159 ఏళ్ళ క్రితం...బందరులో 30 వేలమంది ప్రజలు జల సమాధి అయ్యారు
స్టూడియో భారత్ ప్రతినిధి
159 ఏళ్ళ క్రితం...బందరులో 30 వేలమంది ప్రజలు జల సమాధి అయ్యారు
1864 నవంబర్ 1 వ తేదీన ఘోర దుర్ఘటన సంభవించింది. ఒకటి కాదు రెండు కాదు 30 వేల ఆత్మలు బందరు పట్టణాన్ని కబళించిన ఉప్పెనలో భీకర సముద్ర ఘోషలో నిశ్శబ్దంగా ఐక్యమయ్యాయి..
అప్పటికే.. నౌకా వ్యాపారంలో ఒక వెలుగు వెలుగుతూ అగ్రగామిగా, దక్షిణ భారతదేశం లోనే ముఖ్య ఓడరేవు ప్రాంతంగా విరాజిల్లుతున్న బందరు ఆ భయంకర ఉప్పెనలో చిగురుటాకులా వణికిపోయింది. ఆ ఉప్పెన కారణంగా బందరు సముద్రతీరం అంతా భారీ ఇసుకమేటలు వేయడంతో నాటి నుండి బందరు నౌకాయానంకు చరమగీతం పాడినట్లైంది.. వాణిజ్య వ్యాపారం కుంటుబడింది ఓడల రాకపోకలు మహా కష్టమైంది..నేటికీ ఆ ఇసుకమేటలు బందరు పోర్టుకి శాపం అయిందని తద్వారా బందరు అభివృద్ధి కుంటుపడిందని చరిత్ర పరిశీలించి చెప్పవచ్చు. ప్రస్తుతం బందరు పోర్టు నిర్మాణానికి ప్రస్తుత ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అందరూ ఒప్పుకోవాల్సిందే... ఇప్పుడు నిర్మాణ పనులు జరుగుతున్న పోర్ట్ ఏరియా ప్రాంతంలో సముద్ర తీరంలో లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకమెటను డ్రెడ్జింగ్ ప్రక్రియను వేల కోట్లరూపాయలతో తొలగిస్తున్నారు.. గత ప్రభుత్వాలు ఇసుక మేటలను సాకుగా బందరు పోర్టు నిర్మాణానికి మొండి చేయి చూపించేవారనేది నగ్నసత్యం. అంతటి ఇసుక మేట తీరంలో ఏర్పడడానికి 1864 నవంబర్ ఒకటవ తేదీన వచ్చిన ఉప్పెన తాలూకా ప్రభావమే.
సరిగ్గా...159 సంవత్సరాల కిందటి నాటి బందరు ఉప్పెన గురించి మనలో చాలా మందికి తెలియదు. రక్తాక్షి నామ సంవత్సరం1864 నవంబర్ 1 వ తేదీన బందరులో భీకర సముద్ర కెరటాలు 13 అడుగుల ఎత్తున ఎగసిపడి ,780 చదరపు మైళ్ళ పరిధిలో ఆ ఉప్పెన విస్తరించి ప్రాణ..ఆస్తి తీవ్ర నష్టం కల్గించింది . నాడు రెవెన్యూ రికార్డుల ప్రకారం బందరు పట్టణంలో 65 వేల మంది జనాభా ఉండగా, అందులో 30 వేల మంది తమకేమి జరుగుతుందో తెలిసేలోపు ఆ భయంకర కాళరాత్రిలో జలసమాధి అయ్యారు. ఆనాడు సముద్రం ఉగ్ర రూపం దాల్చి చెలియల కట్టను దాటి,17 మైళ్ళు ఊళ్ళపై ఒక్కసారిగా విరుచుకుపడింది, జనావాసాలను ముంచివేసింది. మచిలీపట్నం నుంచి చల్లపల్లి వెళ్లే రోడ్డులో ఉండే నేటి కాలేఖాన్ పేట ప్రాంతం లోని శివగంగ బ్రాహ్మణ అగ్రహారంలోని 700 మంది ప్రజలు నివసించేవారని ఉప్పెన అనంతరం 630 మంది సముద్రపు రాకాసి అలలలో కొట్టుకుపోయి కేవలం 70 మంది మాత్రమే అక్కడ మిగిలేరని బ్రిటిష్ వారు చరిత్రలో లిఖించారు. అక్కడకు సమీపంలో ఉన్న చింతగుంటపాలెంలో పురుషోత్త సోమయాజి శర్మ అనే ఒకాయన సముద్ర కెరటాలకు ఎక్కడికో కొట్టుకొనిపోయి ఒక తాటిచెట్టు మొవ్వలో చిక్కుకొని తర్వాత రోజున తాడిచెట్టు దిగివచ్చినట్లు నాడు ప్రజలు కథలు కథలుగా చెప్పుకొనేవారు. నాటి బందరులో కోటావారితుళ్ళా సెంటర్ పాత దుర్గామహల్ (ప్రస్తుత యాక్సెస్ బ్యాంకు) ఉన్న ప్రాంతంలో శ్రీ కాండ్రేకుల జోగి జగన్నాధ పంతులు గారి మేడ ( డిసెంబర్ 26 వ తేదీ 1988 వరకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంగా కొనసాగింది. దివంగత శాసనసభ్యులు వంగవీటి మోహన రంగా హత్య అనంతరం జరిగిన అల్లర్లలో ఈ భవనానికి కొందరు ఆ పురాతన మేడకు నిప్పు పెట్టి తగలబెట్టారు ) ఆ ఉప్పెన రాత్రి వందమందికి పైగా ప్రజలు ఆ భవనంలో తల దాచుకొని తమ ప్రాణాలను రక్షించుకొన్నారు.
