పొత్తు వికటిస్తే ఎక్కువగా నష్టపోయేది చంద్రబాబేనా!
స్టూడియో భారత్ ప్రతినిధి
ఈ ఎన్నికలలో తెలుగుదేశంతో పొత్తువలన జనసేనకు ఒరిగే ఉపయోగం పక్కనపెడితే జనసేనతో పొత్తువలన తెలుగుదేశానికే ఎక్కువ ఉపయోగం అనటంలో ఎలాంటి సందేహంలేదు. ఎలాగంటే...
మంచి రోజు అని ముహూర్తం చూసి మరీ,చంద్రబాబు,పవన్ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించటమైతే చేశారుగానీ,పొత్తు ఫలించటం కంటే వికటించే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి.సీట్ల పంపిణీపై ఇటు జనసేన పార్టీలో,అటు - పవన్‌కు అనుకూలంగా మునుపెన్నడూ లేనివిధంగా కన్సాలిడేట్ అయిన - కాపు సామాజికవర్గంలో పెద్దఎత్తున అసంతృప్తి వ్యక్తమవుతోంది.24సీట్లకు మించి ఇవ్వకపోతే జనసైనికులనుంచి,కాపులనుంచి ఓట్ ట్రాన్సఫర్ సంపూర్ణంగా జరగటం అసంభవం అని స్పష్టంగా తెలుస్తోంది.
చంద్రబాబు ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు?
2019 ఎన్నికలలో పార్టీలవారీగా వైసీపీకి 49.95%, టీడీపీకి 39.17%,జనసేనకు 5.53% ఓట్లు వచ్చాయి. ఒక్కచోట మాత్రమే గెలిచి, 6 శాతం ఓట్లు కూడా తెచ్చుకోని జనసేనకు చంద్రబాబు 24 సీట్లు ఇవ్వటం ఒక కోణంలో సమంజసమే. కానీ ఉద్దేశ్యపూర్వకంగా చేశారో, గమనించకపోవటం వల్ల జరిగిందోగానీ, 2019 నాటికి, నేటికి - ఏపీ సామాజిక సమీకరణాలలో చోటు చేసుకున్న ఒక పెద్ద మార్పును చంద్రబాబు పట్టించుకోకపోవటం పొరపాటే.దాదాపు 25 శాతం ఓట్లతో, ఏపీలో ఏ పార్టీ అధికారం చేపట్టటంలోనైనా కీలకపాత్ర పోషించే కాపు సామాజికవర్గం ఇప్పుడు(కూటమి అభ్యర్థుల జాబితా ప్రకటన వెలువడిన క్షణంవరకు) పవన్ వెనక ర్యాలీ అవుతోంది. అవును, 2019 తెలుగుదేశంపై కోపం కారణంగా వైసీపీకి కొమ్ముకాసిన కాపులు ఈసారి పవన్‌కు అండగా నిలబడాలని డిసైడ్ అయ్యారు.పవన్‌కు ఖచ్చితంగా గతంలో కంటే ఓట్లశాతం పెరిగిందని ఉండవల్లి వంటివారు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మరోవైపు తటస్థులలో కూడా పవన్‌పై సానుభూతి ఎంతో కొంత పెరిగింది.కనుక అతనిని కేవలం 6 శాతం ఓట్లు తెచ్చుకున్న జనసేన పార్టీ అధినేతగా కాదు, దాదాపు 25 శాతం ఓటర్ల మద్దతు కూడగట్టగలిగే నాయకుడిగా చూడాలని,రెండు పార్టీలకూ కలిపి 2019లో వచ్చిన 44.70% ఓట్లకు తోడుగా, పెరిగిన కాపు ఓట్లు చేరితే విజయావకాశాలు గణనీయంగా పెరుగుతాయి అనే చిన్న లాజిక్‌ను విజనరీ బాబు ఎలా మిస్ అయ్యారో తెలియటంలేదు.
చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవటానికి కారణం ఏమిటి?
