తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి వివాదం: సీఎం చంద్రబాబు ఆరోపణ మాజీ సీఎం జగన్ ఏమన్నారంటే..

Sep 21, 2024 - 16:03
 0  70
తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి వివాదం: సీఎం చంద్రబాబు ఆరోపణ మాజీ సీఎం జగన్ ఏమన్నారంటే..

తిరుమల లడ్డూ వివాదం అంతకంతకూ ముదురుతోంది.జాతీయస్థాయిలో ఇది చర్చనీయాంశంగా మారింది.వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లడ్డూ తయారీలో స్వచ్ఛమైన నెయ్యికి బదులు ‘యానిమల్ ఫ్యాట్’ కలిసిన నెయ్యి ఉపయోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించడంతో వివాదం మొదలైంది.దీనిపై మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. టీటీడీ ఈవో శ్యామలరావు కూడా మాట్లాడారు.చంద్రబాబు తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే నెయ్యి నాణ్యతపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు.జూన్ 16న టీటీడీ ఈవోగా తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత స్థానిక సిబ్బంది నుంచి సమాచారం సేకరించగా..నెయ్యి నాణ్యత బాలేదని వాళ్లు చెప్పారని శ్యామలరావు తెలిపారు.మరోవైపు,జూన్,జులైలో టీటీడీకి నెయ్యి సరఫరా చేశామని,ఆ నెయ్యిలో ఎలాంటి‌ కల్తీ జరగలేదని చెన్నైకి చెందిన ఏఆర్ డెయిరీ తెలిపింది.

మాజీ సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే..

 

వంద రోజుల పాలనా వైఫల్యాల మీద నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం చంద్రబాబు తిరుమలలో కల్తీ నెయ్యి ఆరోపణలు చేస్తున్నారని జగన్ అన్నారు.‘‘దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకోవచ్చని ఆలోచన కలిగే వ్యక్తి చంద్రబాబు. ఇలాంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడా ఉండరు.కల్తీ నెయ్యి అన్నది దుర్మార్గమైన ఆలోచన, కట్టుకథ.ఇంత దుర్మార్గమైన ఆలోచన ఎవరైనా చేస్తారా?.లడ్డూ తయారీకి నాసిరకం ఉత్పత్తులు, నెయ్యికి బదులు జంతువుల కొవ్వు ఉపయోగించారని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు మాట్లాడడం,అబద్ధాలాడటం ధర్మమేనా? కోట్ల మంది భక్తుల మనోభావాలతో ఆడుకోవడం సరైనదేనా?’’ అని జగన్ ప్రశ్నించారు.

ప్రధాన మంత్రికి,సీజేఐకి ఫిర్యాదు చేస్తా:జగన్

రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు తిరుమల ఆలయాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని, దీనిపై ప్రధాన మంత్రికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తానని జగన్ అన్నారు.‘‘వైవీ సుబ్బారెడ్డి 45 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నారు. టీటీడీ చైర్మన్ పదవి చేపట్టదగ్గ అర్హత ఆయనకు కాక మరెవరికి ఉంటుంది?నెయ్యి సరఫరాదారుల కోసం ప్రతి ఆరు నెలలకోసారి ఆన్‌లైన్‌లో టెండర్లు పిలుస్తారు.నిబంధనలకు అనుగుణంగా ఉన్న టెండర్లను ఓకే చేస్తారు. ఎవరు నెయ్యి సరఫరా చేసినా,ట్యాంకర్‌తో పాటు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి నాణ్యతకు సంబంధించిన సర్టిఫికెట్ తీసుకుని రావాలి.ఆ తర్వాత టీటీడీ ఆ ట్యాంకర్ నుంచి మూడు శాంపిళ్లు తీసుకుని పరీక్షలకు పంపిస్తుంది.ఆ మూడు టెస్టుల్లో పాసైన తర్వాతే నెయ్యి,ఇతర ఉత్పత్తులను ఉపయోగించడానికి టీటీడీ అనుమతిలిస్తుంది.లేదంటే..ఆ నెయ్యి ట్యాంకర్ కనీసం ముందుకు కూడా వెళ్లదు.దాన్ని వెనక్కి పంపించివేస్తారు.ఇంత ప్రక్రియ ఉన్నప్పుడు కల్తీ నెయ్యి వాడారని,జంతువుల కొవ్వు ఉందని రకరకాలుగా చంద్రబాబు చెప్పడం న్యాయమేనా?’’ అని జగన్ అన్నారు.

