అణు యుద్ధం అంటూ పుతిన్ ఎందుకు వార్నింగ్ ఇస్తున్నారు?
రష్యా స్టూడియో భారత్ ప్రతినిధి
రష్యాకు,నాటో కు మధ్య ఉద్రిక్తత మరోసారి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.ఉక్రెయిన్ కు సాయంగా నాటో తన దళాలను పంపినట్లయితే అణు యుద్ధ ప్రమాదం ఉండొచ్చని రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా హెచ్చరించారు.కొంతకాలంగా ఉక్రెయిన్ కు దళాలను పంపేందుకు నాటో ప్రయత్నాలు చేస్తోందని పుతిన్ తన వార్షిక ప్రసంగంలో అన్నారు.గతంలో మన దేశం మీదకు సైన్యాన్ని పంపిన చరిత్ర మనకు గుర్తుంది.అమెరికా,యూరప్ లను టార్గెట్ చేసుకోగల ఆయుధాలు కూడా మన దగ్గర ఉన్నాయని వారు కూడా గుర్తు పెట్టుకుంటే మంచిది.ఇలాంటి పరిణామాలు అణుయుద్ధానికి దారి తీయవచ్చు,నాగరికతలు అంతమైపోవచ్చు.ఆ పరిస్థితిని తీసుకురావద్దు’’ అని ఆయన హెచ్చరింపు స్వరంతో వ్యాఖ్యానించారు.
రష్యా సైన్యంలో త్వరలో చేరబోయే వ్యూహాత్మక ఆయుధాల గురించి కూడా పుతిన్ ఈ ప్రసంగంలో వివరించారు.అణు వార్ హెడ్ ను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ‘సర్మత్’ అనే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి కూడా ఉంది. పుతిన్ నుంచి ఈ హెచ్చరికలు ఎందుకు? వాస్తవానికి, అణుయుద్ధం ప్రమాదం గురించి పుతిన్ చేసిన హెచ్చరిక ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ వ్యాఖ్యల తర్వాత వెలువడింది.ఉక్రెయిన్ కు దళాలను పంపే విషయంలో అన్ని అవకాశాలను పరిశీలిస్తామని మేక్రాన్ ఇటీవల అన్నారు.అయితే,అమెరికా,యూకే,జర్మనీలాంటి దేశాలను ఈ ప్రతిపాదనను తోసిపుచ్చాయి.రష్యా,ఉక్రెయిన్ ల యుద్ధం మూడో ఏడాదిలోకి ప్రవేశించింది.రష్యా సైన్యంతో ఉక్రెయిన్ రాడుతున్నప్పటికీ ఆయుధాల కొరత సమస్య ఆ దేశాన్ని వేధిస్తోంది.ఈ యుద్ధంలో తమ సైనికులు ఇప్పటి వరకు 31 వేల మంది మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఇటీవల వెల్లడించారు.ఆయుధాల సరఫరాను పెంచాలని పాశ్చాత్య దేశాలను జెలెన్‌స్కీ కోరారు.మరోవైపు,ఉక్రెయిన్ లో రష్యా సైన్యం ముందుకు సాగుతోంది.
దీంతో ఉక్రెయిన్ ఈ యుద్ధంలో మనుగడ సాగించడం కష్టంగా మారుతోంది.పశ్చిమ దేశాలు తమ సైన్యాన్ని యుక్రెయిన్‌కు పంపితే అది రష్యా,నాటోల మధ్య ప్రత్యక్ష యుద్ధమే అవుతుందని పుతిన్ అన్నారు.ఉక్రెయిన్ కు నాటో దళాలను పంపే అవకాశాలను తోసిపుచ్చలేమని ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ చేసిన ప్రకటన అవివేకంతో చేసిన ప్రకటనగా పరిగణిస్తున్నట్లు చెప్పారు.‘మేక్రాన్ చేసింది ఒక ఉన్మాద ప్రకటన’ అని ‘ది హిందూ పత్రికకు విదేశీ సంపాదకుడిగా వ్యవహరిస్తున్న స్టాన్లీ జాన్ అన్నారు.‘‘నాటో నుంచి ఆర్ధిక, సైనిక సాయం ఉన్నప్పటికీ యుక్రెయిన్ ఈ యుద్ధంలో రష్యాను ఎదుర్కోలేకపోతోందని ఫ్రాన్స్ భావిస్తున్నట్లుగా ఉంది’’ అని ఆయన రాశారు.అదే సమయంలో అమెరికాలో రాజకీయాల కారణంగా ఉక్రెయిన్ కు ఆ దేశం ఇవ్వాల్సిన 60 బిలియన్ డాలర్ల ఆర్ధిక సాయం పార్లమెంటు అనుమతి లేక నిలిచిపోయింది.రష్యా దూకుడు ధోరణి పెరిగిన దృష్ట్యా యూరప్ ఆయుధాల ఉత్పత్తిని పెంచింది. వేసవి సమీపిస్తున్న కొద్దీ, రష్యా సైన్యం తమ దేశంలోకి మరింత చొచ్చుకు రాగలదని ఉక్రెయిన్ సైన్యం ఆందోళన చెందుతోంది.ఉక్రెయిన్ కు ఆయుధాలు, యుద్ధ సామగ్రి సరఫరా అందకపోతే పరిస్థితి మరింత దిగజారవచ్చు.
అమెరికా ఏం చెప్పింది?
పుతిన్ చేసిన హెచ్చరిక బాధ్యతారాహిత్యమని అమెరికా అభివర్ణించింది.అయితే,పుతిన్ ఊహించుకున్నట్లుగా అంత పెద్ద ప్రమాదం కూడా లేదని వ్యాఖ్యానించింది.అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ... ‘‘పుతిన్ ఇలా బాధ్యతారాహిత్య ప్రకటన చేయడం ఇదే తొలిసారి కాదు.అణ్వాయుధాలున్న దేశ అధినేత ఇలా మాట్లాడకూడదు.’’ అన్నారు.అణ్వాయుధాలను ఉపయోగించడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ముందుగా రష్యాకు నేరుగా,వ్యక్తిగతంగా చెప్పామని ఆయన అన్నారు.రష్యా అణ్వాయుధాలను ప్రయోగించే యోచనలో ఉన్నట్లు తమకు ఎలాంటి సూచనలు కనిపించలేదని మిల్లర్ అన్నారు.
పుతిన్ ఇంకా ఏమన్నారు?
పుతిన్ వార్షిక ప్రసంగం రెండు గంటల ఆరు నిమిషాల పాటు కొనసాగింది.ఒకరకంగా పుతిన్ దీని ద్వారా తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల ముందుంచారు.రష్యాలో మార్చి 15 నుంచి 17 వరకు అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.పుతిన్ ఇందులో విజయం సాధిస్తే ఆయన పాతికేళ్ల పాలనకు మరో ఆరు సంవత్సరాల పాలన తోడవుతుంది.జోసెఫ్ స్టాలిన్ తర్వాత రష్యాను అత్యధిక కాలం పాలించిన నాయకుడిగా పుతిన్ రికార్డులకెక్కారు.2020లో రాజ్యాంగాన్ని మార్చడం ద్వారా 2036 వరకు రాష్ట్రపతిగా కొనసాగేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.అప్పటికి ఆయన వయసు 83 ఏళ్లకు చేరుకుంటుంది.ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ప్రస్తావిస్తూ...రష్యా విజయం సాధించడంలో ప్రతి ఒక్కరూ తమవంతు పాత్ర పోషిస్తున్నారని పుతిన్ అన్నారు.2022లో యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి తమ నిబద్ధతను నిలబెట్టుకున్నామన్నారు.
What's Your Reaction?