రెండు కారణాలు ఉండి ఉండాలి.ఒకటి - జనసేనకు 30-40 స్థానాలు ఇస్తే పవన్ ఏపీ రాజకీయాలలో ఒక బలమైన శక్తిగా ఎదుగుతాడు అనే అభద్రతా భావానికి గురికావటం. రెండు - పవన్ వెనక కాపులు ర్యాలీ అవుతున్న విషయాన్ని గమనించకకపోవటం. ఈ రెండింటిలో మొదటిది నిజమైతే - నాకు ఒక కన్ను పోయినా ఫరవాలేదు, పక్కవాడికి రెండు కళ్ళు పోవాలి అని కోరుకున్నట్లుగా ఉంది. ఒక వేళ రెండో కారణం నిజమైతే,ఇప్పటికైనా చంద్రబాబు తన తప్పు తెలుసుకుని, నిర్ణయాన్ని సరిదిద్దుకోవటానికి అవకాశం ఉంది.టీడీపీలోని చాలామంది నాయకులు,మెయిన్ స్ట్రీమ్ మీడియాలో,సోషల్ మీడియాలో తటస్థుల ముసుగులో ఉండే కొందరు టీడీపీ అనుకూల విశ్లేషకులు,జర్నలిస్టులు పొత్తుపై ఇలాంటి కామెంట్సే చేస్తుంటారు…పోయినసారి ఒక్కదానిలో గెలవని జనసేనకు 24 ఇవ్వటంకూడా ఎక్కువే,వాళ్ళు అవికూడా గెలవరు అని.పోయినసారే టీడీపీ,జనసేనకు కలిపి 44.70% తెలుసుకోగలిగినప్పుడు ఈ సారి అంతకంటే ఎక్కువే వస్తాయన్నది సింపుల్ లెక్కే కదా! మరి వాళ్ళ ఉద్దేశ్యం - పొత్తులో ఉన్నాకూడా టీడీపీ నుంచి ఓట్ ట్రాన్సఫర్ జరగదనో ఏమో!
జగన్,బాబు,పవన్ లలో గెలుపు ఎవరికి ఎక్కువ అవసరం?
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజుల క్రితం ఈ విషయంలో కుండబద్దలు కొట్టినట్లు సమాధానం చెప్పేశారు.తాను ఓడిపోయినా విచారించను అని,హ్యాపీగా ఫీల్ అవుతానని ఇండియా టుడే సదస్సులో అన్నారు.పవన్ కళ్యాణ్ విషయానికొస్తే, ఓడిపోయినా ఆయనకు పెద్దగా ఫరక్ పడదు.అటు సినిమాలు,ఇటు రాజకీయాలు (ఏది పార్ట్ టైమో,ఏది ఫుల్ టైమో అడగవద్దు) కొనసాగిస్తూ సాగిపోతూ ఉంటారు.చంద్రబాబుకు మాత్రం ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య. ఎందుకంటే, వైసీపీ మళ్ళీ విజయం అంటూ సాధిస్తే ఇటు తెలుగుదేశం పార్టీ పరిస్థితి, అటు చంద్రబాబు - లోకేష్ - ఆయన సామాజికవర్గం పరిస్థితిని ఊహించుకోవటం కూడా కష్టం.ఇప్పటికే జగన్ వారిని కూసాలు కదిలిపోయేటట్లు దెబ్బకొట్టారు.నిండుసభలో ప్రతిపక్ష నేత భార్యకు జరిగిన అవమానం,ల్యాండ్ మైన్ పేలుడుకి కూడా బెదరని చంద్రబాబు లైవ్‌లో భోరుమని ఏడవటం,ఇది చాలదన్నట్లు రాజమండ్రి జైలులో 52 రోజులు గడిపాల్సిరావటం,జగన్ సీఐడీ పోలీసులను ప్రైవేట్ సైన్యంలాగా ఉపయోగించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల టీడీపీ మద్దతుదారులను,కార్యకర్తలను చిత్రహింసలకు గురిచేసిందన్న ఆరోపణలు,వారి సామాజికవర్గంలోని పలువురి ఆర్థికమూలాలను దెబ్బకొట్టటం అందరికీ తెలిసిందే.మరోవైపు,ఇప్పటికే బాబు వయస్సు 74 సం.కు చేరింది.ఐదేళ్ళ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు.కుమారుడికి పార్టీ పగ్గాలను,అధికారాన్ని అప్పజెప్పాలని ఆయన ఉవ్విళ్ళూరుతున్నారు.అందుకే ఈ ఎన్నికలు బాబుకు జీవన్మరణ సమస్యతో సమానం.ఇప్పుడు లోకేష్,చంద్రబాబు దగ్గర నుంచి టీడీపీలోని క్షేత్రస్థాయి కార్యకర్తవరకు అందరి లక్ష్యం ఇప్పుడు ఒక్కటే - ఈ ఎన్నికలలో వైసీపీని పాతాళానికి తొక్కే స్థాయిలో విజయం సాధించటం.సింపుల్‌గా చెప్పాలంటే - వాళ్ళు కోరుకునేది ఆషామాషీ విజయం కాదు - జగన్ ను కోలుకోలేనంతగా చావుదెబ్బ కొట్టే స్థాయి విజయం.