ఆనాటి జిల్లా కలెక్టర్ బ్రిటిష్ అధికారి థారన్ హిల్ ఉప్పెన అనంతరం చేసిన సేవలు చిరస్మరణీయం.ఆయన ఆధ్వర్యంలో ఆంగ్లేయ అధికారులు పొలిసు సిబ్బందితో కలసి కొన్ని బృందాలుగా ఏర్పడి పట్టణమంతా పడి ఉన్న శవాల గుట్టలను ..పశువుల కళేబరాలను భూమిలో పూడ్చి పెట్టారు. 1843 లో ఎడ్మండ్ షార్కి దంపతులు దక్షిణ భారతదేశంలోనే తొలి బాలికల పాఠశాలను మచిలీపట్నంలో స్థాపించారు. పేద పిల్లలకు హాస్టల్ వసతి కూడా అప్పట్లోనే ఏర్పరిచారు. 1864 నవంబర్ ఒకటో తేదీన సంభవించెను ఘోరమైన ఉప్పెనలో తమ పాఠశాలకు చెందిన 30 మంది బాలికలు సముద్రపు నీటిలో హాస్టల్ గదిలో మునిగిచనిపోగా.. వారినందరిని నేడు షార్కి కాలనీగా పిలవబడుతున్న ఆ సమీపంలో ఖననం చేశారు. ( అది ప్రస్తుతం రైలుపేట ఎలిమెంటరీ పాఠశాల సమీపంలో వైస్సార్ మునిసిపల్ పార్కుగా నేడు అక్కడ అత్యంత సుందరంగా రూపొందించబడింది ) అలాగే పట్టణ పొలిమేర్లలో ఖనన కార్యక్రమానికి నోచుకోని అనేక శవాలను పీక్కుతినేందుకు వందలాది రాబందులు గుంపులు గుంపులుగా ఆకాశం నుంచి కిందకు వాలిన భీకర దృశ్యాలు చూసి ఎందరో చలించిపోయారు. ఇంతటి ఉప్పెనలో సైతం నాడు బతికిన కుక్కలు శవాహారంకు అలవాటుపడ్డాయట ... నేడు ఆనందపేట సమీపంలో ప్రస్తుత డీమార్ట్ పక్కన ఉన్న సెయింట్ మేరీస్ చర్చి ఆ ఉప్పెన విలయతాండవంకు సజీవసాక్ష్యంగా నిలిచింది. అక్కడ సముద్రపు నీరు చర్చి గోడలు ఎనిమిది అడుగుల మేరకు ప్రవహించిందని నాటి తరం చెప్పుకొన్నారు.. చర్చి వెలుపల గోడల ఎనిమిది అడుగులు ఎత్తున ఆ ఉప్పునీటి చారిక ఇప్పటికీ స్పష్టంగా కనబడుతుంది. కొన్ని వందలసార్లు సున్నం వెలుపల చర్చి గోడలకు వేసినప్పటికీ జాగ్రత్తగా పరిశీలిస్తే నేటికీ ఆ ఘోర దుర్ఘటన తెలియజేస్తూ గోడ పై ఒక గీత కనబడుతూనే ఉంటుందని పలువురు అంటుంటారు.
ఉప్పెన అనంతరం బందరు పరిసర ప్రాంతాలపై సముద్రపు నీరు ప్రవహించిన కారణంగా వ్యవసాయ భూములు చౌడు బారిపోయాయి. నూతులలో తీయని నీరు సైతం ఉప్పునీరుగా మారి పోయింది. నాడు ప్రజలకు తాగునీరు దొరకడం ఎంతో కష్టమైంది. అప్పట్లో కొందరు వ్యాపార వర్గాలు తాగునీటికోసం 17 వేల రూపాయలు విరాళంగా సేకరించి జిల్లా కలెక్టర్ థారన్ హిల్ కు అందించారు. ఆయన మరో 30 వేల రూపాయలను ప్రభుత్వం నుంచి సమీకరించి నాటి నాగులేరు( ఖాలేఖాన్ పేట మంచినీటి కాలువ ) నుంచి కోనేరు సెంటర్ వరకు భూగర్భ పైప్ లైన్ నిర్మించారు. అప్పట్లో టౌన్ ప్రజానీకo మొత్తం తాగునీటి అవసరాలను తీర్చింది నాటి కోనేరు. నేడు కొందరు మూర్ఖులు ఆ ప్రాంతాన్ని బహిరంగ మూత్ర విసర్జన ప్రాంతంగా ఎన్నుకోవడం దురదృష్టకరం.