‘‘చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 2014-2019 మధ్య నెయ్యి నాణ్యంగా లేకపోవడంతో 14 నుంచి 15 సార్లు ట్యాంకర్లను వెనక్కి పంపారు.వైసీపీ హయాంలో 18 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపారు.నాణ్యతను పరిశీలించే ప్రక్రియ టీటీడీ దగ్గర ఇంత పటిష్టంగా ఉంటే..నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని, అలా తయారైన లడ్డూలను భక్తులు తినేశారని చంద్రబాబు చెప్పడం దారుణం’’ అని జగన్ అన్నారు.‘‘నెయ్యి ట్యాంకర్ శాంపిల్ తీసుకుంది జూలై 12న అని అప్పుడు అధికారంలో ఉంది ఎవరు?నాణ్యత లేదని నేషనల్ డెయిరీ డెవలప్‌ మెంట్ బోర్డు జులై 23న నివేదిక ఇచ్చింది.ఈ రెండు నెలల నుంచి చంద్రబాబు ఏం చేస్తున్నారు?రెండు నెలలుగా టీటీడీ స్పందించకుండా టీడీపీ ఆఫీసులో ఈ రిపోర్టును రిలీజ్ చేశారు’’ అని జగన్ ఆరోపించారు.‘‘నెయ్యి సరఫరా చేసే బాధ్యతను ఉద్దేశపూర్వకంగానే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు చెందిన నందిని సంస్థకు ఇవ్వలేదని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనూ కొన్నేళ్లు నందిని నెయ్యి సరఫరా కాలేదు’’ అని జగన్ చెప్పారు.

నెయ్యి నాణ్యతపై టీటీడీ ఈవో ఏమన్నారంటే...

 

తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యి నాణ్యతపై జరుగుతున్న వివాదంపై టీటీడీ ఈవో శ్యామలరావు స్పందించారు.తాను ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నెయ్యి నాణ్యతపై సమాచారం సేకరించామని అన్నారు.‘‘లడ్డూ నాణ్యత పడిపోయిందని,లడ్డూలో వాడిన నెయ్యి నాణత్యపై ఫిర్యాదులు వస్తున్నాయని, జంతువుల కొవ్వు వాడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయని,దీనిపై దృష్టిపెట్టాలని చంద్రబాబు ఆదేశించారు.’’ అని ఈవో చెప్పారు. జూన్ 16న టీటీడీ ఈవోగా తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత స్థానిక సిబ్బంది నుంచి సమాచారం సేకరించగా... నెయ్యి నాణ్యత బాలేదని వాళ్లు చెప్పారని ఈవో తెలిపారు.లడ్డూ నాణ్యత బాగుండాలంటే నెయ్యి నాణ్యత బాగుండాలని,స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడితేనే లడ్డూ నాణ్యత బాగుంటుందని,లేకపోతే తిరుమల పవిత్రత దెబ్బతింటుందని నిపుణులు అన్నారని ఈవో చెప్పారు.‘‘నెయ్యి నాణ్యత గమనిస్తే.. అది నెయ్యా లేదా నూనెనా? అన్న సందేహాలు వచ్చాయి.ఇది గమనించిన తర్వాత క్వాలిటీ నెయ్యి సరఫరా చెయ్యకపోతే బ్లాక్ లిస్ట్‌లో పెడతామని సరఫరాదారులను హెచ్చరించాం’’ అని శ్యామలరావు చెప్పారు.టీటీడీకి సొంత ల్యాబ్ లేదని ఈవో శ్యామలరావు చెప్పారు.అయితే సరఫరాదారులు అందిస్తున్న నెయ్యి నాణ్యతను ఎన్ఏబిఎల్ అక్రిడిటేడ్ ల్యాబ్స్‌లో టెస్టింగ్ చేసుకోవచ్చని,కానీ తాను ఈవోగా బాధ్యతలు చేపట్టకముందు బయటి ల్యాబ్‌ లలో సైతం టెస్టింగ్ జరగలేదని ఈవో అన్నారు.‘‘అడల్ట్రేషన్ ల్యాబ్ ఏర్పాటుకు రూ.75 లక్షలు మాత్రమే ఖర్చుఅవుతుంది.కానీ ల్యాబ్ ఎందుకు ఏర్పాటు చేయలేదో తెలియదు.సొంత ల్యాబ్ లేకపోవడం,బయట కూడా నాణ్యతా పరీక్షలు నిర్వహించకపోవడంతో ఈ విషయాలను అలుసుగా తీసుకుని సరఫరాదారులు నాణ్యత లేని నెయ్యి సరఫరా చేశారు’’ అని ఈవో ఆరోపించారు.‘‘కేజీ నెయ్యి రూ.320 నుంచి రూ.411లకు సరఫరా చేశారు. ఇంత తక్కువ రేటులో నెయ్యి సరఫరా చేయడం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు.నెయ్యిని తక్కువ రేటుకు కొనడం వల్ల నాణ్యత పడిపోయింది.నేను ఈవో అయిన తర్వాత నెయ్యి నాణ్యతపై ప్రశ్నించి, రఫరాదారులను బ్లాక్ లిస్ట్ చేస్తామని హెచ్చరించడంతో ఆ కంపెనీలు నాణ్యమైన నెయ్యి సరఫరా చేయడం మొదలుపెట్టాయి’’ అని ఈవో చెప్పారు. చెన్నైకి చెందిన ఏఆర్ ఫుడ్స్ డెయిరీ ఫుడ్ ప్రయివేట్ లిమిటెడ్ మాత్రం తన తీరు మార్చుకోలేదని ఈవో ఆరోపించారు. ‘‘ఈ ఏడాది మార్చి 12న నెయ్యి సరఫరాదారుల కోసం టెండర్లను పిలిచారు.మే 8న ఏఆర్ ఫుడ్స్ టెండర్‌ను ఖరారు చేశారు.మే 15 నుంచి ఏఆర్ ఫుడ్స్ నెయ్యి సరఫరా ప్రారంభించింది.కేజీ రూ.319కే అందించారు.నెయ్యి నాణ్యతా ప్రమాణాలు పరిశీలించే క్రమంలో మేం ఏఆర్ ఫుడ్స్ పంపించిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిని పరీక్షించాం.ఎన్‌డీడీబీ ల్యాబ్‌లో నెయ్యి నాణ్యతా పరీక్షలు జరిగాయి.ఏఆర్ ఫుడ్స్ జులై 6న రెండు ట్యాంకర్లు,జులై 12న రెండు ట్యాంకర్లు పంపించింది.వాటి నాణ్యత పరీక్షల రిపోర్టులు ఒక వారం తర్వాత అందాయి.ఆ నెయ్యిలో అసలే మాత్రం నాణ్యత లేదని నివేదికల్లో తేలింది’’ అని ఈవో శ్యామలరావు వివరించారు.

నెయ్యి నాణ్యతను పరిశీలించేందుకు

‘ఎస్ వాల్యూ’ టెస్ట్‌తో పాటు 39 రకాల పరీక్షలు ఉంటాయి.అందులో ఒకటి బీటాసైటోస్టెరాల్ టెస్ట్.ఆ టెస్టు ద్వారా కూరగాయాల కొవ్వు కలుస్తుందా లేదా అన్నది తెలుస్తుంది.ఎస్ వాల్యూ టెస్ట్‌ లో ఐదు రకాలు ఉంటాయి. సోయాబీన్ ఆయిల్,సన్‌ఫ్లవర్,ఆలివ్ ఆయిల్,ఫిష్ ఆయిల్ వంటివాటిపై చేసిన టెస్ట్ ఫలితం నిర్దిష్ట స్థాయిలో ఉంటే,ఆ నెయ్యి నాణ్యతతో ఉన్నట్టు.టోటల్ ప్యూరిటీ టెస్టు లో మిల్క్ ఫ్యాట్ ఉందా లేదా అన్నది తెలుస్తుంది.ఏఆర్ ఫుడ్స్ సరఫరా చేసిన నెయ్యి ఏ టెస్టులోనూ నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం లేదు.