పొత్తువలన ఎవరికి ఎక్కువగా ఉపయోగం?
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో మూడే సంభావ్యతలు ఉంటాయి.సంక్షేమ పథకాల లబ్దిదారులు బలంగా విశ్వసనీయతను కనబరిస్తే వైసీపీకి పూర్తి మెజారిటీ లభించటం ఒక సంభావ్యత. అలా జరిగితే టీడీపీ వాళ్ళు తూర్పుతిరిగి దండం పెట్టటం, వారి సామాజికవర్గంవారు పక్కరాష్ట్రాలకు వలసపోవటం తప్ప చేసేదేమీ లేదు.ఇక రెండో సంభావ్యత- ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా ఉండటమే కాకుండా, జనసేననుంచి, కాపులనుంచి ఓట్ ట్రాన్సఫర్ సంపూర్ణంగా జరిగి ఒంటరిగానే టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం.మూడో సంభావ్యత - టీడీపీకి,వైసీపీకి రెండింటికీ సమాన స్థాయిలో గణనీయమైన స్థానాలు రావటం.ఈ పరిస్థితిలో జనసేన మద్దతుతో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.ఇలా జరిగినా కూడా తెలుగుదేశం విజయం అసంపూర్ణమే అవుతుంది. ఎందుకంటే వైసీపీని పాతాళాని తొక్కాలన్న టీడీపీ కల నెరవేరదు.
కాపుల మనోగతం ఏమిటి?
రాష్ట్రంలో గణనీయమైన సంఖ్యాబలం ఉన్నాకూడా పల్లకి మోసే బోయీలుగానే ఉంటున్నామని కాపులకు ఎంతోకాలంగా లోలోపల అసంతృప్తి ఉంది. ఎప్పుడూ అధికారాన్ని అనుభవిస్తున్న కమ్మ, రెడ్డి సామాజికవర్గాలకు దీటుగా కాపు నాయకుడు ఎవరైనా ఒక బలమైన శక్తిగా ఎదిగి రాజ్యాధికారాన్ని చేపడతాడేమో అని వేయికళ్ళతో ఎదురుచూస్తూ వచ్చారు.2009లో చిరంజీవి తమ కలలను నెరవేరుస్తాడేమో అని ఆశిస్తే, ఆయనకు సొంత మీడియా లేకపోవటం,రాజకీయ అజ్ఞానంతో చేసిన అనేక తప్పులు, కోవర్డుల కారణంగా విఫలమయ్యారు. 2014లో రాజకీయాలలో ప్రవేశించిన పవన్, టీడీపీకి మద్దతు ఇవ్వమని ప్రచారం చేయటంతో కాపులు ఆ పార్టీకే వేశారు. అప్పటికి జగన్ బలంగా ఉన్నాకూడా(2014లో వైసీపీ గెలిచిన స్థానాలు 67), కేవలం కాపుల మద్దతు కారణంగానే టీడీపీ(102 స్థానాలు) అధికారంలోకి రాగలగింది. అయితే 2019లో ఎన్నికలలో బరిలో దిగిన పవన్‌కు కాపులు మద్దతు ఇవ్వలేదు. ఆ సమయానికి కాపులు తెలుగుదేశంపై కోపంతో రగిలిపోతూ ఉన్నారు. దానికి కారణం - కాపులలో ఒక గౌరవప్రదమైన ఇమేజ్ (ఆ ఎన్నికల సమయానికి ఉంది, తదనంతరకాలంలో వైసీపీ తొత్తుగా వ్యవహరించటంతో అది కోల్పోయారు) ఉన్న ముద్రగడను టీడీపీ ప్రభుత్వం ఒక తీవ్రవాదిని బంధించినట్లు నిర్బంధించి, ఆడవారితో సహా ఆ కుటుంబం మొత్తాన్నీ వేధింపులకు గురిచేసిందని వారు బలంగా నమ్మటం. అలాంటి తెలుగుదేశానికి పవన్ మద్దతిస్తున్నట్లు కాపులు భావించారు.ఎన్నికల సమయంలో - పవన్ తన ప్రసంగాలలో తెలుగుదేశాన్ని విమర్శించకపోవటం,అతని వ్యవహారశైలి చూస్తే వారితో ఒప్పందమేదో కుదుర్చుకున్నట్లుగా ఉండటంతో అతను ఒక సీరియస్ పొలిటీషియన్ అని కాపులకే అనిపించలేదు. కాపు యువతలోని కొద్దిమంది తప్పితే అత్యధికశాతం వైసీపీకే వేశారు.
అందుకే నాడు కాపులు ఫలితాన్ని ప్రభావితం చేయగల స్థాయిలో బలం ఉన్న నియోజకవర్గాలలో కూడా జనసేన గెలవలేకపోయింది. భీమవరం నియోజకవర్గంలో సాక్షాత్తూ పవన్ ఓడిపోవటమే దానికి నిదర్శనం.కానీ, ఈ ఐదేళ్ళలో పవన్ పట్ల కాపుల వైఖరిలో మార్పు వచ్చింది. అతను దారుణమైన ఓటమికి గురైనా కూడా తాను అనుకున్న సిద్ధాంతానికి కట్టుబడి రాజకీయాలలో నిలబడి ఉండటం, సొంత డబ్బుతో పార్టీని నడిపించటం, కౌలు రైతులకు 30 కోట్ల రూపాయలు అందజేయటం, సమస్యలపై ఉద్యమించటం, జగన్ ప్రభుత్వ వైఫల్యాలను నిర్భయంగా ఎదిరించటంతో అతనికి కాపులలో మద్దతు గణనీయంగా పెరిగింది. అది ఎంతమేరకు పెరిగిందంటే, వంగవీటి రంగా తర్వాత ఆ స్థాయిలో కాపులు కన్సాలిడేట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కాపు ఓటర్లు ఎలా ఉన్నారంటే - ఒక ఇంట్లో భార్యా భర్తలు, ఇద్దరు పెద్ద పిల్లలు ఉండి - భర్త ఒకవేళ వేరే పార్టీ నాయకుడో, కార్యకర్తో అయినా కూడా మిగిలిన మూడు ఓట్లూ జనసేనకు పడేటంత స్థాయిలో ఉంది. ఇది 24 సీట్ల ప్రకటన వెలువడేవరకు ఉన్న పరిస్థితి.కానీ ఇప్పుడు వారి అంచనాలు తల్లకిందులయ్యాయి.ఆ ప్రకటనతో కాపులు నవనాడులూ కుంగిపోయినట్లుగా అయ్యారు.కేవలం తెలుగుదేశాన్ని గద్దెనెక్కించటానికి కంకణం కట్టుకున్నట్లుగా పవన్ ప్రవర్తిస్తున్నాడని కారాలు,మిరియాలు నూరుతున్నారు.సాక్షాత్తూ పార్టీ అధినేతే జైలుకు వెళ్ళిపోయి,పార్టీ అచేతన స్థితిలో ఉండి,శ్రేణులన్నీ నిస్తేజమైపోయిన తరుణంలో ఆ పార్టీకి అండగా నిలబడ్డ పవన్‌కు ముష్టి వేసినట్లు 24 సీట్లు ఇవ్వటం అన్యాయమని చంద్రబాబును దుమ్మెత్తిపోస్తున్నారు. 2014లో పవన్ మద్దతు టీడీపీ గెలుపుకు ఎంతో ఉపయోగపడినా కూడా, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టటంతో అతనిపై వారు తీవ్ర విమర్శలు చేశారని,ఇప్పుడు 2023లో కూడా అలాగే పార్టీ నిస్తేజంలో ఉన్నప్పుడు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిన పవన్‌ను నమ్మకద్రోహం చేశారని కాపులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా, 24 నుంచి పెరగకపోతే కాపుల ఓట్లు టిడిపికి పడటం అసాధ్యంగానే కనిపస్తాంది.
పార్టీని సొంత దుకాణంలా నడుపుతున్నారని పవన్ పై ఆరోపణలు వినిపిస్తున్నాయి...
మీకు ఒక వస్తువు అవసరం బాగా ఉంది. దానిని కొనటానికి వెళ్ళినప్పుడు - ముందుగానే ఆ వస్తువు మీకు ఎంత అవసరమో అమ్మేవాడికి చెబితే ఏమవుతుంది? మీరు వాడికి లోకువ అయిపోతారు.మీ బలహీనతను సాధ్యమైనంత ఎక్కువగా పిండుకోవాలనుకుంటాడు,కొండెక్కి కూర్చుంటాడు.ఇక్కడ వల్నరబుల్ పరిస్థితిలో ఉన్నది టీడీపీ, కానీ పవన్ ఏమో తానే వల్నరబుల్ అన్నట్లుగా ఫీల్ అయిపోయి తన బార్గెయినింగ్ పవర్‌ను ముందుగానే పోగొట్టుకున్నాడు.వైసీపీ ఓటమికోసం ఎంతగానైనా ఎడ్జస్ట్ అవుతానని కూడా ముందుగానే మీడియాలో ప్రకటించేశాడు.తనకు లోలోపల మూడోవంతు(33.33శాతం) సీట్లు తీసుకోవాలనే ఉన్నప్పటికీ(ఒంటరిగా పోటీ చేసినా 40 స్థానాలలో జనసేన గెలవగలదని ఈ మధ్య చెప్పాడు), 13 శాతానికి ఒప్పుకుని బయటకు వచ్చాడు.పవన్ యూఎస్‌పీ అతని నిజాయితీ, చిత్త శుద్ధి, ఎంతో కొంత సమాజాన్ని ఉద్ధరించాలనే తపనవంటి గుణాలు.
యువత,తటస్థులలో అతనికి బాగా అభిమానులు ఉండటానికి కారణం అదే. అయితే ఆ మూడు గుణాలు ఎంత ఉన్నాయో దానికి రెండింతలుగా అనేక లోపాలు ఉన్నాయి. 2019లో తన ఓటమికి కారణాలు ఏమిటో ఇప్పటికీ అతనికి తెలియదని ఇటీవల వ్యాఖ్యలవలన తెలుస్తోంది. తక్కువ సీట్లకే పొత్తుకు ఒప్పుకున్నారన్న విమర్శపై స్పందిస్తూ, నాడు తనను గెలిపించిఉంటే ఎక్కువ అడగలిగి ఉండేవాడిని అని, గెలిపించలేదు కనుక తనను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని అంటూ 2019 ఓటమికి ఓటు వేయని జనాన్నే బాధ్యులను చేస్తున్నాడు. ఏ రంగంలోనైనా ఒక మనిషి వైఫల్యాన్నిఎదుర్కొన్నప్పుడు, దానికి కారణాన్ని తెలుసుకుని సరిదిద్దుకుంటే మెరుగుపడతాడు. పవన్‌కు ఐదేళ్ళు గడిచినా తన వైఫల్యానికి కారణం తెలియలేదంటే అతనిని ఏమనుకోవాలి! తన చుట్టూ భజన చేసే ఒక కోటరీ ఉంటుంది.దానిని దాటటానికి జనానికీ అవకాశం ఉండదు, కోటరీని దాటి అతనూ జనం నాడి తెలుసుకోడు.పవన్ ఏం చేసినా గుడ్డిగా సమర్థించే కొద్ది మంది జనసైనికులు, మరికొంతమంది విద్యాధికులు తప్పితే ఆపార్టీలో ని సగటు కార్యకర్తలు, పార్టీకి సానుభూతిపరులైన సగటు అభిమానులు పవన్‌పై అసంతృప్తిగా ఉన్నారు.
పొత్తు ఫలించే అవకాశం ఉందా?లేదా?
గత ఎన్నికల్లో గోదావరి జిల్లాలలో ఎక్కడ కూడా 30 వేలకు తగ్గకుండా జనసేన ఓట్లు సాధించింది. పవన్ పోటీ చేసిన భీమవరంలో జనసేనకు 62 వేలు, టీడీపీకి 54 వేలు ఓట్లు వచ్చాయి.విజయం సాధించిన వైసీపీకి 70 వేల ఓట్లువచ్చాయి.
అంటే, టీడీపీ,జనసేన కలిస్తే వచ్చే ఓట్లు వైసీపీకంటే దాదాపు నలభై వేలు ఎక్కువ. తూర్పు గోదావరి జిల్లాను మొత్తంగా చూత్తంగా చూస్తే టీడీపీకి 36.76 శాతం, జనసేనకు 14.84, వైసీపీకి 43.48 శాతం ఓట్లు పోలయ్యాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి 36.30, జనసేనకు 11.68, వైసీపీకి 46.35 ఓట్లు పడ్డాయి. కనుక పొత్తు ఫలిస్తే ఆ రెండు జిల్లాలలో కూటమి దాదాపుగా క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉండేది. కృష్ణా, గుంటూరు జిల్లాలలో కూడా జనసేనకు 2019లో గణనీయంగానే, వరసగా 5.26%, 5.98% ఓట్లు వచ్చాయి కాబట్టి అక్కడ కూడా కూటమికి అత్యధిక స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాపు సామాజికవర్గం సంఖ్యాపరంగా, ఆర్థిక పరంగా బలంగా కేంద్రీకృతమై ఉన్న ఉభయ గోదావరి జిల్లాలలో 25, మిగిలినచోట్ల10-15 స్థానాలు ఇచ్చి, క్యాబినెట్‌లో కీలక పదవులు ఇస్తాము అని చంద్రబాబు ప్రకటించి ఉంటే ఓట్ ట్రాన్సఫర్ సంపూర్ణంగా జరిగేది,ఇరు పార్టీలూ విన్-విన్ పరిస్థితిలో ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించటంలేదు.
ఒకవేళ చంద్రబాబు ఒప్పుకున్నా, లోకేష్ ఒప్పుకోడని అంటున్నారు. ఎందుకంటే మున్ముందు పవన్ తనకు పక్కలో బల్లెం అవుతాడని అతని భయమని జనసైనికుల వాదన. పవన్ చంద్రబాబును జైలులో పరామర్శించటానికి వెళ్ళి,బయట మీడియాతో మాట్లాడే సమయంలో లోకేష్ బాడీ లాంగ్వేజ్‌ను జనసైనికులు దీనికి నిదర్శనంగా చెబుతున్నారు.ఏదిఏమైనా ఓట్ ట్రాన్సఫర్ అసంపూర్ణంగా జరగటం, తద్వారా వైసీపీకి మేలు చేకూర్చటానికే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే బీజేపీ ఈ కూటమితో కలవదనే వార్తలు వస్తున్నాయి. అలా జరిగితే గ్లాసుకు మరికొన్ని స్థానాలు ఇచ్చే అవకాశం ఉంది. కానీ, దానికి లోకేష్ ఒప్పుకుంటాడో, లేదో చూడాలి.
(ఇందులో వ్యక్తీకరించిన అభిప్రాయాలన్నీ స్టూడియో భారత్ తో గాని,రచయిత వారితో గాని ఏకీభవించనవపరం లేదు.ఇది అవగాహన కోసం మాత్రమే..)
What's Your Reaction?