బెజవాడ బ్రదర్స్ లో ఎవరి సత్తా ఎంత?
విజయవాడ స్టూడియో భారత్ ప్రతినిధి

అన్నదమ్ముల యుద్ధం లో గెలుపు ఎవరిది, ఉత్కంఠ రేపుతున్న విజయవాడ పార్లమెంటు సీటు
తమ్ముడు తమ్ముడే..రాజకీయం రాజకీయమే…తోబుట్టువు కావొచ్చు…రాజకీయాల్లో మాత్రం తన మన భేదం లేదు బ్రదర్ అంటున్నారు ఆ ఇద్దరు అన్నదమ్ములు.
దశాబ్దాల ఇంటి పోరు…ఇప్పుడు రాజకీయ యుద్ధంగా మారింది. విజయమో..వీర స్వర్గమో అంటున్న బెజవాడ బ్రదర్స్‌లో ఎవరి సత్తా ఎంత? ఇద్దరు తోబుట్టువులు ప్రత్యర్థులుగా ఎలా మారారు?
సై అంటే సై అంటున్న అన్నదమ్ములు..
సొంత సోదరులే… రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. ఆ గట్టు… ఈ గట్టు అంటూ ఏదీ లేదు…ఎవరి గట్స్ ఏంటో జనం మధ్యే తేల్చుకుంటామంటూ ఎన్నికల యుద్ధానికి కాలు దువ్వుతున్నారు. ఇప్పటికే ఇద్దరి అభ్యర్థిత్వాలను ఖరారు చేశాయి ఆయా పార్టీలు.సిట్టింగ్ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని ఈసారి వైసీపీ అభ్యర్థిగా బెజవాడ యుద్ధానికి సిద్ధమవగా, ఆయనకు సవాల్ విసురుతున్నారు నాని సొంత సోదరుడు కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని…ఈ ఇద్దరు అన్నదమ్ముల సమరంతో వైసీపీ వర్సస్ టీడీపీ కూటమి పోటీ కాస్తా….నాని వర్సెస్ చిన్ని అన్నట్లు మారిపోయింది.
అన్నదమ్ముల్లో ఎవరి సత్తా ఎంత?
ఆంధ్ర రాజకీయాలకు కేరాఫ్‌గా చెప్పే విజయవాడలో పాలిటిక్స్ ఎప్పుడూ డిఫరెంట్‌గా ఉంటాయి.ఆ క్రమంలోనే ఇద్దరు అన్నదమ్ముల మధ్య సవాల్‌గా మారాయి.హేమాహేమీ నేతలు ఎందరో ప్రాతినిధ్యం వహించిన బెజవాడ పార్లమెంట్‌లో ఈసారి బ్రదర్స్ మధ్య పోటీ కాకరేపుతోంది.దీంతో రాజకీయ రాజధానిగా నిలిచిన విజయవాడలో లోక్‌సభ ఎన్నికలు ఆసక్తికరంగా మారిపోయాయి.
హ్యాట్రిక్ విజయంపై ధీమా..
అధికార వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని.. కొద్ది రోజుల క్రితమే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ గూటికి చేరారు. పార్టీలో చేరిన 24 గంటల్లోనే ఆయనకు టికెట్ ఖరారు చేసింది అధికార పార్టీ…గత రెండు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన నాని ఈసారి వైసీపీ తరఫున పోటీ చేసి హ్యాట్రిక్ సాధించాలని తహతహలాడుతున్నారు.స్వతహాగా వ్యాపారవేత్త అయిన కేశినేని నాని…2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయాల్లో ప్రవేశించారు.2014లో టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి సంచలన విజయం సాధించారు.ఆ ఐదేళ్లు తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాని… 2019లో ఫ్యాన్ హవాను తట్టుకుని రికార్డు లెవల్ లో విజయం సొంతం చేసుకున్నారు.పార్లమెంట్ పరిధిలో ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే టీడీపీ గెలిచినా,ఎంపీగా నాని గెలవడం వెనుక ఆయన వ్యక్తిగత ఇమేజ్ కూడా ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
చిన్నిని ప్రోత్సహిస్తున్నారని టీడీపీపై తిరుగుబాటు..
ఇలా వరుసగా రెండుసార్లు గెలిచిన నాని…ఈ మధ్యే పార్టీ మారారు. తన స్థానంలో కేశినేని చిన్నిని ప్రోత్సహిస్తున్నారని టీడీపీపై తిరుగుబాటు చేశారు ఎంపీ నాని.రెండోసారి గెలిచిన తర్వాత ఎంపీ నానికి… టీడీపీ స్థానిక నేతలకు పెద్ద గ్యాపే వచ్చింది.నియోజకవర్గ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన నానిస్థానిక నేతలను అసలు లెక్క చేసేవారు కాదు.ఇలా ఈ గ్యాప్ పెరిగి పెద్దదై..ఏకంగా తిరువూరు బహిరంగ సభకు రావొద్దంటూ సిట్టింగ్ ఎంపీకి కబురు పంపేంత వరకు వెళ్లింది.ఎంపీగా గెలిచిన తనను కాదని అధిష్టానం..ఇతరుల మాటలు వింటుందని అసంతృప్తికి లోనైన నాని…టీడీపీతో తెగతెంపులు చేసుకున్నారు…ఆ వెంటనే సీఎం జగన్‌ను కలిసి వైసీపీలో చేరారు. ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు.
అన్నను ఓడిస్తానంటున్న తమ్ముడు..
సీఎం జగన్ ఆశీస్సులతో మరోసారి పోటీ చేస్తున్న ఎంపీ నాని… హాట్రిక్‌పై నమ్మకం పెట్టుకున్నారు.కానీ,ఆయన విజయ పరంపరకు బ్రేక్ వేస్తానని టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎంపీగా నాని రెండోసారి గెలిచిన తర్వాత నియోజకవర్గ పరిధిలో టీడీపీ నేతలతో తీవ్రంగా విభేదించడంతో అధిష్టానం చాలా కాలం ముందే చిన్నిని రంగంలోకి దింపింది.నానితో సమానంగా చిన్నికి పార్టీలో ప్రాధాన్యమిచ్చింది.అధిష్టానం అండదండలతో చిన్ని కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేసి..తనకంటూ సొంత గ్రూపు తయారుచేసుకున్నారు.నేతలతో సమన్వయం చేసుకుంటూ అధిష్టానం అండదండలతో నియోజకవర్గ వ్యాప్తంగా పరిచయాలు పెంచుకున్నారు.
మరోవైపు వైద్య శిబిరాలతోపాటు సేవా కార్యక్రమాలతో ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. యువనేత లోకేశ్ యువగళం పాదయాత్ర విజయవంతం చేయడంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు చిన్ని… పార్టీలో తిరుగులేని లీడర్‌గా ఎదిగారు. ఆ ధీమాతోనే టీడీపీ కోటను నిలబెడతానని తొడగొడుతున్నారు.విజయవాడను గెలిచి చంద్రబాబుకు కానుక ఇస్తానని చెబుతున్నారు చిన్ని…
వైసీపీ, టీడీపీలకు కత్తిమీద సామే..
ఇలా ఈ ఇద్దరు అన్నదమ్ములు తగ్గేదేలే అన్నట్లు పోటీ పడుతుండటంతో…. బెజవాడలో రాజకీయ యుద్ధం ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలోని ఆరు నియోజకవర్గాలు గెలుచుకున్న వైసీపీ…. ఈసారి లోక్‌సభ స్థానాన్ని తన ఖాతాలో వేసుకునేలా పావులు కదుపుతోంది. ఐతే, ఈసారి లోక్‌సభతోపాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది టీడీపీ… దీంతో రెండు పార్టీలకు విజయవాడ లోక్‌సభ స్థానం కత్తిమీద సాములా మారింది.
కాంగ్రెస్, కమ్యూనిస్టుల ఓట్లు కూడా కీలకం..
వైసీపీ ఒకవైపు…టీడీపీ,జనసేన,బీజేపీ కూటమి మరోవైపు తలపడుతున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్,కమ్యూనిస్టులు కూడా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్‌తోపాటు కమ్యూనిస్టులు కూడా ఈ లోక్‌సభ పరిధిలో గణనీయంగా ప్రభావం చూపారు.ఇప్పుడు వారు చీల్చే ఓట్లు కూడా ప్రధాన పార్టీల తలరాతలను మార్చబోతున్నట్లు చెబుతున్నారు. దీంతో విజయం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠే ఎక్కువగా కనిపిస్తోంది. ఏదిఏమైనా విజయవాడలో విజయతిలకం దిద్దడం అంత ఈజీ కాదంటున్నారు పరిశీలకులు.మరి ఓటర్లు ఎవరికి జైకొడతారో చూడాలి.
What's Your Reaction?