ఆనాటి ఉప్పెనలో వేలాదిమంది జలసమాధి కాగా,అంతటి ఘోర విషాదంలోనూ కొందరు స్వార్ధపరులు ధనమే పరమావధిగా మృతుల శరీరాలపై బంగారు ఆభరణాలు సేకరించే పనిలో నిమగ్నమైయ్యారంట . వీరు బస్తాల కొద్ది బంగారం శవాలపై సేకరించి వాటిని కరిగించి.. తర్వాత వాటిని కరగబెట్టి బంగారు ఇటుకలుగా మార్చి పట్టణంలోనే అత్యంత ధనవంతులుగా పైపైకి ఎదిగిపోయారని అప్పట్లో వృద్ధ తరం ప్రజలు తమ వారసులకు చెప్పారు అంతేకాక, మరో కథ కూడా నాడు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఉప్పెనలో చనిపోయినవారి శాపం తగిలిన కారణంగా ఆనాడే టన్నులకొద్ది బంగారం సేకరించిన ఒక వ్యక్తి కుటుంబంలో మూడు తరాల వరకు ఒక వింత ఘటన కొనసాగిందంట. స్వార్థ శునకం మాదిరిగా కనకం మృతులపై నుంచి సేకరించినవాడికి అప్పట్లో భోజనం చేస్తుంటే కంచంలో అన్నం పురుగులుగా మాదిరిగా లుకలుక లాడుతూ కనిపించేదని దాంతో కళ్ళకు గంతలు కట్టుకొని బలవంతన ఆహరం తీసుకొనేవాడని ఆనాటి పెద్దలు తమ పిల్లలకు పాపపు సొమ్ము ఎలా చేస్తుందో తెలియచెబుతూ ఈ ఉదాహరణ చెప్పేవారు.
ఈ ఉప్పెన తీవ్రతకు బీతిలిన ఎందరో బందరును విడిచి వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. ముఖ్యంగా నాటి బ్రిటిష్ పాలకులు బందరు పట్టణంపై పెంచుకున్న ఆశలను పూర్తిగా వదులుకొన్నారు. తమ బ్రిటిష్ స్థావరాలలో ప్రాణ ఆస్తి నష్టం అధికం కావడంతో తమ మకాన్ని మద్రాస్ కు తరలించారు.
బందరు బంగారు చరిత్రను మార్చివేసిన ఆనాటి విషాద ఘటనను ఏ ఒక్కరు గుర్తు చేసుకోకపోవడం ఎంతో బాధాకరం. పరాయి పాలకులైన ఒక అధికారి తన కుటుంబాన్ని కోల్పోయాడు.. తన కుటుంబ సభ్యుల ఆత్మలను అలాగే నాటి ఉప్పెనలో మృతి చెందిన 30 వేల ఆత్మలకు దేవుడు శాంతి కలిగించాలని కోరుతూ బందరు కోట రోమన్ కాథలిక్ మిషన్ సెమెట్రీ లో ఒక భారీ స్థూపం నిర్మించారు. నేటికీ ఆ నిర్మాణం అక్కడ ఏర్పరిచిన శిలాఫలకం మీద రాతలు నాటి కడలి చేసిన భీకర నృత్యాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది. వచ్చే ఏడాదికి 160 సంవత్సరాలకు ఆ విషాద ఘటన చేరుకుంటుంది. మన పూర్వీకుల దారుణ మరణాన్ని స్మరించుకుంటూ.. నేటి తరానికి ఆ ఘోరాన్ని తెలియజేసే సాంప్రదాయం ఎక్కడా కనపడదు. 160 ఏళ్ల క్రితం నాటి ఉప్పెనలో బతికే బయటిపడ్డ 30 వేలమంది ప్రజలున్న మచిలీపట్నం జనాభా నేడు రెండు లక్షల మంది ఈ పట్టణంలో పలు రకాలుగా అభివృద్ధి చెందారు. అయితే తమ ముత్తాతలు పడిన అవస్థను గుర్తు చేసుకుంటూ పట్టుమని పదిమందైనా ఆ ప్రాంతానికి వెళ్లి 30 వేలమంది ఆత్మలకు ఒక నివాళి ప్రకటించడమో.. రెండు కన్నీటి చుక్కలు విదల్చలేని స్థితిలో ఉన్నారు.1864 నవంబర్ ఒకటో తేదీన సంభవించిన ఘోరమైన ఉప్పెనను గుర్తుచేస్తూ సజీవసాక్షిగా నిలిచిన ఆ స్తూపం ముందు ఒక్క గులాబీపూవ్వి అయినా ఉంచకపోవడం.. చరిత్రను విస్మరించడం ఎంతో బాధాకరం..
What's Your Reaction?