కుమార స్వామి చరిత్ర

స్టూడియో భారత్ ప్రతినిధి

Oct 9, 2023 - 09:29
 0  29
కుమార స్వామి చరిత్ర

కుమార స్వామి చరిత్ర

 సుబ్రహ్మణ్య స్వామి వారు అవతారములను స్వీకరించారు. 

ఇందులో ప్రధానమయిన అవతారం జ్ఞాన సంబంధర్ ఒకటి.

తిరుజ్ఞాన సంబంధర్:

జ్ఞాన సంబంధర్ గురించి వినినంత మాత్రం చేత పాపరాశి దగ్ధం అవుతుంది. 

ద్రవిడ దేశంలో శీర్గాళి అనే ఊరు పరమ పావనమయిన క్షేత్రం.అక్కడ తోణిపురీశ్వర దేవాలయం ఉంది. 

ఆ ఊరిలో శివ పాద హృదయుడు అనే ఒక మహానుభావుడు ఉండేవాడు.ఆయన భార్య పేరు భగవతి.వారికి పరమాత్మ అనుగ్రహం చేత ఒక పిల్లవాడు పుట్టాడు.ఆయన మూడు సంవత్సరముల వయసు బాలుడయ్యాడు.

ఒకనాడు శీర్గాళిలో తండ్రి అయిన శివ పాద హృదయుడు దేవాలయంలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వస్తానని చెప్పి బయలుదేరుతున్నాడు.  

నేనూ వస్తాను అని ఏడుపు మొదలు పెట్టాడు పిల్లవాడు.నాయనా,నాతో నీవెందుకు,వద్దు అన్నాడు తండ్రి.పిల్లవాడు వినలేదు.అపుడు పిల్లవాడిని ఎత్తుకుని ఆయన దేవాలయమునకు వెళ్ళాడు.  

ఆ ఆలయంలో పిల్లవాడిని కూర్చోబెట్టి తటాకంలో స్నానం చేయడానికి వెళ్తూ మంటపంలో కూర్చోబెట్టి వెళ్ళాడు.పిల్లవాడికి తండ్రి కనపడలేదు.భయం వేసింది.అపుడు వాడు శిఖరం వంక పార్వతీ పరమేశ్వరులను చూసి అమ్మా నాన్నా అని ఏడుస్తున్నాడు. 

వెంటనే శంకరుడు కదిలిపోయాడు.పార్వతి వైపు చూసి పిల్లవాడు ఏడుస్తున్నాడు పద అన్నాడు.అపుడు ఇద్దరూ కలిసి గబగబా పిల్లవాడి దగ్గరకు వచ్చారు.పిల్లవాడు ఎత్తుకుని లాలించినా ఏడుపు ఆపలేదు.ఒక బంగారు పాత్రను తేసుకుని నీ స్తన్యమును ఆ పాత్రలోకి పట్టి పిల్లవాడిత్రాగించు వాడు ఏడుపు ఆపుతాడు అన్నాడు పరమశివుడు.  

అపుడు పార్వతీదేవి నాపాలు తాగితే మీ జ్ఞానం వచ్చేస్తుంది.మహాజ్ఞాని అయిపోతాడు పట్టమంటారా?అని అడిగింది. 

పిల్లవాడు మనలను నమ్మి అమ్మా నాన్నా అని ఏడ్చాడు.పాలు త్రాగించు అన్నాడు.అందుకే జ్ఞాన సంబంధర్ ఎక్కడికి వెళ్ళినా ఆయనను నమ్మి ఏడ్చినవాడు అని పిలిచేవారు 

మనమూ ఏడుస్తాము.కానీ ఆ ఏడుపులో భగవంతుడు ఉన్నాడని నమ్మకం ఉండదు.శంకరుడు అలా చెప్పిన పిదప పాలు పట్టి పిల్లవాడి చేత త్రాగించింది పార్వతీ దేవి.పాలను త్రాగేసి మూతి తుడుచుకుంటున్నాడు.తండ్రి సరోవరంలోంచి మెట్లు ఎక్కుతున్నాడు. 

పార్వతీ పరమేశ్వరులిద్దరూ అంతర్థానం అయిపోయారు.ఆయన పిల్లవాని దగ్గరికి వచ్చి నాయనా ఎంత పనిచేశావురా ఎవరో ఇచ్చిన పాలు తాగేశావా”అన్నాడు.అపుడు పిల్లవాడు పత్తికం మొదలుపెట్టాడు. పత్తికం అంటే దండకం లాంటిది.మూడేళ్ళ పిల్లవాడు. భక్తులందరూ గుమిగూడి పత్తికం విని ఆశ్చర్యపోయారు.

తండ్రి పరవశించి పోయి భగవత్ దర్శనం చేసుకుని ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాడు 

అసలు ఇందులో ఉన్న చమత్కారం రహస్యం ఏమిటంటే ఆ అంశాలో పుట్టినటువంటి పిల్లవాడు లోకంలో శివభక్తిని ప్రచారం చెయ్యడానికి వైదికమయిన మార్గమును ఆ రోజులలో నలిపి వేస్తున్న వాళ్ళ దురాచారములను ఖండించదానికి పుట్టిన సుబ్రహ్మణ్యుడు.

ఆనాడు పార్వతీదేవి స్తన్యం ఇచ్చే అదృష్టం తిన్నగా కలగలేదు.కృత్తికల ద్వారా ఇవ్వవలసి వచ్చిందే అని అమ్మవారికి చిన్న బాధ ఉండిపోయింది.శంకరుడు గుర్తు పెట్టుకుని ఆ కోర్కె ఇప్పుడు తీర్చాడు.  

అమ్మవారి పాలు జ్ఞాన సంబంధర్ పిల్లవాడుగా త్రాగేశాడు.అందుకని ఆయనను తిరుజ్ఞాన సంబంధర్ అన్నారు.

నయనార్ల పరంపరలో తిరుజ్ఞాన సంబంధర్ మహాభక్తుడు.ఆయన తొలి కావ్యాన్ని స్వామి సన్నిధిలోనే రాయడం విశేషం.

పరమేశ్వరుడు భక్తులకు పెన్నిధి అనే అంశాన్ని ఈ కథ నిరూపిస్తుంది. శివనేశ్వర్ అనే భక్తుని కుమార్తె పూంపవై. ఆ బాలిక రోజు శివపూజలో తరించేది. ఒకరోజు పూలు కోస్తుండగా పాము కాటుతో మరణిస్తుంది. భగవంతుడినే నమ్ముకున్న శివనేశ్వర్ ఆమె అస్థికలను ఒక కుండలో వుంచుతాడు.

సంబంధర్ విశిష్టమైనటు వంటి అనేక శైవ క్షేత్రాలను దర్శిస్తూ,'తిరువట్టూరు' చేరుకుంటాడు. 

సంబంధర్ అక్కడకు రాగా శివనేశ్వర్ తన దీనగాధను విన్నవించి ఆ కుండను ఆయన ముందువుంచుతారు.  

పరమభక్తుడైన సంబంధర్ కపాలీశ్వరుని ఆర్థ్రతతో ప్రార్థిస్తాడు.మట్టిట పున్నై అనే గానంలో పరమేశ్వరుని పండగలను వివరిస్తూ బాలిక శివుని పర్వదినాలను ఎలా వీక్షించకుండా వుండగలదు అని వేడుకుంటాడు.

దీనదయాళుడైన ఆ శంభునాథుడు ఆ బాలికకు తిరిగి ప్రాణం పోస్తాడు.ఒక్కసారిగా కుండలు పగిలి అస్థికల నుంచి బాలిక బతికొస్తుంది.కృతజ్ఞతాభావంతో శివనేశ్వర్ సంబంధర్కు ఆమెను ఇచ్చి వివాహం చేయాలనుకుంటాడు. 

అయితే తాను జీవితాన్ని తిరిగి ఇచ్చాను కాబట్టి తండ్రిలాంటి వాడినని సున్నితంగా తిరస్కరిస్తాడు.పూంపవై తన శేషజీవితాన్ని భగవంతుని సన్నిధానంలో గడిపి శివసాయుజ్యం పొందింది.

తిరుజ్ఞాన సంబంధర్ ఊహ తెలిసిన నాటినుంచి శివారాధనపట్ల ఆసక్తిని చూపించాడు.అనుక్షణం శివుడిని దర్శిస్తూ...స్పర్శిస్తూ... పూజిస్తూ తరించేవాడు.శివనామ స్మరణలో పడి ఆకలిదప్పుల గురించి మరిచిపోయేవాడు.ఆయన పిలిస్తే శివుడు పలుకుతాడని చెప్పుకునే వారు.అయితే ఆయన మాత్రం ఓ సాధారణ భక్తుడిగానే నిరాడంబరంగా కనిపించేవాడు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow