టీటీడీ పంపలేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
రంగంలోకి హిందూ సంఘాలు
ఏఆర్ డెయిరీ సప్లయ్ చేసే నెయ్యిలో కల్తీ ఉందని తేలితే ఆ సంస్థను బ్లాక్స్టులో పెడతామని టీటీడీ ఈఓ శ్యామలరావు జూలై 29న చెప్పారనే విషయాన్ని ఇక్కడ గుర్తించాలి.ఇక తాజాగా తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదం చుట్టుముట్టిన వేళ..టీటీడీ పాలక వర్గంలో రాజకీయ ప్రమేయంలేని వారికి హిందూ ధర్మాన్ని పరిరక్షించే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వంతో కూడా సంబంధం లేకుండా స్వచ్చందంగా టీటీడీ కార్యకలాపాలు నిర్వహించేలా చూడాలని కోరుతున్నాయి.అయితే ఇది సాధ్యపడేది కాదనే విషయాన్ని కూడా గుర్తెరగాలి.ఎందుకంటే ఆయా రాష్ట్రాల పరిధిలో ఉన్న ఆలయాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వాల దేవాదాయ చట్టాల వర్తిస్తాయని సుప్రీంకోర్టు గతంలో తీర్పును వెల్లడించింది.
రాజకీయాలు కాదు.. క్వాలిటీ పై దృష్టి సారించాలి
మొత్తానికి క్వాలిటీ కంట్రోల్ దగ్గర పరిష్కరించాల్సిన సమస్య చిలికి చిలికి గాలివానలా తయారైంది.ఇకనైనా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయం,లడ్డూ ప్రసాదం పై రాజకీయాలు మానుకొని భక్తులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఎందుకంటే మన గర్వంగా చెప్పుకునే ఏడుకొండల వారి నివాసం.ప్రపంచం నలుదిక్కులా ఉన్న శ్రీవారి భక్తులకు తిరుమల క్షేత్రం ఒక ఎమోషన్.దీనిపై రాజకీయం చేయడం మాని,ఈ పుణ్యక్షేత్రం గొప్పతనాన్ని చాటాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.
What's Your Reaction?