ఎస్ వాల్యూ టెస్టు ఫలితం 95.68 నుంచి 100.32 నుంచి ఉండాలి. ఏఆర్ ఫుడ్స్ సరఫరా చేసిన నెయ్యి వాల్యూ 20.32 అని తేలింది.సోయాబీన్ ఆయిల్, సన్ ఫ్లవర్,ఆలివ్ ఆయిల్, ఫిష్ ఆయిల్ వంటివి టెస్టు చేసినప్పుడు నిర్దిష్ట ఫలితం 98 ఉండాలి.కానీ ఆ నెయ్యిలో ఫలితం 87.61గా వచ్చింది.లాడ్ అని పిలిచే పంది కొవ్వుకు సంబంధించిన టెస్టు వాల్యూ 116 వచ్చింది. పామాయిల్,బీఫ్ టాలో 95కి పైన వాల్యూ ఉండాల్సి ఉండగా,ఈ నెయ్యిలో 23.22 ఉంది. నాలుగు రిపోర్టుల్లో ఇలాంటి ఫలితాలే వచ్చాయి’’ అని ఈవో వివరించారు.‘‘ల్యాబ్ నివేదికలు అందిన తర్వాత నెయ్యి సరఫరా నిలిపివేయాలని ఏఆర్‌ ఫుడ్స్‌ను కోరాం.వారిని బ్లాక్ లిస్టులో పెట్టడం,పెనాల్టీ విధించడం వంటి చర్యలు తీసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాం.భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిపుణుల కమిటీని నియమించాం. నిపుణుల కమిటీ సలహా మేరకు టెండర్లను పిలిచి నెయ్యి సరఫరాదారును ఖరారు చేశాం.అన్ని టెస్టుల తర్వాతే సరఫరాదారును ఖరారు చేశాం’’ అని ఆయన చెప్పారు.లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి నాణ్యత పరీక్షించేందుకు కావాల్సిన ల్యాబ్ ఏర్పాటు చేసేందుకు ఎన్‌డీడీబీ ముందుకొచ్చిందన్నారు.రూ.75 లక్షల విలువైన సామాగ్రిని ఉచితంగా అందిస్తోందని తెలిపారు.

ఏఆర్ డెయిరీ స్పందన..

జూన్, జులైలో టీటీడీకి నెయ్యి సరఫరా చేశామని,ఆ నెయ్యిలో ఎలాంటి‌ కల్తీ జరగలేదని చెన్నైకి చెందిన ఏఆర్ డెయిరీ తెలిపింది. ఫుడ్ సేఫ్టీ విభాగం, అగ్‌మార్క్ అధికారులు శాంపిళ్లు సేకరించి,ఎలాంటి సమస్య లేదని తేల్చారని ఏఆర్ డెయిరీ ఫుడ్ క్వాలిటీ చెకింగ్ డిపార్ట్‌మెంట్ ఇన్‌చార్జ్ లెని చెప్పారు.

అంతకుముందు చంద్రబాబు ఏమన్నారు?

బుధవారం (సెప్టెంబర్ 18) ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆ క్రమంలో ఆయన తిరుమల లడ్డూ తయారీలోనూ గత ప్రభుత్వం నాణ్యత ప్రమాణాలు పాటించలేదంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘తిరుమల లడ్డూను కూడా నాసిరకంగా తయారు చేస్తున్నారు.ఎన్నోసార్లు చెప్పాం.కానీ,అక్కడ దుర్మార్గమైన ప్రయత్నాలు చేశారు.అన్నదానంలో కూడా క్వాలిటీ లేకుండా చేశారు.దేవుడి దగ్గర పెట్టే ప్రసాదాన్ని అపవిత్రం చేసే విధంగా వ్యవహరించారు. ఒక్కోసారి చాలా బాధేస్తోంది.నాసిరకమైన ఇన్‌ గ్రీడియెంట్సే కాకుండా నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్‌ను వాడారు.మేం నాణ్యత పెంచుతాం.వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడే బాధ్యత మనందరిపైనా ఉంది’ అన్నారు చంద్రబాబు.

పవిత్రమైన లడ్డూ తయారు చేయిస్తున్నాం: చంద్రబాబు

తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై గురువారం చంద్రబాబు మరోసారి స్పందించారు.కోట్లాదిమంది ఎంతో పవిత్రంగా భావించే తిరుమల ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారని,ఇప్పుడన్నీ సరిచేసి నాణ్యమైన ముడిసరుకు ఇచ్చి,పవిత్రమైన లడ్డూ తయారీ చేయిస్తున్నామని చంద్రబాబు చెప్పారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow